తెలుగు చలనచిత్ర సీమలో సాహసిగా, సూపర్ స్టార్‌గా, నటశేఖరుడిగా అత్యున్నత శిఖరాలు అధిరోహించి నాలుగున్నర దశాబ్దాలపాటు ప్రేక్షక నీరాజనాలందుకున్న సీనియర్ నటుడు కృష్ణ కన్నుమూశారు. ఆయనకు ముందూ తర్వాతా వెండితెరనేలిన నటీనటులు ఎందరో ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు గడించినవారూ ఉన్నారు. కానీ సినీ పరిశ్రమలో అందరికీ తలలో నాలుకలా ఉంటూ మనసున్న మనిషిగా, మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్న విశిష్ట వ్యక్తి హీరో కృష్ణ. చిన్నతనంలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు పోస్టర్లు చూసి, ఆ తర్వాత వారి సినిమాలు చూసి వ్యామోహంలో పడిపోయిన కుర్రాడొకడు పెరిగి పెద్దయి డిగ్రీ చదువులకెదిగినప్పుడు ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు సన్మానసభను కళ్లారా చూశాక ఇక సినిమా రంగమే తన సర్వస్వంగా భావించు కోవటం తెలుగు ప్రేక్షకుల అదృష్టం.
ఆ నిర్ణయం వారికొక ‘డేరింగ్ అండ్ డాషింగ్ హీరో’ను అందించింది. ఆ తర్వాత దశాబ్దాలపాటు తనదైన నటనతో, తనకే సొంతమైన సాహసాలతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆయన అబ్బురపరిచారు. దేనిపైనైనా ఇష్టం కలగడం వేరు...ఆ ఇష్టాన్ని సాకారం చేసుకోవడానికి అవసరమైన కృషి, పట్టుదల కలిగి ఉండటం, లక్ష్య సాధన కోసం ఎన్ని కష్టాలకైనా సిద్ధపడటం వేరు. కృష్ణలో అవి పుష్కలంగా ఉండబట్టే అచిరకాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకోగలిగారు. రెండు నట దిగ్గజాలు– ఎన్టీఆర్, ఏఎన్నార్ తమ నటనావైభవంతో వెండితెరను జిగేల్మనిపిస్తున్న కాలంలో ఇదేమంత సులభం కాదు. కానీ కృష్ణ దాన్ని సాధించారు. తనకు స్ఫూర్తినిచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకే అనంతరకాలంలో ఆయన పోటీనిచ్చారు. నటుడిగా ఉంటూనే సినిమా రంగంలోని సమస్త విభాగాలపైనా పట్టు సాధించారు. నిర్మాతగా మారారు. దర్శకుడిగా పనిచేశారు. స్టూడియో అధినేత అయ్యారు.
ప్రేక్షకుల అభిరుచేమిటో, వారిని మెప్పించేదేమిటో తెలుసుకోవటం, మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటం నటుడిగా దూసుకెళ్లటానికి దోహదపడతాయి. కృష్ణ సినీ జీవితంలో అపజయాలు లేవని కాదు. నటుడిగా ఆయన నిమ్నోన్నతాలు రెండూ చూశారు. కానీ విజయాలు సాధించినప్పుడు పొంగిపోవటం, వైఫల్యాలెదురైనప్పుడు కుంగిపోవటం కృష్ణకు అసలే పొసగనిది. అందుకే నిబ్బరంగా అడుగులేస్తూ అసాధ్యుడనిపించుకున్నారు. ప్రేక్షకులకు కావా ల్సిందేమిటో గ్రహించటమే కాదు... వారికి ఎలాంటి అభిరుచులుండాలో కూడా నేర్పారు. కథల ఎంపికలో, సాంకేతికతలను కొత్త పుంతలు తొక్కించటంలో కృష్ణది ఒక విలక్షణమైన దారి. ఆ దారిలో నడవాలంటే అన్యులు భయపడేంతగా ఆ ప్రయోగాలుండేవి. యాదృచ్ఛికమే కావొచ్చు గానీ... ఆయన తొలి చిత్రం ‘తేనెమనసులు’ సాంఘిక చిత్రాల్లో తొలి కలర్ చిత్రం కాగా, అనంతర కాలంలో వచ్చిన ‘గూఢచారి 116’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘అల్లూరి సీతారామరాజు’ వంటివి దేనికవే కొత్త ప్రయోగాలు.
