Statue Formation
-
పార్లమెంటులో అల్లూరి విగ్రహం..!
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్లో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గురువారం స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంపై విగ్రహ కమిటీ కూడా ఆమోదం తెలిపినందున ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రఘురామ కృష్ణంరాజు విలేకర్లతో మాట్లాడుతూ.. తెలుగు ప్రజలతో పాటు చత్తీస్ గఢ్, ఒరిస్సాలోని ఏజెన్సీ ప్రాంతాల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుందని, 73వ స్వాతంత్ర దినోత్సవం కల్లా అల్లూరి విగ్రహ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జులై 4న అల్లూరి జయంతి సందర్భంగా ఆరోజు పార్లమెంట్లో ప్రత్యేకంగా మాట్లాడేందుకు జీరో అవర్‌లో స్పీకర్ అనుమతి కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. -
‘సీతాదేవి అందుకు పూర్తి అర్హురాలు’
లక్నో : అఖండ భారతావనిని ఏకం చేసిన సర్ధార్ వల్లభ్‌భాయ్ పటేల్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఐక్యతా విగ్రహం ఆవిష్కరణ అనంతరం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దాదాపు 221 మీటర్ల ఎత్తు ఉండే రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యోగి తెలిపారు. రాముడి విగ్రహంతో పాటు సీతా దేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలంటూ యోగికి లేఖ రాశారు యూపీ కాంగ్రెస్ నాయకుడు కరణ్ సింగ్. ‘మీరు రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే నా అభ్యర్థన ఏంటంటే రాముడి విగ్రహం ఎత్తును తగ్గించడమే కాక శ్రీరామునితో పాటు సీతాదేవి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయండి. రామున్ని పెళ్లి చేసుకున్న తర్వాత సీతా దేవి అయోధ్య వచ్చారు.. కానీ కొద్ది రోజుల్లోనే శ్రీరామునితో కలిసి వనవాసం చేయడానికి అడవులకు వెళ్లారు. 14 ఏళ్లు అరణ్యవాసంలో ఉన్నారు. చివరకు రావణాసురుడు అమ్మను ఎత్తుకెళ్లాడు. ఆ రాక్షసుడి చెర నుంచి రాముడు సీతాదేవిని విడిపించాడు. కానీ అగ్ని పరీక్షలో నెగ్గినప్పటికి.. చివరకూ ఆ తల్లి మళ్లీ అడవుల పాలయ్యారు. అది గర్భవతిగా ఉన్న సమయంలో.. మొత్తంగా చాలా తక్కువ రోజులు మాత్రమే సీతాదేవి అయోధ్యలో ఉన్నారు. కానీ అయోధ్యలో ఉండటానికి ఆ తల్లికి పూర్తి అర్హత ఉంది. కనుక కేవలం రాముని విగ్రహాన్ని మాత్రమే కాక.. సీతారాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయండంటూ’ కరణ్ సింగ్ తన లేఖలో రాశారు. -
తంగడపల్లిలో జయశంకర్ విగ్రహం ఆవిష్కరణ
చౌటుప్పల్ (మునుగోడు) : తంగడపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో జయశంకర్ పాత్ర ఎంతో కీలకమన్నారు. 1969 నుంచి తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరంతరం శ్రమించారని కొనియాడారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు. నేటి తరానికి ఆచార్య జయశంకర్ ఆదర్శనీయుడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని కోరారు. సర్పంచ్ ముటుకుల్లోజు దయాకరాచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, మార్కెట్ చైర్మెన్ బొడ్డు రేవతిశ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మెన్ చిరందాసు ధనుంజయ, ఎంపీటీసీ బీపీ కరుణ, గ్రంధాలయ చైర్మెన్ ఊడుగు మల్లేశం, ఉప సర్పంచ్ అరిగె కిష్టయ్య, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పీవీ సేవలు మరువలేనివి
నర్సంపేట రూరల్ : మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సం పేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలో గురువారం పీవీ.నర్సింహారావు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సురభి ఎ డ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుర భి వాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీవీ.నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు, రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సం స్కరణలు తీసుకొచ్చేందుకు పీవీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ప్రపంచ దేశాలు పీవీ.నర్సింహారావు చేసిన సేవలను కొనియాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పీవీ.నర్సింహారావు భౌతిక కాయాన్ని కనీసం పార్టీ కార్యాలయానికి కూడా తీసుకురానివ్వలేదని విమర్శించారు. పీవీ జయంతి వేడుకలను నిర్వహించాలని నర్సంపేట ఎమ్మెల్యేకు సమాచారం అందించినా రాకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పీవీ నర్సింహారావుపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో 7 ఫీట్ల పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు పీవీ.నర్సింహారావు జీవిత చరిత్రను తెలుసుకుని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. లక్నెపల్లి గ్రామంలోని పీవీ.నర్సింహారావు స్మారక మందిరంలో లైబ్రరీని ఏర్పాటుచేసేందుకు సురభి ఎడ్యుకేషన్ సొసైటీ ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ. నర్సింహారావు జన్మించిన లక్నెపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులు స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. లక్నెపల్లి గ్రామం నుంచి ఎంతో మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాలని ఈసందర్భంగా కోరుకుంటున్నన్నారు. రాష్ట సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ లక్నెపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటా యించామని, త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడారి కవిత, తహసీల్దార్ పూల్‌సింగ్‌చౌహాన్, మదన్మోహన్రావు, ఎన్ఆర్ఐ వేణుగోపాల్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ భగ్గి నర్సింహారాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శి నర్సయ్య, గూళ్ల అశోక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, కౌన్సిలర్ నాయిని నర్సయ్య, బైరి మురళి పాల్గొన్నారు. -
మోదీ రూట్లో యూపీ సీఎం కూడా...
