నిజమండి! ఆ తాటిచెట్లు నడుస్తాయ్!!
హాలీవుడ్ ఎపిక్ 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్' సినిమా చూస్తే.. అందులో చిత్రవిచిత్రమైన ప్రాణులతోపాటు నడిచే చెట్లు కూడా కనిపిస్తాయి. వేర్లతో సహా అవి చిత్రంగా నడుచుకుంటూ పోతాయి. ఆ వృక్షాలంతా వేగంగా కాకపోయినా కొంచెం నెమ్మదిగా నడిచే చెట్లు నిజంగానే ఉన్నాయి. వాటిని చూడాలంటే ఈక్వెడార్‌కు వెళ్లాల్సిందే. ఈక్వెడార్ రాజధాని క్విటోకు వాయవ్యంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుమాకో బయోస్ఫెర్ రిజర్వు ఉంది. యూనెస్కో గుర్తించిన ఈ అడవి అంచుకు వెళితే ఆహ్లాదకరమైన అందాలు, సహజ సుందరమైన దృశ్యాలే కాదు.. మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే నడిచే తాటిచెట్లు (పామ్ ట్రీస్) కనిపిస్తాయి.
ఈ తాటిచెట్లు అడవంతా సంచరిస్తూ ఉంటాయి. ఈ చెట్లకు పెరిగే కొత్త వేర్లు క్రమంగా కొత్త ప్రాంతాలకు పాకుతూ పోవడం వల్ల వాటితోపాటు చెట్లు కూడా వెళ్తూ ఉటాయి. కొన్నిసార్లు రోజుకు రెండు, మూడు సెంటీమీటర్లు కూడా ఈ చెట్లు ప్రయాణిస్తుంటాయి. దాదాపు 20 మీటర్ల వరకు ఇవి నడువగలవు. 'భూసారం క్షీణిస్తుండటంతో దృఢమైన మూలాల కోసం ఈ చెట్లు పొడవైన కొత్త వేర్లను పెంచుతాయి. కొన్నిసార్లు ఈ వేర్లు 20 మీటర్ల దూరం వరకు పెరుగుతాయి' అని పురాతన వృక్ష పరిశోధకుడు పీటర్ వృసంకీ తెలిపారు. 'ఇలా కొత్త నేలలోకి తన వేర్లు స్థిరపడిన తర్వాత ఈ తాటిచెట్టు సహనంతో అటువైపు వంగుతాయి. పాత వేర్లు క్రమంగా గాలిలోకి లేస్తాయి. కొత్త వేర్లు పాతుకుంటాయి. ఇలా కొన్ని సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగిన అనంతరం మంచి సూర్యరశ్మి, బలమైన భూసారమున్న ప్రదేశానికి ఈ చెట్టు చేరుతుంది' అని స్లోవాక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బ్రాటిస్లావాలో పనిచేస్తున్న పీటర్ వివరించారు.
అయితే ఎన్నో జీవవైవిధ్య వింతలకు నెలవైన ఈ అటవీ ప్రాంతం ప్రస్తుతం పలు రకాల ముప్పులను ఎదుర్కొంటున్నది. పీటర్, స్థానిక గైడ్, పర్యావరణవేత్త థీయిరీ గ్రాషియా కలిసి కొన్ని నెలలపాటు ఈ అడవిలో గడిపి, ఎన్నో ఆటంకాలు, కష్టనష్టాలు ఎదుర్కొని.. ఇక్కడి విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ మహారణ్యంలో 30 మీటర్లకుపైగా జలపాతాలు, బల్లి, కప్ప జాతులకు చెందిన నూతన జీవులను కనుగొన్నట్టు వారు వివరించారు.