story writing
-
నాలోని ప్రపంచాన్ని రాశా!
ఓ తమిళ చిత్రానికి కథ రాస్తున్నట్లు ఇటీవల శ్రుతీహాసన్ చెప్పారు. ఇప్పుడు ఓ మ్యూజిక్ వీడియోను విడుదల చేసే పని మీద ఉన్నారు. నిజానికి ఈ పాటను బ్రిటన్‌లో ఓ వేదిక మీద ప్రేక్షకులకు వినిపించారు. ఈ పాట రాసింది ఆమే. ‘‘అక్కడి శ్రోతలు పాటను బాగా ఎంజాయ్ చేశారు. ఈ పాటనే కొంచెం కొత్త రకంగా మలచి విడుదల చేయనున్నాను’’ అన్నారు శ్రుతీహాసన్. ఒకవైపు ఈ పనులు చేయడంతో పాటు నటిగా రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారామె. అయినప్పటికీ కవితల పుస్తకాన్ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘నా పదో ఏట నుంచే కవితలు రాస్తున్నాను. ఈ మధ్య నా ఫ్రెండ్స్ కొందరు ఆ కవితలన్నింటినీ బుక్ రూపంలో తీసుకురావొచ్చు కదా అన్నారు. ఆ ఐడియా నచ్చింది. ఒక నటిగా నేను బయటి ప్రపంచంలోనే ఎక్కువ టైమ్ గడుపుతుంటాను. కానీ నా లోపలి ప్రపంచం ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రపంచం గురించే కవితలు రాశాను’’ అన్నారు శ్రుతీహాసన్. -
సాహిత్యంతో సద్గుణాలు అలవడుతాయి
కేంద్ర సాహిత్య అకాడమీ సంచాలకులు ఆచార్య ఎన్.గోపి సిరిసిల్ల: బాలసాహిత్యంతో పిల్లల్లో సద్గుణాలు అలవడుతాయని, బాలల మనోవికాసానికి సాహిత్యం ఎంతో అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సంచాలకులు ఎన్.గోపి అన్నారు. పఠనాసక్తి తగ్గిపోయిన ఈ రోజుల్లో సాహిత్యంపై పిల్లలకు అవగాహన లేకుండా పోతోందని, ఇలాంటి శిబిరాల ద్వారా పిల్లలకు సాహిత్యంపై ఆసక్తిని పెంచవచ్చని అన్నారు. పద్నాలుగేళ్ల వరకు బాలసాహిత్యంపై పిల్లలకు ఆసక్తిని కలిగిస్తే.. మానవీయ విలువలు, కరుణ, ప్రేమ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సాగిస్తారని వివరించారు. బాలసాహిత్యం రాయాలంటే తల్లివంటి ప్రేమ ఉండాలన్నారు. సాహిత్య అకాడమీ యాభై ఏళ్లలో ఆరువందల పుస్తకాలు ముద్రిస్తే.. గత రెండేళ్లలోనే రెండువందల పుస్తకాలు ముద్రించిందన్నారు. సమావేశంలో నేషనల్ బుక్‌ట్రస్ట్ అసిస్టెంట్ ఎడిటర్ డాక్టర్ పత్తిపాక మోహన్, రంగినేని సుజాత మోహన్‌రావు ట్రస్ట్ వ్యవస్థాపకుడు రంగినేని మోహన్‌రావు, ప్రముఖ కవులు జూకంటి జగన్నాథం, డాక్టర్ నలిమెల భాస్కర్, పెద్దింటి అశోక్‌కుమార్, మద్దికుంట లక్ష్మణ్, బాలసాహితీవేత్తలు వాసాల నర్సయ్య, భూపాల్, చొక్కాపు వెంకటరమణ, కందేపి రాణీప్రసాద్, దాసరి వెంకటరమణ, తిరునగరి వేదాంతసూరి, ఆకేళ్ల వెంకటసుబ్బలక్ష్మీ, పెండెం జగధీశ్వర్, ఎస్.కె.అబ్దుల్ హకీం జాని, పైడిమర్రి రామకృష్ణ, మలయశ్రీ, వి.ఆర్.శర్మ, దార్ల బుజ్జిబాబు, ఎస్.రఘు, పెందోట వెంకటేశ్వర్లు, వాసరవేణి పర్శరాములు, రంగినేని నవీన్, తూడి వెంకట్రావు, గరిపెల్లి అశోక్, డాక్టర్ జనపాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
