ఆస్తి కోసమే ప్రత్యూషపై వేధింపులు?
పైశాచికానికి పాల్పడిన పినతల్లికి రిమాండ్
హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ ఆనందనగర్‌కు చెందిన ప్రత్యూషను గృహ నిర్బంధం చేసి చిత్ర హింసలకు గురిచేసిన ఆమె సవతి తల్లి చాముండేశ్వరిని గురువారం ఎల్బీనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా బీఎస్ఎన్ఎల్లో ఏఈగా పనిచేస్తున్న యువతి తండ్రి రమేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. చాముండేశ్వరి ప్రత్యూషను ఏడాది కాలంగా చిత్రహింసలకు గురిచేస్తుండగా అందుకు రమేష్ సహకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న మానవహక్కుల కమిషన్, పోలీసులు బాధితురాలి ఇంటిపై దాడిచేసి ఆమెను బుధవారం గృహనిర్బంధం నుంచి విముక్తికలిగించిన సంగతీ విదితమే. ఈ కేసులో చాముండేశ్వరిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రమేష్‌ను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ప్రత్యూష ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
యువతి ఆస్తిపై కన్నేసినందునే
ఈ కేసులో ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని కాజేసేందుకే సవతి తల్లి ఆమెపై అకృత్యాలకు దిగినట్లు తెలుస్తోంది. 2003లో రమేష్‌కుమార్ మొదటి భార్య సరళాదేవి భర్తతో విడిపోయే సమయంలో పద్మారావునగర్‌లో ఉన్న శ్రీరామ్ సీతమ్స్ అపార్ట్మెంటులో ఉన్న ప్లాటును వారి కుమార్తె ప్రత్యూష పేరుమీద రాయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం సరళాదేవి మృతి చెందింది. ఈ క్రమంలో ప్రత్యూషను బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్పించారు.
2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరడంతో తండ్రి రమేష్ బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో తన ఇంటికి తెచ్చాడు. అయితే పద్మారావునగర్ ప్లాటు విలువ సుమారు రూ.కోటి ఉండడంతో ఆ ఆస్తి ప్రత్యూషకు దక్కుతుందేమోనన్న భయంతో రమేష్ రెండో భార్య చాముండేశ్వరి యువతిని చిత్రహింసలకు గురిచేసేది. ఈ సంఘటనలో రమేష్‌కుమార్ అరెస్ట్ అయితే పూర్తి వివరాలు తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు.