స్కోడా సూపర్బ్.. కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: స్కోడా కంపెనీ ప్రీమియమ్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ సూపర్బ్‌లో కొత్త వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఈ కారు ధరలు రూ.18.87 లక్షల నుంచి రూ.25.2 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని స్కోడా ఆటో ఇండియా సీఎండీ సుధీర్ రావు తెలిపారు. ఈ కారు పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్లలో లభిస్తుందని, హ్యుందాయ్ సొనాటా, టయోటా కామ్రి, హోండా అకార్డ్, ఫోక్స్‌వ్యాగన్ పసంట్లకు ఈ సూపర్బ్ గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రత్యేకతలు..: సీ షేపు టెయిల్ ల్యాంప్‌లు, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, 6-సీడీ ఛేంజర్, రియర్ పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్ ఓవీఆర్ఎంలు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆరు స్పీకర్లతో కూడిన టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, విశాలమైన క్యాబిన్ స్పేస్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్(డీజిల్ వేరియంట్లో ఆటోమాటిక్ వేరియంట్ కూడా), డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడీలు, 3 స్పోక్ స్టీరింగ్ వీల్ తదితర ప్రత్యేకతలున్నాయి.
ఫాబియాకు టాటా...
ఫాబియా కార్ల ఉత్పత్తిని నిలిపేశామని, కానీ విక్రయాలను కొనసాగిస్తున్నామని సుధీర్ రావు వివరించారు. పుణేలో ఉన్న విక్రయానంతర సర్వీసుల కార్యాలయాన్ని మూసేశామని తెలిపారు. అయితే పూర్తిగా చిన్న కార్ల సెగ్మెంట్ నుంచి వైదొలగలేదని, మళ్లీ ఈ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తామని వివరించారు.