సినీ జగత్తులో ఏ కొత్త సాంకేతికత ప్రవేశించినా దాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనిదే నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. ఆ సాంకేతికతకయ్యే వ్యయం తెలుగులో గిట్టుబాటు కాదని అందరూ అనుకునే రోజుల్లో ఆయన వెనకా ముందూ ఆలోచించ కుండా వాటిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా వీక్షణను ఒక అపురూపమైన అనుభవంగా మిగిల్చారు. తొలి పూర్తి సినిమా స్కోప్, తొలి 70 ఎంఎం వంటివన్నీ కృష్ణ చేతుల మీదుగానే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాయి. వారిని చకితుల్ని చేశాయి. సమ్మోహన పరిచాయి. అప్పట్లో హాలీవుడ్ సినిమాలను ఏలుతున్న కౌబాయ్‌నీ, జేమ్స్‌బాండ్‌నీ మన వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈ సూపర్ స్టారే. ‘గూఢచారి 116’లో జేమ్స్‌బాండ్‌గా, ‘మోసగాళ్లకు మోసగాడు’లో కౌబాయ్‌గా ఆయన చేసిన ఫైట్‌లూ, ఛేజింగ్‌లూ సాధారణ ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. మనవాళ్లను మాత్రమే కాదు... తమిళ, మలయాళ, బెంగాలీ ప్రేక్షకులనూ కట్టిపడేశాయి. ఇంగ్లిష్, రష్యన్, స్పానిష్ భాషల్లో సైతం కొన్ని చిత్రాలు విడుదలయ్యాయి.
ఎన్టీఆర్ ఎంతో మనసుపడిన ‘అల్లూరి సీతారామరాజు’ను తానే చేయాలని నిర్ణయించుకుని, దిగ్గజాలు అనుకున్నవారంతా వెనక్కిలాగుతున్నా దాన్ని తన వందవ చిత్రంగా ఎంపిక చేసుకుని కృష్ణ ఒక పెద్ద సాహసమే చేశారు. తెలుగువారి ‘విప్లవజ్యోతి’ని కళ్లకు కట్టారు. దాన్ని శక్తిమంతంగా తీర్చిదిద్దారు. ఆ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించటం కష్టమని జోస్యం చెప్పినవారంతా అది ఏకంగా 175 రోజులు ఆడటం చూసి ‘ఔరా’ అనక తప్పలేదు. తన సొంత చిత్రం ‘అంతం కాదిది ఆరంభం’ హిందీ అనువాదానికి సెన్సార్ అడ్డంకులెదురైనప్పుడు న్యాయస్థానాల్లో అవిశ్రాం తంగా పోరాడి వాటిని అధిగమించారు. మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ రాజకీయాల్లో సైతం తనదైన ముద్రవేశారు.
లెక్కకు మిక్కిలి సాహసాలు చేసిన నటుడిగా, నిర్మాతల హీరోగా, సాధారణ సినీ కార్మిక కుటుంబాల బాగోగుల కోసం తపించిన వ్యక్తిగా కృష్ణ చిరకాలం గుర్తుండి పోతారు. ఉన్నత శిఖరాలకెదగటం, ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోవటం, సంపద గడించటం సినీ రంగంలో చాలామందికి సాధ్యపడి ఉండొచ్చు. కానీ సమాజానికి ఎంతోకొంత తిరిగి అందించటం తోటి మనిషిగా తన కర్తవ్యమని ఎంచి, తన ఆలంబన అందరికీ చల్లని నీడనివ్వాలని, తన చుట్టూ ఉన్నవారంతా సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న కృష్ణవంటివారు చాలా అరుదు. ఆ ‘మనసున్న మనీషి’కి ‘సాక్షి’ నివాళులు.
Comments
Please login to add a commentAdd a comment