తమిళనాడులో వైఎస్ విగ్రహాలు ఏర్పాటు చేస్తాం
కొరుక్కుపేట: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి తమిళనాడులో ఏర్పాటు చేయనున్న విగ్రహాల ఆవిష్కరణకు హాజరుకావాల్సిందిగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. హైదరాబాద్‌లో జగన్ నివాసంలో కలుసుకున్న కేతిరెడ్డి ఒక ప్రకటన ద్వారా చెన్నై మీడియాకు వివరాల విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా తన పాలనతో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన వైఎస్‌ఆర్‌కు తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని ఆయన జగన్‌కు చెప్పారు. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న చెన్నై, హోసూరు, తిరువళ్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ విగ్రహాలను నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఆ విగ్రహ ప్రతిష్ట, ఆవిష్కరణ కార్యక్రమాలకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించినట్లు కేతిరెడ్డి తెలి పారు. ఈ సందర్భంగా వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమిళనాడులోని తెలుగు ప్రజల భాషాపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు చెప్పారు. తమిళనాడులో తెలుగు ప్రజలు దాదాపు 40 శాతం మంది వున్నారని, తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మద్దతు తెలపాలని జగన్‌మోహన్‌రెడ్డిని కోరామని అన్నారు. చెన్నై నగరం, కృష్ణగిరి జిల్లాలోని హోసూరు, తిరువళ్లూర్ జిల్లాలో తెలుగు ప్రజలు ఇటీవల సమావేశమై వైఎస్‌ఆర్ విగ్రహాల స్థాపనకు తీర్మానించిన విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాలకు జగన్ సానుకూలంగా స్పందించినట్లు కేతిరెడ్డి తెలిపా రు. జగదీశ్వరరెడ్డితో పాటు తెలుగు యువశక్తి కార్యవర్గ సభ్యులైన ఎస్.యుగంధర్, కె.సుధాకర్‌రెడ్డి, ఎస్.కోటేశ్వరరావు, రామకృష్ణ, జీఎస్ కృష్ణారావు పాల్గొన్నారు.