Superstar Krishna - Mahesh
-
ఆ రూపంలో ఇంకా జీవించే ఉన్నారు.. మంజల ఘట్టమనేని ఎమోషనల్ ట్వీట్
సూపర్ స్టార్ కృష్ణ మరణం వారి కుటుంబంతో పాటు అభిమానుల్లో విషాదాన్ని నింపింది. ఇవాళ ఆ నటశేఖరుని పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని నాన్నను గుర్తు చేసుకున్నారు. (చదవండి: నాన్న ఎన్నో ఇచ్చారు.. వాటిలో నాకు అదే గొప్పది : మహేశ్ బాబు) కృష్ణను తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. 'మీరు మమ్మల్ని వదిలివెళ్లినా.. మీరు ఇచ్చిన గొప్ప వారసత్వం రూపంలో ఇంకా జీవించే ఉన్నారు. మేము ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం నాన్నా' అంటూ పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. You continue to live through the rich legacy you left behind. We love you forever Nana ❤️❤️❤️ pic.twitter.com/Mjw7fdcQ3d — Manjula Ghattamaneni (@ManjulaOfficial) November 27, 2022 -
కృష్ణానదిలో కృష్ణ అస్థికల నిమజ్జనం, ఉండవల్లి కరకట్టకు మహేశ్
దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ అస్థికలను కృష్ణా నది సహా దేశంలోని పవిత్ర నదుల్లో నిమజ్జనం చేయనున్నారు. ఇందులో భాగంగా మహేశ్ బాబు ముందుగా కృష్ణ అస్థికలను నేడు నదిలో నిమజ్జనం చేశారు. తండ్రి అస్థికలను నిమజ్జనం చేసేందుకు సోమవారం మహేశ్ బాబు కుటుంబంతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. చదవండి: నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటూ నటి మేఘన! వీడియో వైరల్ తాజాగా ఆయన కృష్ణానది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్ద అస్థికలను నిమజ్జనం చేశారు. కృష్ణానదిలో కృష్ట అస్తికలు కలిపి, శాస్త్రోక్తమైన కార్యక్రమాలు నిర్వహించారు మహేశ్ బాబు. ఈ కార్యక్రమంలో మహేశ్‌తో పాటు ఆయన బావ ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ సోదరుడు శేషగిరిరావు, నాగ సుధీర్, సూర్య, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. Mahesh Babu Reached Gannavaram Airport. pic.twitter.com/XsUzSew2Cx — Naveen MB Vizag (@NaveenMBVizag) November 21, 2022 -
మహేశ్ బాబు గొప్ప మనసు.. తీవ్ర విషాదంలోనూ వారికోసం..!
మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు అభిమానుల అశ్రునాయనాల మధ్య, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ ముగిశాయి. అభిమాన జనవాహిని ఆయన వెంట ఒక సైన్యంలా తరలివచ్చింది. తమ అభిమాన నటుడిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం వేలసంఖ్యలో నగరానికి చేరుకున్నారు. కృష్ణ పార్థివదేహాన్ని కడసారి చూసి భావోద్వేగానికి లోనయ్యారు. (చదవండి: అశ్రునయనాల మధ్య ముగిసిన కృష్ణ అంత్యక్రియలు) ఇలాంటి విషాద సమయంలోనూ మహేశ్ బాబు తన గొప్ప మనసును చాటుకున్నారు. సూపర్ కృష్ణ కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. అభిమానులందరికీ ఆయన భోజన ఏర్పాట్లు చేశారు. తన తండ్రిని చూసేందుకు వచ్చిన వారు ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విషాదంలో ఉన్నా మా ఆకలి తీర్చారంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. మధ్యాహ్నాం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. And Are Waiting To See Super Star Krishna Garu 😢🙏 pic.twitter.com/tuatino9rO — Naveen MB Vizag (@NaveenMBVizag) November 16, 2022 -
కనుమరుగైన నటశేఖరుడు