కొడెక్కైనాల్ లో కథ రాస్తున్న మణిరత్నం
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తన తాజా చిత్రానికి కొడెక్కైనాల్లో కథను వండుతున్నారు.కడల్ చిత్రం వరకూ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ దర్శక రత్నం ఒరు కాదల్ కణ్మణి చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టారు. అయితే ఆ తదుపరి చిత్రానికి పలుమార్లు ప్రయత్నించినా సెట్ కాలేదు. ఒరు కాదల్ కణ్మణి చిత్రం తరువాత మణిరత్నం ఒక భారీ మల్టీస్టారర్ చిత్రానికి సిద్ధమయ్యారు.అయితే అనివార్య కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అదే కథను కార్తీ,దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌లతో చేయాలనుకున్నా అదీ జరగలేదు.ఇక మల్టీస్టారర్ చిత్రం ప్రయత్నాన్ని పక్కన పెట్టి తాజాగా ఫ్రెష్‌గా కార్తీ, సాయిపల్లవిల కోసం ఒక కథను తయారు చేస్తున్నారు. ఇదీ విభిన్న ప్రేమ కథా చిత్రమేనని తెలిసింది. ప్రస్తుతం కొడెక్కైనాల్లో ఈ కథకు మెరుగులు దిద్దుతున్న మణి మరో పది రోజుల వరకూ అక్కడే మకాం పెట్టి స్క్రిప్ట్‌ను రెడీ చేసి చెన్నైకి తిరిగిరానున్నట్టు తెలిసింది. తదుపరి చిత్ర సంగీతం,తదిరత ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు ఉపక్రమించనున్నట్లు సమాచారం. దీనికి మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు అందించనున్న విషయం తెలిసిందే. నటుడు కార్తీ కూడా తన గురువు మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఇటీవలే అన్నారు.ప్రస్తుతం ఆయన నయనతార, నిత్యామీనన్‌లతో కలిసి కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనితో ఉన్నారన్నది గమనార్హం. తదుపరి ఆయన నటించేది మణిరత్నం చిత్రంలోనేనన్నమాట. -
కథ రాయడం చాలా కష్టం
అభిప్రాయం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, గుండెను తడి చేసే కథలు రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథ గురించి, కథ రాయడంలోని కష్టం గురించి ‘సాక్షి’తో సంభాషించారు.. కథ రాయాలంటే... కేవలం ఇతరుల రచనలు చదవడమే కాకుండా, లోకజ్ఞానం కోసం అనేక ప్రాంతాలు సందర్శించినప్పుడే మంచి కథలు వస్తాయి. తలుపులు మూసుకు కూర్చుంటే ఉత్తమ కథలు రావు. అనేక జీవితాలను పరిశీలించాలి. ఒక వింతైన మాట, వింతైన దృశ్యం కథ అవుతుంది. అయితే దాన్ని పట్టించుకోవాలి. అది మనసులో బీజంలా నాటుకోవాలి. అప్పుడు అది మనకు తెలియకుండానే మనలో పెరిగిపెరిగి మాను అవుతుంది. అప్రయత్నంగా కథరూపంలా బయటకు వస్తుంది. అయితే, కథ రాసేవారికి బయటి నుంచీ ఏవీ సహకరించవు. రచయిత చూసినవి, రచయిత స్వానుభవం మాత్రమే కథలో ఉంటాయి. కథ రాయడానికి మనిషి మానసికంగా బాధ పడాలి, అనుభూతి చెందాలి. ఉత్తమకథ అంగవైకల్యం లేని శిశువులా బయటకు వస్తుంది. చిన్న కథ పుట్టుక... ‘చిన్న కథ’ గోదావరి, కృష్ణా తీర ప్రాంతాలలో పుట్టి పెరిగింది. అయితే, ఇప్పుడు కోస్తా జిల్లాల నుంచి కథలు రావట్లేదు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుంచి మంచి కథలు వస్తున్నాయి. అక్కడ మనిషికి భూమితో ఇంకా సంబంధం తెగిపోలేదు. భూమి పండితే సంతోషం, ఎండితే దుఃఖం. వారి కథలలో భూమి, మనిషి కథాంశాలు. వీరు కూడా రచించారు... ప్రక్రియలన్నిటిలో కూడా కథానిక ప్రత్యేకమైనది. ఇది పాశ్చాత్య ప్రక్రియ. పాఠకులకు ఒక జీవిత శకలాన్ని చూపించే సాధనం కథ. ఉత్తమ కథానికలో ఒక్క అక్షరం కూడా వృథాపోదు. కథలో సాధారణ మానవుడి జీవితాన్ని సాధారణమైన పద్ధతిలో ఉన్నది ఉన్నట్టు చెప్పొచ్చు. కృష్ణశాస్త్రి, విశ్వనాథ, వేలూరి వంటి పద్యకావ్య రచయితలు సైతం కథానికలు రాశారు. వారు కథను ప్రేమించారు. వాటి గొప్పదనాన్ని గుర్తించారు. ‘ముసురు’ కథ... ఒక శవం పక్కన ఒక తమిళ అమ్మాయి కూర్చున్న దృశ్యం నన్ను ఆకర్షించింది. ఏం జరిగిందని పక్కన వాళ్లను అడిగితే, వారిద్దరూ ప్రేమికులనీ, లేచిపోయి వచ్చారనీ, చిన్న చిన్న పనులు చేసి జీవనం సాగిస్తున్నారనీ, అతడు చనిపోయాడనీ, ఆ అమ్మాయికి మన భాష రాదనీ చెప్పారు. ఆ దృశ్యం చూశాక అంతర్మథన పడ్డాను. అందులో నుంచి వ చ్చిన కథే ‘ముసురు’. ‘ఇంగువ’ గురించి... నా బాల్యమిత్రుడు ‘ఇంగువ అంటే ఏంటి?’ అని అడిగాడు. ఆ తరవాత కొన్నాళ్లకి చనిపోయాడు. ఇంతకీ అతడు ఈ విషయం తెలుసుకుని పోయాడా, తెలుసుకోకుండా పోయాడా అనుకున్నాను. జీవితంలో తెలుసుకునేవి తక్కువ, తెలియని విషయాలు ఎక్కువ. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘ఇంగువ’ కథ. ఇలా ఎన్నో కథలు నేను ఎన్నో జీవితాలను పరిశీలించి రాసినవే. పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో రైలు తుడవ డానికి ఎక్కే నలుగురు కుర్రాళ్ల జీవితాల మీద నాలుగు కథలు రాశాను. వారిలోనూ అద్భుతమైన జీవితం ఉంటుంది. వాళ్లకి ఆ స్టేషనే జన్మస్థలం, పడక, పక్క అన్నీ! వాళ్లు అక్కడ నుంచి బయటకు వెళ్లలేకపోతారు. వెళ్లాలంటే భయం. విమర్శలు... చాలామంది నా కథలు ఏడుపు కథలన్నారు. కరుణ అనేది సున్నితమైన సూత్రం. అది తెగితే జుగుప్స. నేను అచ్చంగా చూసిన జీవితాన్ని చూసినట్టు రాశాను. అలాగే, మనిషిలో అసంతృప్తి అనే లక్షణం ఉంటుంది. ఆ అసంతృప్తే నా కథలకు ప్రధాన వస్తువు. సరిగ్గా పరిశీలించి అర్థం చేసుకునేవారికి, మన చుట్టూ ఉన్నవన్నీ కథా వస్తువులే. అయితే, కథలు చదవడానికి కూడా ఒక కల్చర్ ఉండాలి. ఇంకించుకునేవారు ఉత్తమ పాఠకులు. - డా. పురాణపండ వైజయంతి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, విజయవాడ ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి