రాజకీయ చతురుడు.. సాహతీ కోవిదుడు
సబ్ ఎడిటర్ నుంచి సీఎం దాకా..
భువనేశ్వర్: నలభైయేళ్లపాటు ఒడిశా రాజకీయాలను శాసించిన జేబీ పట్నాయక్ బహుముఖ ప్రజ్ఞాశాలి. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన.. సాహిత్యం, జర్నలిజం, సాంస్కృతిక రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. రాజకీయ వారసత్వం లేకున్నా.. రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా ఎదిగారు. 1980లో సీఎంగా పగ్గాలు చేపట్టి 1989 వరకు ఆ పదవిలో ఉన్నారు. తర్వాత 1995లో మళ్లీ సీఎంగా ఎన్నికై 1999 వరకు కొనసాగారు. 2004 నుంచి ఐదేళ్ల వరకు ఒడిశాలో విపక్ష నేతగా ఉన్నారు. 2009లో అస్సాం గవర్నర్‌గా నియమితులయ్యారు.
ఆయన 14 ఏళ్ల పాలనలో ఒడిశా అభివృద్ధి పథాన దూసుకుపోయింది. అస్సాం గవర్నర్‌గా ఉన్నప్పుడు పట్బౌసీ సత్రా ఆలయంలోని గర్భగుడిలోకి మహిళల ప్రవేశం కోసం కృషి చేశారు. ‘బంకిన్చంద్ర ఉపన్యాసమాల’ అనువాదానికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. 1927లో ఖుర్దాకు దగ్గర్లోని రామేశ్వర్ వద్ద జన్మించిన పట్నాయక్ సంస్కృతంలో డిగ్రీ, రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు. ‘ఈస్టర్న్ టైమ్స్’ ఆంగ్ల పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. తర్వాత ఎడిటర్ అయ్యారు. 1971లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1973-1975 మధ్య ఇందిర హయాంలో రక్షణశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. 1980 వరకు రక్షణశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. 1980లో మళ్లీ లోక్‌సభకు ఎన్నికై.. కేంద్రంలో మంత్రిగా పనిచేశారు.