తెలుగు చలనచిత్ర సీమలో సాహసిగా, సూపర్ స్టార్‌గా, నటశేఖరుడిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రేక్షక నీరాజనాలందుకున్న సీనియర్ నటుడు కృష్ణ కన్నుమూశారు. ఆయనకు ముందూ తర్వాతా వెండితెరనేలిన నటీనటులు ఎందరో ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు గడించినవారూ ఉన్నారు. కానీ సినీ పరిశ్రమలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మనసున్న మనిషిగా, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న విశిష్ట వ్యక్తి హీరో కృష్ణ. చిన్నతనంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు పోస్టర్లు చూసి, ఆ తర్వాత వారి సినిమాలు చూసి వ్యామోహంలో పడిపోయిన కుర్రాడొకడు పెరిగి పెద్దయి డిగ్రీ చదువులకెదిగినప్పుడు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు సన్మానసభను కళ్లారా చూశాక ఇక సినిమా రంగమే తన సర్వస్వంగా భావించు కోవటం తెలుగు ప్రేక్షకుల అదృష్టం. ఆ నిర్ణయం వారికొక ‘డేరింగ్ అండ్ డాషింగ్ హీరో’ను అందించింది. ఆ తర్వాత దశాబ్దాలపాటు తనదైన నటనతో, తనకే సొంతమైన సాహసాలతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆయన అబ్బురపరిచారు. దేనిపైనైనా ఇష్టం కలగడం వేరు...ఆ ఇష్టాన్ని సాకారం చేసుకోవడానికి అవసరమైన కృషి, పట్టుదల కలిగి ఉండటం, లక్ష్య సాధన కోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధపడటం వేరు. కృష్ణలో అవి పుష్కలంగా ఉండబట్టే అచిరకాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకోగలిగారు. రెండు నట దిగ్గజాలు– ఎన్టీఆర్, ఏఎన్నార్ తమ నటనావైభవంతో వెండితెరను జిగేల్మనిపిస్తున్న కాలంలో ఇదేమంత సులభం కాదు. కానీ కృష్ణ దాన్ని సాధించారు. తనకు స్ఫూర్తినిచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకే అనంతరకాలంలో ఆయన పోటీనిచ్చారు. నటుడిగా ఉంటూనే సినిమా రంగంలోని సమస్త విభాగాలపైనా పట్టు సాధించారు. నిర్మాతగా మారారు. దర్శకుడిగా పనిచేశారు. స్టూడియో అధినేత అయ్యారు. ప్రేక్షకుల అభిరుచేమిటో, వారిని మెప్పించేదేమిటో తెలుసుకోవటం, మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం నటుడిగా దూసుకెళ్లటానికి దోహదపడతాయి. కృష్ణ సినీ జీవితంలో అపజయాలు లేవని కాదు. నటుడిగా ఆయన నిమ్నోన్నతాలు రెండూ చూశారు. కానీ విజయాలు సాధించినప్పుడు పొంగిపోవటం, వైఫల్యాలెదురైనప్పుడు కుంగిపోవటం కృష్ణకు అసలే పొసగనిది. అందుకే నిబ్బరంగా అడుగులేస్తూ అసాధ్యుడనిపించుకున్నారు. ప్రేక్షకులకు కావా ల్సిందేమిటో గ్రహించటమే కాదు... వారికి ఎలాంటి అభిరుచులుండాలో కూడా నేర్పారు. కథల ఎంపికలో, సాంకేతికతలను కొత్త పుంతలు తొక్కించటంలో కృష్ణది ఒక విలక్షణమైన దారి. ఆ దారిలో నడవాలంటే అన్యులు భయపడేంతగా ఆ ప్రయోగాలుండేవి. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... ఆయన తొలి చిత్రం ‘తేనెమనసులు’ సాంఘిక చిత్రాల్లో తొలి కలర్ చిత్రం కాగా, అనంతర కాలంలో వచ్చిన ‘గూఢచారి 116’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘అల్లూరి సీతారామరాజు’ వంటివి దేనికవే కొత్త ప్రయోగాలు. సినీ జగత్తులో ఏ కొత్త సాంకేతికత ప్రవేశించినా దాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనిదే నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. ఆ సాంకేతికతకయ్యే వ్యయం తెలుగులో గిట్టుబాటు కాదని అందరూ అనుకునే రోజుల్లో ఆయన వెనకా ముందూ ఆలోచించ కుండా వాటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా వీక్షణను ఒక అపురూపమైన అనుభవంగా మిగిల్చారు. తొలి పూర్తి సినిమా స్కోప్, తొలి 70 ఎంఎం వంటివన్నీ కృష్ణ చేతుల మీదుగానే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాయి. వారిని చకితుల్ని చేశాయి. సమ్మోహన