sunday times
-
ట్వింకిల్, అక్షయ్... ఓ ఆటో
బాలీవుడ్ : సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తోంది సోషల్ మీడియా. సినిమా, క్రీడా ప్రముఖలు చాలామంది తమ భావాలను, అనుభూతులను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి, రైటర్ ట్వింకిల్ ఖన్నా ఆదివారం ఉదయం తన దినచర్యకు సంబంధించిన వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన భర్త అక్షయ్ కుమార్ ఆటో డ్రైవ్ చేస్తుండగా, ట్వింకిల్ వెనకాల కూర్చోన్న ఫొటోను షేర్ చేశారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘ఉదయం పూట నాలుగు గంటలకు లేచి, రెండున్నర గంటల పాటు ప్రశాంతంగా పుస్తక రచన చేశాను. ఆ తర్వాత నా డాగ్‌ని తీసుకుని వాకింగ్‌కి వెళ్లాను, ఆ తర్వాత ఇలా నా క్యూట్ డ్రైవర్‌తో, ఆటో రిక్షాలో సరదాగా విహరించాను. ఇవన్నీ తొమ్మిది గంటల్లోపే పూర్తయ్యాయి. తొందరగా నిద్రపోవడం వల్లే ఇది సాధ్యమైంది. మీరు కూడా ట్రై చేయండి’ అని ఈ ఫొటోను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇది ఒక అక్షయ్‌కి మాత్రమే సాధ్యపడుతుందని ఒకరు, క్యూట్ కపుల్ అని మరొకరు.. కామెంట్లు చేస్తున్నారు. -
అవినీతి ఖాకీ, అక్రమాల ఖద్దరు కలిస్తే ఏమవుతుంది?
అవినీతి ఖాకీ, అక్రమాల ఖద్దరు కలిస్తే ఏమవుతుంది.. ఓ అసాంఘిక శక్తి పేట్రేగిపోతుంది. ప్రశాంతతకు మారుపేరైన మన జిల్లాలోని పెదవేగి మండలం పినకడిమిలో సరిగ్గా ఇదే జరిగింది. విజయవాడ కమిషనరేట్, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పోలీసులకు మూడు వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘పెదఅవుటపల్లి’ ట్రిపుల్ మర్డర్స్ కేసులో ప్రధాన నిందితుడు భూతం గోవిందు పెను‘భూతం’లా మారడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఏ పని చేసినా నాకేంటి అని లెక్కలు వేసుకునే ఓ అవినీతి పోలీస్ అధికారి, వివాదాలతోనే రాజకీయ భవిష్యత్‌కు పునాది వేసుకున్న ఓ నాయకుడు తెరవెనక ఉండి ప్రోద్బలం ఇవ్వడం వల్లనే గోవిందు లండన్‌లోని గార్డియన్, సండే టైమ్స్ వంటి పత్రికల వారు సైతం ఆరా తీసేంతటి ఘరానా నేరస్తుడిగా రూపాంతరం చెందాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా పద్నాలుగేళ్ల కిందట అప్పటి పినకడిమి సర్పంచ్ గురవయ్యతో చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో భూతం గోవింద్‌కు స్థానికంగా ఉన్న పోలీస్ అధికారితో, స్థానిక రాజకీయ నేతతో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి మొదలుకుని సదరు పోలీస్ అధికారితో, ప్రజాప్రతినిధితో పెనవేసుకుపోయిన బంధం ఇప్పటికీ కొనసాగుతోందని అంటున్నారు. బతుకుదెరువు కోసం జాతకాలు చెప్పుకునే గోవింద్ దేశ, విదేశాల్లో తిరిగేంతటి రూ.కోట్ల నగదు, పెదవేగిలో 10 ఎకరాలు, పినకడిమిలో 50 ఎకరాలు, కొప్పాకలో 20 ఎకరాలు, కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని దిగవల్లిలో 30 ఎకరాల మామిడితోట కలిపి మొత్తంగా 100 ఎకరాలకు పైగా స్థిరాస్తులు ఎలా కూడబెట్టాడనేది మిస్టరీగా మారింది. తాను ఆర్థికంగా ఎదుగుతూ, తనకు తొలి దశలో అండగా నిలిచిన పోలీస్, రాజకీయ నేతకు ఆసరాగా ఉంటూ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకున్నాడని అంటున్నారు. ఆ అధికారికి మూడెకరాలు మొదటి నుంచీ తనకు అన్నివిధాలా సహకరిస్తున్న పోలీసు అధికారికి పినకడిమి సమీపంలోని దుగ్గిరాల రెవెన్యూ గ్రామ పరిధిలో మూడెకరాల పొలాన్ని గోవింద్ కొనిపించి ఇచ్చాడని అంటున్నారు. గతంలో ఆ పోలీసు అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ ఉచ్చులో పడి సస్పెండైన సందర్భంలోనూ గోవింద్ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆయనకు పోస్టింగ్ వచ్చేలా సహకారం అందించారని తెలుస్తోంది. ఇక ఏలూరు నగరంలో ఆ పోలీస్ అధికారి కట్టుకుంటున్న ఇంటి కోసం కూడా తనవంతు సహకారం అందించారన్న ప్రచారం ఉంది. ముంబై నుంచి రాజకీయ నేత సోదరుడి అకౌంట్‌కు సొమ్ము పినకడిమిలో రెండువర్గాల మధ్య దూరం పెంచి ఇరువురి నుంచి డబ్బులు తీసుకుని పబ్బం గడుపుకున్న ఓ రాజకీయ పార్టీ నేత వ్యవహారాన్ని పరిశీ లిస్తే.. ఈ ఏడాది ఏప్రిల్‌లో భూతం దుర్గారావు హత్య కేసులో నిందితులైన గంధం నాగేశ్వరరావు, అతని సంబంధీకులు సదరు రాజకీయ పార్టీ నేతనే తొలుత ఆశ్రయించారు. ఆ నాయకుడి ఇంట్లోనే ఒకట్రెండు రోజులు ఆశ్రయం పొందారు. ఆ నాయకుడి బంధువులు ఆ సందర్భంలో వీరికి రూ.లక్ష ఇవ్వగా, ముంబై పరారయ్యారు. ఆ తర్వాత ముం బై నుంచి నేరుగా రాజకీయ నేత సోదరుడి బ్యాంక్ అకౌంట్లో తాము తీసుకున్న రూ.లక్షతోపాటు మరో రూ.5 లక్షలు వేశారు. -
ఆస్ట్రాజెనెకా కోసం ఫైజర్ మెగా బిడ్!
లండన్: ఫైజర్ కంపెనీ ఇంగ్లాండ్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీని చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందని లండన్ నుంచి వెలువడే సండే టైమ్స్ పత్రిక పేర్కొంది. ఆస్ట్రాజెనెకాను కొనుగోలు చేయడానికి ఫైజర్ 101 బిలియన్ డాలర్లు(రూ.6.16 లక్షల కోట్లు) ఆఫర్ చేసిందని ఆ పత్రిక పేర్కొంది. కాగా వాటాదారుల విలువ పెంచడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని ఫైజర్ ప్రతినిధి జువాన్ కాంపియాన్ పేర్కొన్నారు. మార్కెట్ ఊహాగానాలు, వదంతులపై వ్యాఖ్యానించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ విషయమై వ్యాఖ్యానించడానికి ఆస్ట్రాజెనెకా ప్రతినిధి నిరాకరించారు. కాగా ఫైజర్ కంపెనీ 2000లో వార్నర్-లాంబర్ట్ కంపెనీని 87 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఔషధ పరిశ్రమలో ఇదే అత్యంత పెద్ద డీల్. కాగా గత 20 ఏళ్లలో 30 బిలియన్ డాలర్లకు పైబడి కంపెనీల కొనుగోళ్లు 10 వరకూ జరిగాయి. వీటిల్లో ఫైజర్ ఖాతాలో 3 ఉన్నాయి. -
స్కూళ్లలో తీవ్రవాద భావజాలంపై బ్రిటన్ చర్యలు!
లండన్: బ్రిటన్ లోని హెచ్చరిల్లుతున్న ఇస్లామిక్ తీవ్రవాద భావజాలంపై చర్యలు తీసుకునేందుకు ఆ దేశం సిద్ధమైంది. అక్కడి స్కూళ్లలో తీవ్రవాద విధానాన్ని తరగతుల్లో బోధిస్తున్నారన్నఓ మీడియా కథనంతో బ్రిటన్ దాన్నిరూపుమాపేందుకు నడుంబిగించింది. బ్రిటన్ స్కూళ్లలో తీవ్రవాద పోకడలు పెరుగుతున్నట్లు సండే టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించడంతో అప్రమత్తమైన బ్రిటన్ నివారణ చర్యలు చేపట్టింది. ఇస్లామిక్ భావజాలాన్నిస్కూళ్లలో పిల్లలకు నూరిపోస్తే అది వారి విద్యపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విద్యా కార్యదర్శి మైఖేల్ గోవ్ అభిప్రాయపడ్డారు. దీనికి గాను ఇప్పటికే కొన్నిప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆ దేశ స్కూళ్లలో పని చేస్తున్నఇస్లామిక్ టీచర్లు మతపరమైన అంశాలను పిల్లలకు బోధించాలని చూస్తే తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ బృందాలతో పాటు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యయుల సమక్షంలో ఈ అంశాన్ని పర్యవేక్షించనున్నామన్నారు. ఎక్కడైతే సరైన విధానంలో విద్యను బోధించకుండా మతసంబంధమైన అంశాలను పిల్లలకు చెబుతారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.