sunkesula project
-
జలాశయాల పటిష్టతకు అత్యంత ప్రాధాన్యం: అనిల్ కుమార్
గూడూరు : జలాశయాల పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రిజర్వాయర్లను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. సుంకేసుల జలాశయం పనులు పూర్తి కాలేదని, గత ప్రభుత్వం సగం పనులు చేసి వదిలేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించు కోవడంలేదని పిచ్చి రాతలు రాశాయన్నారు. వాస్తవానికి సుంకేసులలో ఎలాంటి పనులూ పెండింగ్‌లో లేవన్నారు. రెండేళ్ల నుంచి రిజర్వాయర్‌కు భారీగా నీరు వస్తోందన్నారు. ఇక్కడ ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టు గేటు విరగడం గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. టీడీపీ హయాంలో పులిచింతలకే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకూ మరమ్మతుల కింద నయాపైసా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. పులిచింతల ప్రాజెక్టు పనులు ఎవరి హయాంలో మొదలయ్యాయి, గేట్లు ఏ ప్రభుత్వ హయాంలో పెట్టారనే కనీస పరిజ్ఞానం లేకుండా ప్రతిపక్షాలు ఆరోపించడం శోచనీయమన్నారు. జలాశయాల సేఫ్టీ మెకానిజం కింద 317 మంది సిబ్బంది అవసరమని గుర్తించి నివేదిక పంపగా సీఎం ఆమోద ముద్ర వేశారన్నారు. కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సుధాకర్, హఫీజ్‌ఖాన్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్ల హర్షవర్ధనరెడ్డి తదితరులు ఉన్నారు. -
‘సుంకేసుల’లో ఉద్రిక్తత
- విద్యుత్ మోటార్ల తొలగింపును అడ్డుకున్న రైతులు - మున్సిపల్ అధికారులతో వాగ్వాదం సుంకేసుల(గూడూరు): తుంగభద్ర నదీ తీరం వెంట విద్యుత్ మోటార్లను తొలగించాలన్న కలెక్టర్ ఆదేశాలతో సోమవారం సుంకేసుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. సుంకేసుల రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1.20 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాంలో 0.302 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు మరో నెలరోజులు మాత్రమే సరిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మోటార్లను తొలగించాలని నాలుగు రోజుల క్రితం కలెక్టర్ సీహెచ్ విజయ్‌మోహన్ కర్నూలు కార్పొరేషన్, ట్రాన్స్‌కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాన్స్‌కో, కర్నూలు కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సోమవారం సుంకేసుల దగ్గరికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కొత్తకోట, సుంకేసుల, ఆర్.కొంతలపాడు, తదితర గ్రామాలకు చెందిన రైతులు జలాశయం దగ్గరికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రవీంద్రబాబు, ఈఈ రాజశేఖర్, కర్నూలు తహసీల్దార్ రమేష్‌బాబు, ట్రాన్స్‌కో గూడూరు ఏడీ పార్థసారధి, తదితర అధికారులు సుంకేసులకు చేరుకోవడంతో రైతులు అధికారులను చుట్టుముట్టి వాదనకు దిగారు. తుంగభద్ర నది నీటిని నమ్ముకుని వందల ఎకరాల్లో ఉల్లి, మొక్కజొన్న, పత్తి, మిరప, చెరుకు, తదితర పంటలు సాగు చేసుకున్నామని.. విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 15 రోజులు అవకాశం ఇస్తే పంటలు చేతికి వస్తాయని అధికారులతో మొరపెట్టుకున్నారు. రిజర్వాయర్‌కు అవతలి వైపు (తెలంగాణ) కూడా అధిక సంఖ్యలో విద్యుత్ మోటర్లు ఉన్నాయని వాటిని తొలగించడం లేదని వాదనకు దిగారు. సాగునీటి కంటే తాగునీరు ముఖ్యమని..అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కోడుమూరు సీఐ శ్రీనివాసులు, గూడూరు, కోడుమూరు ఎస్ఐలు పవన్‌కుమార్, మహేష్‌కుమార్‌లు రైతులకు సర్ది చెప్పారు. కలెక్టర్‌ను కలిసేందుకు కర్నూలుకు వెళ్లిన రైతులు: కలెక్టర్ ఆదేశాల మేరకే విద్యుత్ మోటార్లను తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పడంతో తమ గోడు తెలిపేందుకు సుంకేసుల సర్పంచు నాగన్న ఆధ్వర్యంలో రైతులు కర్నూలుకు వెల్లారు. చేతికి వచ్చిన పంటలు అందకుండా పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రైతులు కర్నూలుకు వెళ్లిన తరువాత ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్లను తొలగించారు. -
టీడీపీ పనైపోయింది
గూడూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పనైపోయిందని, అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఆ పార్టీకి తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన పట్టణంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో జిల్లాలోని ప్రజలు తాగునీటి కష్టాలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా గాజులదిన్నె, సుంకేసుల ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తాగునీటి అవసరాలను కూడా పట్టించుకోకుండా ఖరీఫ్ సీజన్లో అధికారులు ఇష్టం వచ్చినట్లుగా నీటిని విడుదల చేశారన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అభివృద్ధి పనులను పక్కకు పెట్టి ధనార్జనే ధ్వేయంగా పని చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి జపం చేస్తూ ప్రజల సంక్షేమం గాలికొదిలేసారని విమర్శించారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎల్.సుధాకరరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎం.చరణ్‌కుమార్, డీసీసీ కార్యదర్శి గుడిపాడు ఆర్.చంద్రారెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు కెవీ కృష్ణా రెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు కె.తులసీకృష్ణ, డెరైక్టర్ నాగార్జున రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సుంకేశులలో విద్యార్థుల మృతదేహాలు
కర్నూలు : హోలీ సంబరాలు చేసుకునేందుకు సుంకేశుల జలాశయం వద్దకు వెళ్లి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు గురువారం బయటపడ్డాయి. కర్నూలు నగరంలోని సెంట్ జోసెఫ్ కళాశాలకు చెందిన 14 మంది డిగ్రీ విద్యార్థులు బుధవారం హోలీ వేడుకలు జరుపుకున్నారు. సాయంత్రం వారంతా సమీపంలోని సుంకేశుల జలాశయం వద్ద సంబరాల తర్వాత తిరిగి వచ్చే క్రమంలో భార్గవ్, చైతన్య అనే ఇద్దరు విద్యార్థులు తప్పిపోయారు. వారు రాత్రయినా తిరిగి రాకపోయేసరికి గురువారం ఉదయం కుటుంబసభ్యులు వెతికారు. అయితే ఈ రోజు ఉదయం జలాశయం గేట్ వద్ద వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.