భారత్ పరపతి హోదా యథాతథం: మూడీస్
న్యూఢిల్లీ: ద్రవ్యలోటు లక్ష్య సాధన తడబాటు ప్రభావం భారత్ పరపతి హోదాపై (క్రెడిట్ ప్రొఫైల్) ఉండబోదని మూడీస్ పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగించడం సహా ఇతర అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తక్కువ ద్రవ్యలోటు లక్ష్యాలను, ద్రవ్య స్థిరీకరణను కొనసాగిస్తుందని అభిప్రాయపడింది. 2016-17లో 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధనలో కార్పొరేట్ లాభాలు, ప్రభుత్వ రాబడి పెరుగుదల వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా మారనున్నాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ అసోసియేట్ ఎండీ అత్సి శేత్ తెలిపారు.
ద్రవ్యలోటు స్థిరీకరణ అనేది ఒక ప్రక్రియ అని, అది ఏ ఒక్క అంశంపై ఆధారపడబోదని చెప్పారు. ఒక ఏడాదితో పోలిస్తే మరొక ఏడాదిలో భారత ప్రభుత్వం తక్కువ ద్రవ్యలోటునే లక్ష్యంగా నిర్దేశించుకుంటుందని అంచనా వేశారు. ప్రభుత్వపు సంస్కరణల జాప్యాల ప్రభావం భారత్ క్రెడిట్ ప్రొఫైల్ అంచనాలపై ఉండదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ద్రవ్యలోటు స్థిరీకరణ కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తోందని, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అది భవిష్యత్తులో అలాగే కొనసాగుతుందని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2015-16)లో ద్రవ్యలోటును 3.9 శాతానికి, 2016-17లో 3.5 శాతానికి లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఐఎంఎఫ్.. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను 3.6 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.