రూ.12 కోట్లతో ‘కార్మిక’ అధ్యయన కేంద్రం
రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పరమేశ్వర నాయక్
సాక్షి, బెంగళూరు : కార్మికుల సమస్యలకు సరైన పరిష్కా రాలు కనుగొనేందుకు నిరంతర అధ్యయనాల అవసరమని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి పరమేశ్వర నాయక్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కార్మిక అధ్యయన కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. అంతేకాక ఆ కేంద్రం ఏర్పాటుకు రూ.12.60 కోట్ల నిధులను విడుదల చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘అసంఘటిత రంగాల్లోని కార్మికుల సామాజిక భద్రత’ అనే అంశంపై గురువారమిక్కడ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కేంద్రం ద్వారా కార్మికుల సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం సులభతరమవుతుందని అన్నారు. అసంఘటిత కార్మిక భద్రతా మండలి ఇప్పటికే 43 విభిన్న రంగాల్లోని కార్మికులను గుర్తించిందని చెప్పారు.
కార్మికుల సంక్షేమాన్ని కోరుకునే సంఘాలు సైతం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పరమేశ్వర నాయక్ సూచించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్‌షాప్‌లో కార్మిక సంఘాల నేతలు, అధికారులు కలిసి చర్చించి కార్మికుల సమస్యల పరిష్కారానికి సరైన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రామమూర్తి, అడిషనల్ డెరైక్టర్ జింకలప్ప తదితరులు పాల్గొన్నారు.