వర్షాకాలం.. జిడ్డుగా ఉంటే..
వర్షాకాలం చర్మం కొంత అయోమయాన్ని కలిగిస్తుంది.
వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు నూనెగ్రంథులు ఎక్కువ నూనెను స్రవించడంతో చర్మం జిడ్డుగా అనిపిస్తుంది.
వానలో తడిసి, ఆరగానే పొడిబారినట్టుగా గరుకుగా చేతికి తగులుతుంది.
ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే...
♦ ఇంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, చర్మానికి బాగా ఇంకాక శుభ్రపరుచుకోవాలి.
♦ దానిమ్మలో చర్మం ముడతలు పడనివ్వని ఓషధ గుణాలు ఉన్నాయి. దీనిలో ఉండే విటమిన్-సి, యాంటీయాక్సిడెంట్లు ఈ కాలం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, కాంతిని పెంచుతాయి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ రసం, కప్పుడు ఓట్స్, 2 టేబుల్స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల మజ్జిగ వేసి, కలపాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని అలాగే ఉంచి, మెత్తగా అయ్యాక ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. నిగారింపు పెరుగుతుంది.
♦ ఈ కాలం మాయిశ్చరైజర్ రాసుకోవచ్చా, లేదా! అనే సందేహం తలెత్తుతుంది. జిడ్డు ఎక్కువ అనిపించేది కాకుండానూ, అలాగని పొడిబారనీయని లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ఎంచుకోవాలి.
♦ వాతావరణం మబ్బులుగా ఉంటుంది కదా, సన్స్క్రీన్ అవసరం ఉండదని చాలా మంది అభిప్రాయం. కానీ, మబ్బుల దాటుకుని వచ్చే సూర్యకాంతిలోనూ అతినీలలోహిత కిరణాలు ఉంటాయి. అందుకని బయటకు వెళ్లేముందు సన్ప్రొటెక్షన్ లోషన్ (ఎస్.పి.ఎఫ్ -30) రాసుకోవాలి.
♦ జిడ్డును నియంత్రించాలంటే 2 టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టేబుల్స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలిపి, ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి.
♦ ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి పదే పదే సబ్బును ఉపయోగిస్తే చర్మం త్వరగా పొడిబారుతుంది. అందుకని సోప్-ఫ్రీ ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ (మార్కెట్లో లభిస్తుంది) ని ఉపయోగించడం మేలు.