పన్నీర్ కు డీఎంకే మద్దతు!
చెన్నై: తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ప్రతిపక్ష డీఎంకే ఆపన్నహస్తం అదించనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీలో పన్నీర్ సెల్వంకు బలం నిరూపించుకునే అవకాశం ఇస్తే తమ పార్టీ మద్దతు ఇస్తుందని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సుబ్బలక్ష్మి జగదీశన్ తెలిపారు.
ఎమ్మెల్యేలను నిర్బంధించడం సరికాదని, ఎవరి మద్దతు ఇవ్వాలనే విషయంలో శాసనసభ్యులకు స్వేచ్ఛ ఇవ్వాలని డీఎంకే ఎంపీ కనిమొళి అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోమని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ పన్నీరు సెల్వం బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే డీఎంకే అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నాడీఎంకేలో సంక్షోభం నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు మద్దతుగా స్టాలిన్ మాట్లాడుతుండడం చర్చనీయాంశంగా మారింది. శశికళపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పన్నీర్ చర్యలను ఆయన సమర్థిస్తున్నారు. అయితే తామేప్పుడూ పన్నీర్ సెల్వంను సమర్థించలేదని, అంశలవారీ మద్దతు మాత్రమే ఇచ్చామని స్టాలిన్ చెప్పడంతో డీఎంకే వైఖరి స్పష్టమైందన్న వాదనలు విన్పిస్తున్నాయి. త్వరలో శుభవార్త చెబుతానని గవర్నర్ ను కలిసిన తర్వాత సెల్వం అనడంతో బలనిరూపణకు ఆయనకు అవకాశం ఉంటుదని వార్తలు వస్తున్నాయి.