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ రాముడి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేయబోతున్నారు. సరయు నది ఒడ్డున ‘నవ్య అయోధ్య’లో భాగంగా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు గవర్నర్ రామ్ నాయక్‌కు పర్యాటక శాఖ ఓ ప్రతిపాదన పంపగా.. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ అవానిశ్ కుమార్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారంట. సుమారు 100 మీటర్లు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. ఎత్తు విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అది ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు పొందాక సరయుఘాట్ లో రాముడి విగ్రహ నిర్మాణ పనులు మొదలవుతాయని చెబుతున్నారు. అధికారికంగా ఎంత ఖర్చవుతుందో వెల్లడించలేదు. ఇదే సమావేశంలో దీపావళి పండగ సందర్భంగా నిర్వహించబోయే వేడుకల గురించి కూడా చర్చించినట్లు అధికారులు తెలిపారు. లక్ష దీపోత్సవంతోపాటు అయోధ్య వరకు శోభ యాత్ర నిర్వహించేందుకు ఆదిత్యానాథ్ సర్కార్ సిద్ధమౌతోంది. దేశ ఐక్యతకు చిహ్నంగా మోదీ పేర్కొంటూ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహాన్ని నర్మదా నదీ తీరంలో నెలకొల్పబోతున్న విషయం తెలిసిందే. 182 మీటర్ల(597 అడుగులు) ఎత్తుతో 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2500 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదన్న మాట. ఈ విగ్రహం నిర్మాణానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. -
జన హృదయూల్లో ముళ్లపూడికి చిరస్థానం
♦ హరిశ్చంద్రప్రసాద్ విగ్రహావిష్కరణలో ♦ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తణుకు : భావితరం, యువతరంతో పాటు రాబోయే తరాలను గుర్తు చేయడానికి దివంగత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ, పట్టణ పేదరిక నిర్మూలన, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తణుకు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రపతి రోడ్డును ఆనుకుని జెడ్పీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన ముళ్లపూడి కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. సమాజంలో సంస్కారవంతుల్ని గౌరవించుకోవడం ద్వారా మనల్ని మనం గౌరవించుకున్నట్లేనని చెప్పారు. ముళ్లపూడి విగ్రహాన్ని ఆవిష్కరించుకుని జిల్లా ప్రజలు తమను తాము గౌరవించుకున్నారన్నారు. ఆయన వేసిన ప్రతి అడుగు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అన్ని రంగాలపై ప్రత్యేక ముద్ర వేసుకున్న ముళ్లపూడి విలువలను వారసత్వంగా అందించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విగ్రహ శిల్పి రాజ్‌కుమార్ వడయార్, రైతుసంఘం అధ్యక్షుడు బొల్లిన విశ్వనాధంలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, మునిసిపల్ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బసవా రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు ఆత్మకూరి బులిదొరరాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, మునిసిపల్ మాజీ చైర్మన్ ముళ్లపూడి రేణుక, ఆంధ్రాసుగర్స్ ఎండీ పెండ్యాల నరేంద్రనాథ్‌చౌదరి, మాజీ ఎమ్మెల్సీ, జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్, జేఎండీలు ముళ్లపూడి తిమ్మరాజా, పెండ్యాల అచ్యుతరామయ్య, వార్డు కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
తమిళనాడులో వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
కొరుక్కుపేట: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి తమిళనాడులో ఏర్పాటు చేయనున్న విగ్రహాల ఆవిష్కరణకు హాజరుకావాల్సిందిగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో జగన్ నివాసంలో కలుసుకున్న కేతిరెడ్డి ఒక ప్రకటన ద్వారా చెన్నై మీడియాకు వివరాల విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా తన పాలనతో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన వైఎస్ఆర్కు తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని ఆయన జగన్‌కు చెప్పారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న చెన్నై, హోసూరు, తిరువళ్లూరు జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాలను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ విగ్రహ ప్రతిష్ట, ఆవిష్కరణ కార్యక్రమాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించినట్లు కేతిరెడ్డి తెలి పారు. ఈ సందర్భంగా వై ఎస్ జగన్మోహన్రెడ్డికి తమిళనాడులోని తెలుగు ప్రజల భాషాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు చెప్పారు. తమిళనాడులో తెలుగు ప్రజలు దాదాపు 40 శాతం మంది వున్నారని, తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మద్దతు తెలపాలని జగన్మోహన్రెడ్డిని కోరామని అన్నారు. చెన్నై నగరం, కృష్ణగిరి జిల్లాలోని హోసూరు, తిరువళ్లూర్ జిల్లాలో తెలుగు ప్రజలు ఇటీవల సమావేశమై వైఎస్ఆర్ విగ్రహాల స్థాపనకు తీర్మానించిన విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాలకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు కేతిరెడ్డి తెలిపా రు. జగదీశ్వరరెడ్డితో పాటు తెలుగు యువశక్తి కార్యవర్గ సభ్యులైన ఎస్.యుగంధర్, కె.సుధాకర్‌రెడ్డి, ఎస్.కోటేశ్వరరావు, రామకృష్ణ, జీఎస్ కృష్ణారావు పాల్గొన్నారు.