పరిచాయి. అప్పట్లో హాలీవుడ్ సినిమాలను ఏలుతున్న కౌబాయ్నీ, జేమ్స్‌బాండ్‌నీ మన వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈ సూపర్ స్టారే. ‘గూఢచారి 116’లో జేమ్స్‌బాండ్‌గా, ‘మోసగాళ్లకు మోసగాడు’లో కౌబాయ్‌గా ఆయన చేసిన ఫైట్లూ, ఛేజింగ్‌లూ సాధారణ ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. మనవాళ్లను మాత్రమే కాదు... తమిళ, మలయాళ, బెంగాలీ ప్రేక్షకులనూ కట్టిపడేశాయి. ఇంగ్లిష్, రష్యన్, స్పానిష్ భాషల్లో సైతం కొన్ని చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్టీఆర్ ఎంతో మనసుపడిన ‘అల్లూరి సీతారామరాజు’ను తానే చేయాలని నిర్ణయించుకుని, దిగ్గజాలు అనుకున్నవారంతా వెనక్కిలాగుతున్నా దాన్ని తన వందవ చిత్రంగా ఎంపిక చేసుకుని కృష్ణ ఒక పెద్ద సాహసమే చేశారు. తెలుగువారి ‘విప్లవజ్యోతి’ని కళ్లకు కట్టారు. దాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దారు. ఆ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించటం కష్టమని జోస్యం చెప్పినవారంతా అది ఏకంగా 175 రోజులు ఆడటం చూసి ‘ఔరా’ అనక తప్పలేదు. తన సొంత చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’ హిందీ అనువాదానికి సెన్సార్ అడ్డంకులెదురైనప్పుడు న్యాయస్థానాల్లో అవిశ్రాం తంగా పోరాడి వాటిని అధిగమించారు. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రవేశారు. లెక్కకు మిక్కిలి సాహసాలు చేసిన నటుడిగా, నిర్మాతల హీరోగా, సాధారణ సినీ కార్మిక కుటుంబాల బాగోగుల కోసం తపించిన వ్యక్తిగా కృష్ణ చిరకాలం గుర్తుండి పోతారు. ఉన్నత శిఖరాలకెదగటం, ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోవటం, సంపద గడించటం సినీ రంగంలో చాలామందికి సాధ్యపడి ఉండొచ్చు. కానీ సమాజానికి ఎంతోకొంత తిరిగి అందించటం తోటి మనిషిగా తన కర్తవ్యమని ఎంచి, తన ఆలంబన అందరికీ చల్లని నీడనివ్వాలని, తన చుట్టూ ఉన్నవారంతా సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న కృష్ణవంటివారు చాలా అరుదు. ఆ ‘మనసున్న మనీషి’కి ‘సాక్షి’ నివాళులు. -
వైఎస్సార్ కాంగ్రెస్‌కు బాసటగా నిలవండి
కృష్ణ-మహేష్ ఫ్యాన్స్‌కు ఆదిశేషగిరిరావు పిలుపు విశాఖపట్నం సూపర్‌స్టార్ కృష్ణ-మహేష్ అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నిలవాలని కృష్ణ మహేష్ అభిమాన సంఘ గౌరవాధ్యక్షుడు, పార్టీ నాయకుడు ఆదిశేషగిరిరావు పిలుపునిచ్చారు. విశాఖలో శుక్రవారం రాత్రి జరిగిన కృష్ణ అభిమానుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ప్రవర్తన కృష్ణను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని చెప్పారు. వైఎస్ అంటే కృష్ణకు చాలా ఇష్టమ న్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆయనకు అపార నమ్మకముందని, అందువల్లే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. జగన్‌ను అధికారంలోకి తెచ్చేందుకు అభిమానులందరూ పనిచేయాలని కృష్ణ పిలుపునిచ్చారన్నారు. ప్రచారంలో కృష్ణ- మహేష్ అభిమానులు వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పాల్గొనాలని కోరారు. పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు విజయ్‌చందర్ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్ టీడీపీ, బీజేపీలను భూస్థాపితం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఎంతమంది సినిమావాళ్లను కలిపి ప్రచారం చేసినా జగన్మోహన్రెడ్డి గెలుపును ఆపలేరన్నారు. సినిమాల్లో మహేష్ నంబర్ వన్ డేరింగ్ హీరో అయితే.. రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నంబర్ వన్ డేరింగ్ నాయకుడని కితాబిచ్చారు.