ఐసిస్... అలా... ఇలా!
♦ భావజాల వ్యాప్తితో ప్రస్థానం ప్రారంభం
♦ విధ్వంసాలకు సిద్ధమైన ‘జునూద్’ మాడ్యూల్
♦ స్ట్రైకింగ్‌కు రంగంలోకి దిగిన ఏయూటీ ముఠా
♦ రెండేళ్లలో నగరంలో ఎన్నో మార్పులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) మన నగరానికి సంబంధించి అనేక రూపాలు సంతరించుకుంది. ప్రేరణ, భావజాల వ్యాప్తితో ప్రారంభమైన దీని ‘ప్రస్థానం’ రెండేళ్ల కాలంలో స్ట్రైకింగ్ మాడ్యూల్ ఏర్పాటు వరకు వెళ్లింది. పోలీసు, నిఘా వర్గాల చర్యలు సైతం ఆ స్థాయిలోనే ఉన్నాయి. కౌన్సెలింగ్‌తో మొదలుపెట్టిన అధికారులు కేసులు, అరెస్టుల వరకు వెళ్లారు. ఈ పరిణామ క్రమంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
ఆసక్తి చూపిన వారిపై కన్నేసి...
నగరంలోఐసిస్ ఛాయలు తొలిసారిగా 2013లో వెలుగులోకి వచ్చాయి. సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది యువత ఐసిస్‌కు సంబంధించిన వెబ్సైట్లు, బ్లాగ్లు నిశితంగా పరిశీలిస్తున్న, అనుసరిస్తున్న విషయాన్ని గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. రంగంలోకి దిగిన రాష్ట్ర నిఘా వర్గాలతో పాటు సిటీ పోలీసులూ వివిధ ప్రాంతాల యువతపై కన్నేసి ఉంచారు. వారి కార్యకలాపాలన్నీ నిశితంగా గమనించారు. ఎలాంటి విపరీత పరిణామానికి ఆస్కారమున్నట్లు అనుమానం వచ్చినా... తదుపరి చర్యలకు ఉపక్రమించారు. అనూహ్యంగా కొన్ని రోజులకు వారి ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ అంశానికి తెరపడినా.. నిఘా కొనసాగింది.
అడుగేసిన వారికి కౌన్సెలింగ్
ఆ తర్వాత ఏడాది నగరంలో పరిస్థితి కొద్దిగా మారింది. ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొందిన యువత మరో అడుగు ముందుకు వేసింది. ఎలా వెళ్లాలో తెలియకపోయినా... సిరియా గమ్యంగా బయలుదేరింది. పశ్చిమ బెంగాల్ మీదుగా దేశ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ చేరుకుని... అక్కడి నుంచి సిరియా వెళ్లేందుకు నలుగురు నగర యువకులు ప్రయత్నించారు. అప్పటికే నిఘా ఉండటంతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సిటీ పోలీసులను అలెర్ట్ చేశాయి. దీంతో బయలుదేరి వెళ్లిన సిటీ పోలీసు బృందాలు కోల్‌కతాలో వారిని పట్టుకున్నాయి. ఈ నలుగురినీ హైదరాబాద్‌కు తరలించిన పోలీసులు... వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి... కేసు లేకుండా వదిలిపెట్టారు.
అరెస్టుల పర్వం...
2015 నాటికి నగరంపై ఐసిస్ ప్రభావం మరింత పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్ ద్వారా ఆకర్షించిన ‘సిరియా నేతలు’ నగర యువతతో మరో అడుగు ముందుకు వేయించారు. అక్కడ జరుగుతున్న ‘యుద్ధం’లో పాల్గొనేలా ప్రేరణ కల్పించారు. ఇలా ఐసిస్ మైకంలో పడిన సల్మాన్ మొహియుద్దీన్ దుబాయ్‌కు పయనమయ్యాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతడిని శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు చేతులు దాటే ప్రమాదం ఉండటంతో అరెస్టు చేశారు. గత ఏడాది అరెస్టు చేసిన ‘ఐసిస్ త్రయం’ వ్యవహారమూ ఇలాంటిదే.
‘జేకేహెచ్’ స్కెచ్...
గత ఏడాది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసిన ఐసిస్ అనుబంధ ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ ఇంకొంత దూరం వెళ్లింది. ఆన్లైన్ ద్వారానే ప్రేరణ పొందిన నలుగురు నగర వాసులు ‘పై నుంచి’ వచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడే ఏదో ఒక విధ్వంసం సృష్టించాలని భావించారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఇతర ప్రాంతాల్లో చిక్కిన వారితో పాటు అరెస్టయ్యారు. ఈ కేసులో నగర ఐసిస్ కోణంలో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ మాడ్యూల్ ఇతర రాష్ట్రాల్లోనూ వ్యాపించింది.
హైదరాబాద్ ‘మార్కు’...
తాజాగా ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసిన ఏయూటీ హైదరాబాద్ మాడ్యూల్ అప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వాటిని తలదన్నింది. మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ నేతృత్వంలోని ఈ గ్యాంగ్ చాలా దూరం వెళ్లిపోయింది. నగరంలో విధ్వంసానికి పథకం వేయడం... అవసరమైన పేలుడు పదార్థాలను సమీకరించుకోవడం... ఐఈడీల తయారీపై ప్రయోగాలు పూర్తి చేసింది. జూలై 1, 2 తేదీల్లో ‘టార్గెట్’కు సిద్ధం చేసుకుని బుధవారం చిక్కింది. దేశంలో పట్టుబడిన ఐసిస్ మాడ్యూల్స్‌లో ఇదే తొలి స్ట్రైకింగ్ మాడ్యూల్ అని నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది పూర్తిగా స్థానికులతోనే కూడిన హోమ్ గ్రోన్ ‘లోకల్ మేడ్’ కావడం గమనార్హం.