ఉద్యోగులను కబళించిన లారీ
కర్నూలు జిల్లాలో ఐదుగురు దుర్మరణం మృతుల్లో నలుగురు రెవెన్యూ సిబ్బంది
కర్నూలు: విధుల్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటన కర్నూలు జిల్లాలోని 18వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుల్లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ), ముగ్గురు గ్రామసేవకులున్నారు. తీవ్రంగా గాయపడిన ఓర్వకల్లు తహశీల్దార్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) ఏర్పాటుకు అనువైన స్థల పరిశీలనకు కర్నూలు జిల్లా కలెక్టర్ వస్తుండటంతో ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, ఆర్ఐ శ్రీనివాసులుతోపాటు గ్రామసేవకులు, ఇతర ఉద్యోగులు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో నన్నూరు సమీపంలోని గడెంతిప్ప వద్ద ప్రధాన రహదారిపై వేచి ఉన్నారు. అదే సమయంలో సిలికా(కృత్రిమ ఇసుక) లోడుతో నంద్యాల వైపు నుంచి కర్నూలుకు వెళుతున్న మహారాష్ట్రకు చెందిన లారీ వీరిపైనుంచి దూసుకెళ్లి బోల్తాపడింది. ఆర్ఐ శ్రీనివాసులు, గ్రామసేవకులు శివరాముడు(36), రామకృష్ణ(45), వెంకటేశ్వర్లు(43)తోపాటు స్థానికుడు గోపాల్(28) దుర్మరణం పాలయ్యారు. ఓర్వకల్లు తహశీల్దార్ సునీతాబాయి, వీఆర్వో తిమ్మయ్య, గ్రామసేవకుడు నాయుడుకు తీవ్ర గాయాలవగా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో తహశీల్దార్ సునీతాబాయి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్కు తరలించారు. లారీ డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.
ఇసుక మాఫియానే కారణం!
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల మృతికి ఇసుక మాఫియానే కారణమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అనుమానం వెలిబుచ్చింది. ఈ ప్రమాదంపై తమకు అనుమానాలున్నాయని తెలిపింది. ఉద్యోగులను హత్య చేయించడానికి జరిగిన కుట్రగా ఉందని సందేహం వ్యక్తం చేసింది.