స్త్రీలోక సంచారం
కార్ల అమ్మకాలు, కొనుగోళ్లలో నాలుగో వంతు మార్కెట్ మహిళలదేనని, గత ఐదేళ్లలో మహిళల కొత్త, పాత కార్ల వినియోగం 10–12 శాతం నుంచి 25 శాతానికి రెట్టింపు అయిందని తాజా సర్వేలో వెల్లడయింది. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు మరింత సులభంగా, ఫ్రెండ్లీగా ఉండే ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల ఉత్పత్తి కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని కూడా సర్వేలు కొన్ని పెద్ద కంపెనీల పేర్లను ఉదహరించాయి.
అన్ని జాతులూ కలిసిమెలిసి, స్వేచ్ఛగా జీవించే అమెరికాలో జాతి వివక్షకు చోటు లేదని ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు. తమను తాము ఆధిక్యజాతిగా భావించుకుంటున్న అమెరికన్లు కొందరు వర్జీనియాలోని చార్లెట్‌విల్ పట్టణంలో పరజాతులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మళ్లీ అలాంటి ర్యాలీలే జరిగే అవకాశం ఉండటంతో స్థానికేతరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇవాంకా ఇలా.. (తన తండ్రి మద్దతిచ్చే ఆధిక్య భావజాలానికి పూర్తి విరుద్ధంగా).. ట్వీట్ చేయడం విశేషం.
ఆగస్టు 12న మరణించిన భారత సంతతి బ్రిటిష్ రచయిత, నోబెల్ గ్రహీత వి.ఎస్.నయీపాల్.. స్త్రీల రచనా సామర్థ్యం విషయంలో తేలిక భావంతో ఉండేవారనీ, స్త్రీలోలుడని, స్త్రీలపై తరచు చెయ్యి చేసుకునేవాడని.. నివాళులలో భాగంగా జాతీయ పత్రికల్లో వరదలా వచ్చిపడిన ఆయన జీవిత విశేషాలను బట్టి తెలుస్తోంది. ‘రీడర్స్ డైజెస్ట్’ మాజీ ఎడిటర్ రాహుల్ సింగ్.. నయీపాల్లోని సత్యశీలతను కొనియాడుతూ.. సంక్లిష్టమైన ఆయన వ్యక్తిగతం జీవితానికి నిదర్శనంగా.. మొదటి భార్య ప్యాట్, పెళ్లికాకుండా ఆయనతో కలిసి ఉన్న మార్గరెట్ అనే ఒక అర్జెంటీనా మహిళ, నదీరా అనే మరో పాకిస్తానీ మహిళల గురించి ప్రస్తావించడాన్ని బట్టి నయీపాల్ జీవితంలో స్త్రీలకు పెద్ద స్థానమే ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
ప్రముఖ హాలీవుడ్ నటుడు డెన్జెల్ వాషింగ్టన్.. తన కుమార్తె (ఆమె కూడా హాలీవుడ్ నటి) ఒలీవియాతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారి నడుము విరగ్గొడతానని హెచ్చరించారు. గత ఏడాది హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపులు బహిర్గతం అయిన అనంతరం ‘మీటూ’ ఉద్యమంతో బాధిత నటీమణులంతా సంఘటితం కావడంపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. మీటూ వల్ల హాలీవుడ్ ఇప్పుడు మరింత సురక్షితం అయిందని చెబుతూ, ఒకవేళ తన కూతుర్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిస్తే తక్షణం వెళ్లి వారి వెన్నెముకను సున్నం చేస్తానని డెన్జెల్ అన్నారు.
మేనేజ్మెంట్ డిగ్రీలు లేకపోయినప్పటికీ మహిళలు ఇంటా బయటా పనుల్ని చక్కబెట్టగలరని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. చండీగఢ్‌లో ‘భారత వికాస్ పరిషత్’ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ఒక మహిళ బయటì పనికి వెళ్లి వస్తోందంటే ఆమె ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నట్లు. ఇదే మాట పురుషుడి విషయంలో చెప్పలేం. ఎందుకంటే అతడు బయటి పని మాత్రమే చేస్తాడు తప్ప, ఇంట్లో పూచిక పుల్లంత పని కూడా అందుకోడు’ అని కిరణ్ జీ (చండీగఢ్ ఎం.పి. కిరణ్‌ఖేర్) అన్న మాటను సమర్థించారు.
వయసొచ్చిన కొడుకు విషయంలో తల్లికి ఉండే భయాలు, బెంగలు, ఆరాలు, అనుమానాలు, నిఘాలు.. ఇవన్నీ కలిసి ‘మమ్మా కి పరిచాయి’ (అమ్మ నీడ) అనే థీమ్‌తో విడుదలైన ‘హెలికాప్టర్ ఇలా’ చిత్రంలోని టీజర్ సాంగ్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తల్లిగా కాజల్, కొడుకుగా రిథీ సేన్ కనిపించే ఈ పాటలో.. కొడుకును అనుక్షణం ప్రొటక్ట్ చేసే కేరింగ్ మదర్, తల్లి పోరు పడలేక సతమతమయ్యే కొడుకు కనిపిస్తారు.
‘లండన్ లోని భారత దౌత్య కార్యాలయంలో టీమ్ ఇండియా’ అనే క్యాప్షన్‌తో ఈ నెల 8న బి.సి.సి.ఐ. (బోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ట్విట్టర్లో పెట్టిన గ్రూప్ ఫొటోలో టీమ్ సభ్యులతో పాటు విరాక్ కోహ్లీ భార్య అనుష్కాశర్మ కూడా ఉండటంపై ‘క్రికెట్‌నీ, బాలీవుడ్‌నీ కలపకండి’ అంటూ వస్తున్న ట్రోల్స్ మీద ఎట్టకేలకు అనుష్క స్పందించారు. అయితే.. ‘ఇలాంటి ట్రోల్స్‌కి నేను స్పందించను’ అన్నంత వరకే ఆమె స్పందించారు!
నేడు నటి సుహాసిని 57వ పుట్టినరోజు. భర్త మణిరత్నం.. కొడుకు నందన్.. ఇదీ ఆమె ఫ్యామిలీ. సుహాసిని నాస్తికురాలు. ‘‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దైవ ప్రార్థనల మీద నమ్మకం లేదు. నాకు, నా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వు దేవుడా అని గుడులకు వెళ్లడం మీద నమ్మకం లేదు’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుహాసిని. అలాగే మల్టీ టాస్కింగ్ (ఒకేసారి అనేక పనులు నెత్తికెత్తుకునే నేర్పు) మీద కూడా ఆమెకు నమ్మకం లేదు. ‘అదెలా సాధ్యం?’ అంటారు. ‘‘ఇంట్లో పని ఇంట్లోనే. బయటి పని బయటే. ఇక్కణ్ణుంచి ఆ పని, ఆక్కణ్ణుంచి ఈ పని చెయ్యలేను’’ అని చెబుతుంటారు సుహాసిని.