124 ఏళ్లలో కెల్లా అత్యంత వేడి ఫిబ్రవరి
ఈసారి ఎండలు అప్పుడే దంచికొడుతున్నాయి. ఎండాకాలం ఇంకా మొదలైనా కాకుండానే ఠారెత్తిస్తున్నాయి. ఆ క్రమంలో గత 124 ఏళ్లలో అత్యంత వేడిమి ఫిబ్రవరిగా గత మాసం కొత్త రికార్డు సృష్టించింది. గత నెలలో సగటున 22 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 1901 తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి సగటు నమోదవడం ఇదే తొలిసారి. అంతేకాదు, చరిత్రలోనే తొలిసారిగా ఈ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 15 డిగ్రీల పై చిలుకు నమోదై సరికొత్త రికార్డు నెలకొల్పాయి. అంతేగాక సగటు గరిష్ట ఉష్ణోగ్రత విషయంలో 2023 ఫిబ్రవరి నెలకొల్పిన రికార్డును కూడా గత నెల దాదాపుగా అధిగమించినంత పని చేసింది! దీనిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ మార్పుల తాలూకు విపరిణామాలకు ఈ ఉష్ణ ధోరణులు తాజా నిదర్శనమని వారు చెబుతున్నారు. 20 ఏళ్లు వరుసగా చరిత్రలోనే అత్యంత వేడిమి దశాబ్దాలుగా రికా ర్డులు సృష్టించిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అకస్మాత్తుగా వరుణుడు కరుణిస్తే తప్ప వచ్చే మూడు నెలలు ప్రచండమైన ఎండలు తప్పవని సైంటిస్టులు జోస్యం చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్