
డ్యాంను పరిశీలిస్తున్న మంత్రి అనిల్‌కుమార్
గూడూరు : జలాశయాల పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజర్వాయర్లను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని మండిపడ్డారు. సుంకేసుల జలాశయం పనులు పూర్తి కాలేదని, గత ప్రభుత్వం సగం పనులు చేసి వదిలేయగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టించు కోవడంలేదని పిచ్చి రాతలు రాశాయన్నారు.
వాస్తవానికి సుంకేసులలో ఎలాంటి పనులూ పెండింగ్‌లో లేవన్నారు. రెండేళ్ల నుంచి రిజర్వాయర్‌కు భారీగా నీరు వస్తోందన్నారు. ఇక్కడ ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. పులిచింతల ప్రాజెక్టు గేటు విరగడం గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. టీడీపీ హయాంలో పులిచింతలకే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకూ మరమ్మతుల కింద నయాపైసా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. పులిచింతల ప్రాజెక్టు పనులు ఎవరి హయాంలో మొదలయ్యాయి, గేట్లు ఏ ప్రభుత్వ హయాంలో పెట్టారనే కనీస పరిజ్ఞానం లేకుండా ప్రతిపక్షాలు ఆరోపించడం శోచనీయమన్నారు. జలాశయాల సేఫ్టీ మెకానిజం కింద 317 మంది సిబ్బంది అవసరమని గుర్తించి నివేదిక పంపగా సీఎం ఆమోద ముద్ర వేశారన్నారు. కర్నూలు జిల్లాలో గాజులదిన్నె ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్న తెలిపారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు సుధాకర్, హఫీజ్‌ఖాన్, కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్ల హర్షవర్ధనరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment