అర్చకుల సమ్మెతో ఉద్రిక్తత
హైదరాబాద్: ఆలయ అర్చక, ఉద్యోగులు చేపట్టిన సమ్మె తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేలా ముఖ్యమంత్రికి బుద్ధి ప్రసాదించాలని అర్చకులు ఆదివారం హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఎదుట నిర్వహించ తలపెట్టిన సుదర్శన హోమం ఉద్రిక్తంగా మారింది. సమ్మెలో పాల్గొనేందుకు అర్చకులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే హోమం నిర్వహించేందుకు అనుమతి లేదంటూ ఆలయ కార్య నిర్వహణా అధికారి వినోద్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు.
హోమానికి అనుమతించకపోవడంతో అర్చకులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు అర్చకులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సమయంలో భరత్‌నగర్ ఆలయానికి చెందిన అర్చకులు శ్రీనివాస్, లక్ష్మణ్ ఆలయం గోపురంపైకి ఎక్కి తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
అర్చకుల అసోసియేషన్ నాయకులు మాట్లాడి కిందకు దిగాలని కోరడంతో వారు దిగారు. సుమారు 3 గంటల పాటు బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద హైడ్రామా జరగడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, అర్చక అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంగారెడ్డి, వెంటేశ్వర్రావు, నర్సింగరావు, రవీంద్రా చార్యులు తదితరులు పాల్గొన్నారు. కాగా అర్చకుల సమ్మెకు కాంగ్రెస్, టీడీపీ మద్దతు తెలిపాయి. ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యను పరిష్కరించాలని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రావణ్, సనత్‌నగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కూన వెంకటేశ్‌గౌడ్‌లు పేర్కొన్నారు.