సమ్మేటివ్–1 పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న ఉన్నత పాఠశాలల్లో 6–10వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్–1 (సంగ్రహణాత్మక మదింపు) పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఏ) విధానం అమలు చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈసారి విద్యాశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెబుతోంది. అన్ని మండలాల్లోనూ ఎమ్మార్సీ కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు భద్రపరిచారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు అక్కడి నుంచి పాఠశాల కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. దూరప్రాంతాల్లో ఉన్న స్కూళ్లకు సీఆర్పీల ద్వారా పంపుతున్నారు.
దీంతో కాస్త దూరంగా ఉన్న స్కూళ్లకైతే కేవలం 5 నిముషాల ముందు ప్రశ్నపత్రాలు చేరాయి. డీఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాలు తరలింపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కొన్ని స్కూళ్లకు ప్రశ్నపత్రాలు కొరత వచ్చిన సంగతి వాస్తవమేననీ, అయితే బఫర్ స్టాకు నుంచి సర్దామన్నారు. ఇక ఈనెల 18న పరీక్షలు ముగుస్తాయనీ, 19 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయని ఆయన వెల్లడించారు.