యువతే దేశానికి సంపద
మహబూబ్‌నగర్ క్రీడలు: ఆత్మ విశ్వాసం కలిగిన యువతే దేశానికి సంపద అని, విద్యార్థి దశనుంచే మంచి గుణాలు అలవర్చుకోవాలని 8-ఏ బెటాలియన్ ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ సునీత్ ఇస్సార్ అన్నారు. 8-ఏ బెటాలియన్ ఎస్సీసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్న క్యాంపులో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువత దేశభక్తిని పెంపొందించుకొని అల్లకల్లోలాలు లేని సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని సూచించారు.
సత్యం, అహింస విధానాల్లో నడిచి సమాజానికి మార్గదర్శకులు కావాలన్నారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్‌ను సందర్శించారు. రైఫిల్ ఫైరింగ్‌పై మెళకువలు నేర్పించారు. ఫైరింగ్ వలన క్యాడెట్లలో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల, సమయపాలన, ధైర్యం అలవడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా 100 మంది క్యాడెట్లు 550 రౌండ్లు ఫైరింగ్ చేశారు. కార్యక్రమంలో క్యాంప్ అడ్జుడెంట్ బి.రఘు, ఎన్సీసీ అధికారులు ఎండీ ఇబ్రహీం, విజయభాస్కర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, క్యాంప్ సుబేదార్ మేజర్ రవిదత్శర్మ, క్యాంప్ సూపరింటెండెంట్లు రమణ, జనార్దన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.