సోనియా చొరవతోనే తెలంగాణ
నర్సాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: అమరుల త్యాగ ఫలితం, సోనియాగాంధీ చొరవతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ఆత్మ బలి దానాలు చేసుకున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చొరవ తీసుకున్నారన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీ రాజ్య సభలో మెలిక పెట్టి బిల్లును అడ్డుకునేందుకు కుట్రపన్నిందన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరిచి, రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రి చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపై ఉందన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన మంత్రిని ముందుగా స్థానిక నేతలు మాజీ ఉపముఖ్యమంత్రి జగన్నాథరావు విగ్రహం వద్ద ఘనంగా సన్మానించి ఓపెన్‌టాప్ జీపులో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న మంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ గాంధీ, బాబూజగ్జీవన్‌రామ్, వైఎస్సార్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ర్యాలీలో కార్యకర్తలు బ్యాండ్ మేళాలతో నృత్యం చేయడంతో పాటు పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెంకటరమణారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్, శ్రీధర్‌గుప్తా, చంద్రాగౌడ్, మాజీ ఎంపీపీ లలిత, శ్రీనివాస్‌గౌడ్, అనిల్‌గౌడ్ పాల్గొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు ..
ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నర్సాపూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు తెలిసి సమాచారం వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం లేదన్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ నిర్ణయమే తుది నిర్ణయమని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా కొత్త ముఖ్యమంత్రి నియమించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారన్నారు.
కొత్త కాలనీల అభివృద్ధికి నిధులు
నర్సాపూర్ నియోజకవర్గం కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి భవనానికి రూ. 11 కోట్లు విడుదలయ్యాయని, దీంతో పాటు వెల్దుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి రూ. 98 లక్షలు, మం డలాల్లోని కొత్త కాలనీల అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అలాగే చెక్‌డ్యాంల నిర్మాణానికి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మంజూరుకు నిధులు, హత్నూర, కౌడిపల్లి, కొ ల్చారం మండలాలకు రూ. 7. 50 కోట్లు, ని యోజకవర్గంలోని చెరువులు, కుంటల అభివృద్ధికి రూ. కోటి 8 లక్షలు, బీటీ రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం నిధులు విడుదలైనట్లు మంత్రి చెప్పారు. ఏడుపాయల జాతరను పురస్కరించుకొని ప్రభుత్వం సింగూర్ నుంచి నీటి విడుదల కోసం చర్యలు తీసుకుంటోందన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంత్రి నర్సాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నర్సాపూర్‌లో 100 పడకల ఆస్పత్రి భవనంతో పాటు జూనియర్ కళాశాల భవనం, హత్నూర, శివ్వంపేట, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం మండలాలకు సంబంధించిన బీటీ రోడ్ల మరమ్మతులు, తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయా శాఖ అధికారులు, కాంగ్రెస్ పా ర్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు
వెల్దుర్తి: నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని మంత్రి సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం వెల్దుర్తిలో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి హాస్టల్ బాలికలతో మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులు, యువకుల పోరాటాలు, బలిదానాలకు స్పందించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాలికలు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం మంత్రి బాలికలతో జై సోనియాగాంధీ, జై తెలంగాణ అంటూ నినాదాలు చేయించారు. మంత్రి వెంట స్థానిక నాయకులు, అధికారులు ఉన్నారు.