జోహార్‌ నటశేఖరా! హీరో కృష్ణకు కన్నీటి వీడ్కోలు | Superstar Krishna Funerals Finished With State Honours | Sakshi
Sakshi News home page

జోహార్‌ నటశేఖరా! హీరో కృష్ణకు అభిమానుల కన్నీటి వీడ్కోలు

Published Thu, Nov 17 2022 1:42 AM | Last Updated on Thu, Nov 17 2022 6:10 AM

Superstar Krishna Funerals Finished With State Honours - Sakshi

హఫీజ్‌పేట్‌ (హైదరాబాద్‌): లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ సూపర్‌స్టార్‌ ఘట్టమనేని కృష్ణ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహా ప్రస్థానం మోక్షఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అభిమానులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య తెలుగు తెరపై ‘ఎవర్‌గ్రీన్‌ సూపర్‌స్టార్‌’ భువి నుంచి దివికేగారు. అంతకుముందు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు. సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ క్రతువును నిర్వహించారు. కృష్ణ చితికి ఆయన కుమారుడు మహేశ్‌బాబు నిప్పంటించారు. కుటుంబసభ్యులు, సినీ, రాజకీయరంగ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేలాదిమంది ప్రజలు అశ్రునయనాలతో తమ అభిమాన నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు. అంతకుముందు పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో కృష్ణ పార్థివదేహాన్ని ఉంచి పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీ, రాజకీయ ప్రముఖులు బారులు తీరిన కార్లలో ఊరేగింపును అనుసరించారు. పెద్దసంఖ్యలో ప్రజలు జేజేలు పలుకుతూ మహాప్రస్థానానికి చేరుకున్నారు. 

పరిమిత సంఖ్యలో లోపలికి అనుమతి
వైకుంఠ మహాప్రస్థానంలోకి వెళ్లేందుకు పోలీసులు తొలుత పరిమిత సంఖ్యలోనే అనుమతించారు. మహేష్‌బాబు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, కుమార్తెలు మంజుల, ప్రియదర్శిని, పద్యావతితో పాటు నటుడు నరేష్, సుధీర్‌బాబు, సంజయ్, గల్లా జయదేవ్‌ తదితర సమీప బంధువులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణలతో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నందిగామ ఎమ్మెల్సీ అరుణ్, కాంగ్రెస్‌ నాయకుడు వి.హన్మంతరావు, సినీ ప్రముఖులు మురళీమోహన్, దిల్‌రాజు, శివపార్వతి తదితరులు కూడా లోనికి వెళ్లారు. అభిమానులు, సామాన్య ప్రజలను మాత్రం క్రతువు ముగిసే వరకు అనుమతించలేదు. దీంతో మహాప్రస్థానం పరిసరాలన్నీ జనçసంద్రంగా మారి పోయాయి.

నినాదాలతో మారుమ్రోగిన పరిసరాలు
భారీగా గుమిగూడిన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘కృష్ణ అమర్‌ రహే, సూపర్‌స్టార్‌ కృష్ణ అమర్‌ రహే, జోహర్‌ కృష్ణ, జై కృష్ణ..జైజై కృష్ణ ’ అంటూ హోరెత్తించారు. ఒక దశలో వారిని నియంత్రించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కుటుంబసభ్యులు, ప్రముఖులు వెళ్లిపోయిన తర్వాత అభిమానులను అనుమతించారు.

ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి తలసాని
కృష్ణ అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ముందుగానే మహాప్రస్థానానికి చేరుకుని పోలీసులు, అధికారులకు పలు సూచనలు చేశారు. 

గవర్నర్‌ సహా ప్రముఖుల నివాళులు
కృష్ణ పార్థివ దేహానికి సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రాహ్మణి నివాళులర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిర్మాత అల్లు అరవింద్, నటుడు కోట శ్రీనివాసరావు, సినీ నటి జయప్రద, ఏపీ మంత్రి రోజా, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు కృష్ణ భౌతికకాయయాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంతిమయాత్ర మొదలైంది. సాయంత్రం 4 గంటల సమయంలో అంత్యక్రియలు ముగిసాయి.

ఇదీ చదవండి: సీఎంకు కాల్‌చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. అసలు విషయం ఏంటంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement