ఆటలో కొట్లాట.. బాలుడు మృతి
► ఆట కోసం గొడవపడిన ఫైజల్, అతని బావమరిది
► ఫైజల్‌కు గాయాలు.. చికిత్స పొందుతూ మృతి
► ఆస్పత్రి వర్గాల ఫిర్యాదుతో కేసు నమోదు
హైదరాబాద్: బావా బావమరుదులైన ఇద్దరు మైనర్లు సరదాగా మొదలుపెట్టిన ఆట గొడవకు దారితీసింది. గెలుపోటముల్లో వివాదం ఇద్దరు తన్నుకునే స్థాయికి చేరింది. చివరికి ఇది ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. సోమవారం మీర్‌చౌక్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.శివభాస్కర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. నగరంలోని శాలిబండ ఖిల్వత్ ప్రాంతానికి చెందిన ఖాలేద్ బిన్ మహ్మద్ ఆంజా, అమీనా బేగానికి కుమార్తె, కుమారుడు ఫైజల్ బిన్ ఖాలేద్(14) ఉన్నారు. ఫైజల్ ఆష్రఫుల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 2న అమీనా కుమారుడితో కలసి మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పంజేషా గుర్వాన్ గల్లీలో ఉండే తల్లిగారింటికి వచ్చింది. 6న రాత్రి 10 గంటలకు అమీనా సోదరుడు అలీ బిన్ మహ్మద్ సాధి కుమారుడి(11)తో ఫైజల్ లూడో ఆడుతున్నారు.
ఇందులో ఫైజల్ ఓడిపోవడంతో.. ఇద్దరి మధ్య గొడవ జరిగి కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఫైజల్‌కు తీవ్ర గాయాలవడంతో స్పృహ తప్పి కిందపడిపోయాడు. శబ్ధం విని కుటుంబ సభ్యులు గదిలో చేరుకొని.. స్పృహ తప్పిన ఫైజల్‌ను ఆస్రా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఫైజల్ మృతి చెందాడు. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.