కథ చెబుతాను.. జై కొడతావా...
కథలంటే పిల్లలకి చెప్పే కథలనుకున్నారా? పెద్దలు కూడా వినాల్సిన కథలు.
ఊ కొట్టి ఊరుకుంటే సరిపోయేవి కాదు జనంతో కలిసి జై కొట్టాల్సిన కథలు.
కొండల్ని, గుట్టల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే కథలు, నీటిని,
గాలిని కలుషితం చేయవద్దనే స్ఫూర్తిని నింపే కథలు...
సంపుల్‌గా కాలుష్యం గురించి చెప్పేస్తే సరిపోతుందా? దానికీ ఒక కథారూపం ఇచ్చి వినిపిస్తే... దాని ప్రభావం కళ్లకు కడుతుంది. మనసు పర్యావరణానికి జై కొడుతుంది. ‘ఇప్పుడు ప్రతి అంశానికీ స్టోరీ టెల్లింగ్‌ను మేళవిస్తున్నారండీ. ఏ విషయమైనా కథలా చెబితేనే మనసులకు హత్తుకుంటుందనే ఆలోచనే దీనికి కారణం’ అన్నారు నగరానికి చెంది న ప్రసిద్ధ స్టోరీ టెల్లింగ్ ఆర్టిస్ట్ దీపాకిరణ్. ఇటీవలే బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌లో ‘సేవ్ రాక్ సొసైటీ’ నిర్వహించిన స్టోరీ టెల్లింగ్ సెషన్ దీనికో ఉదాహరణ. ఈ కార్యక్రమంలో భాగంగా కొండరాళ్ల విశిష్టత, వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత వంటివి కథలు కథలుగా వినిపించారు దీపాకిరణ్. ‘ఏ అంశానికి ఆ అంశంపై రీసెర్చ్ చేసి కథలు రాసుకుని, వాటిని వినసొంపుగా వినిపించడం నాకు ఎప్పటికప్పుడు ఒక ఛాలెంజ్‌గా మారుతోంది. ఏది ఏమైనా పిల్లలకు కథలు వినిపించడం ద్వారా వారిలో క్రియేటివ్ స్కిల్స్‌ను పెంచడంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా నా కళ విస్తరిస్తున్నందుకు ఆనందంగా ఉంది’ అంటున్నారు దీపాకిరణ్. విన్నారు కదా. జై కొట్టండిక.