Superstition Beliefs
-
మూడ నమ్మకంతో తనను తానే బలిచ్చుకున్న యువతి
లక్నో: సాధారణంగా గ్రామ దేవతలకు కోళ్లను, పొట్టేళ్లను బలివ్వడం చూస్తుంటాం. కానీ ఓ యువతి ఏకంగా తనను తానే బలిచ్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో కలకలం రేపింది. ఇక ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మీరట్ జిల్లా ఖర్ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామానికి సమీపంలోని అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని నిత్యం ఎంతో ఇష్టంగా అత్యంత భక్తి శ్రద్దలతో పూజించేది. భక్తి పారవశ్యంతో కాళీమాత ఆలయానికి ప్రతి రోజూ వెళ్లేది. అయితే ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఆ యువతి తనను తాను కాళీమాత కుమార్తెగా భావించడం మొదలు పెట్టింది. తాను మహా భద్రకాళి కూతురునని అమ్మవారి కోసం తన ప్రాణం త్యాగం చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఇదే క్రమంలో ఆ యువతి ఒంటరిగా తెల్లవారు జామున ఆలయానికి వెళ్లింది. అటవీ ప్రాంతం కావడంతో ఆ సమయంలో ఆలయంలో ఎవరూ లేరు. ప్రతి రోజూ పూజారి కూడా సాయంత్రం వచ్చి అమ్మవారికి పూజ చేసి వెళ్లిపోయేవాడు. అయితే ఆ యువతి చాలాసేపు పూజ చేసిన తరువాత ఊహించని నిర్ణయం తీసుకుంది. తొలుత గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. అయితే రోజూలానే ఆ రోజు సాయంత్రం ఆలయ పూజారి వచ్చి చూసేసరికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. దీనితో ఆ పూజారి షాక్‌కు గురయ్యాడు. కొంతసేపటికి తేరుకుని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఆ యువతి మూఢ విశ్వాసాల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కానీ ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ గ్రామంలోని కొందరు ఆ యువతి మూఢ నమ్మకాల కారణంగానే తనను తాను బలిచ్చుకుందని అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం కుటుంబ సమస్యల వల్లే ఉరేసుకుని చనిపోయిందని చెబుతున్నారు. ఏ విషయంలోనో అదే రోజు కుటుంబ సభ్యులకు, ఆ యువతికి మధ్య వాగ్వాదం జరిగడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఆలయానికి వెళ్లి ఉరేసుకుని వుండొచ్చని మరికొందరు అంటున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి మృతికి అసలు కారణమేంటో తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
రోజూ పూజలే.. ఇదేంటని అడిగితే ఎదురు సమాధానం
మోతె (సూర్యాపేట): ఆరునెలల పసిబిడ్డ బలితో మేకలపాడు తండాలో విషాదం అలుముకుంది. మూఢ నమ్మకాలతో కన్న తల్లే గొంతుకోసి పసిపాప ప్రాణాలు తీయడంతో తండా వాసులు ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ఈ దారుణ ఘటనకు ముం దు పరిస్థితుల గురించి ఆరా తీస్తే.. వారం రోజులుగా ఆ పాప తల్లి భారతి ఇంట్లో పూజలు చేస్తోంది. అదీ ఎవరూ లేనప్పుడు.. అగర్బత్తీ లు ముట్టించి కొబ్బరికాయలు కొడుతోంది.. దీనిపై భర్త కృష్ణ ఇవేం పూజలు? అని ప్రశ్నిస్తే ఏమీ లేదులే .. అంటూ దాటవేస్తూ వచ్చింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ తండ్రి చిన్న ఆదమరుపు ఆ పసిబిడ్డ ప్రాణాలు తీసింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల ఆవాసమైన మేకలపాడు తండాలో గురువారం భారతి తన ఆరునెలల కూతురును గొంతుకోసి బలిచ్చిన విషయం తెలిసిందే. దీం తో తండాఒక్కసారిగా ఉలిక్కిపడింది. శుక్రవారం ఆ తండావాసులను ఎవరినీ పలకరించినా భయాందోళనలోనే ఉన్నారు. భారతికి ఇది రెండో వివాహం తండాకు చెందిన భారతికి కృష్ణతో రెండో వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్లక్రితం మొదటి వివాహం జరిగింది. ఏం జరిగిందో తెలియ దు కానీ విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత కృష్ణను ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొంతకాలంగా ఆమె మానసికస్థితి బాగా ఉండడం లేదని పలు ఆలయాలు, చర్చిలు, దర్గాలు తిప్పారు. అందరితో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఉంటుందని, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఆమె మానసిక పరిస్థితి భిన్నంగా ఉంటుందని తండావాసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులక్రి తం ఒకరిని కత్తితో బెదిరించినట్లు సమాచారం. నిందితురాలు భారతి నిలదీస్తే ఎదురు సమాధానాలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు శివుడు ఫొటోతోపాటు యూట్యూబ్‌లో చూసి వారం రోజులుగా వివిధ దేవుళ్ల ఫొటోలకు అగర్బత్తీలు ముట్టించి, కొబ్బరికాయలు కొడుతోంది. చుట్టుపక్కల వారికి అగర్బత్తీల వాసన వచ్చి రోజూ ఏం పూజలు చేస్తున్నావని ప్రశ్నిస్తే ‘మీకేం అవసరం. దేవుడికి నా ఇష్టం వచ్చినట్లు పూజలు చేసుకుంటా’అని ఎదురు సమాధానం చెబుతుండడంతో వారు కూడా మిన్నకుండిపోయారు. ఈ విషయాన్ని భర్త కృష్ణ కూడా గమనిస్తూ వస్తున్నాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కూతురు రీతును జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. గురువారం సూర్యాపేటకు వెళ్లిన ఆయన.. అత్తామామలకు చెప్పినా వారు కొంత ఆలస్యం చేయడంతో ఘోరం జరిగిపోయింది. అంతలోనే భారతి కూతురును గొంతుకోసి చంపింది. ప్రస్తుతం తండాలో భారతి అంటేనే భయపడుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. భారతి భర్త కృష్ణ్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం నిందితురాలు భారతిని అదుపులోకి తీసుకొంటామని చెప్పారు. రోదిస్తున్న రీతు నానమ్మ తండా నుంచి వెళ్లగొట్టండి అభంశుభం తెలియని పసిబిడ్డ రీతును గొంతుకోసి హత్య చేసిన భారతిని తండానుంచి వెళ్లగొట్టండి. నా మనుమరాలిని హత్య చేసింది. రేపు నా కొడుకును, నన్ను హత్య చేయదని గ్యారటీ ఏమిటీ. ఆమెపై మాకు అనుమానం ఉన్నా బిడ్డను చంపుతుందా? అని అనుకున్నాం. కానీ అన్నంత పనిచేసింది. మళ్లీ ఏమీ తెలియనట్లు ఉంది. ఇలాంటి కర్కోటకురాలిని కఠినంగా శిక్షించాలి. – కృష్ణ తల్లి చంద్రమ్మ ఏమీ గుర్తులేదంటున్న భారతి.. నిందితురాలు భారతి ప్రస్తుతం తన తల్లిగారింటి వద్ద ఉంది. నీ బిడ్డను ఎందుకు హత్య చేశావని బంధువులు ప్రశ్నించగా.. ‘రీతును నేను ఎందుకు హత్య చేశానో నాకే తెలియడం లేదు’అని తాపీగా సమాధానం చెబుతోంది. అసలు హత్య చేసింది కూడా గుర్తులేదని బదులిస్తోంది. చదవండి: తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది -
దారుణం: భార్య ఆత్మను వెళ్లగొట్టాలని కూతురునే..
చెన్నై: మూఢ నమ్మకాల పేరుతో ఓ తండ్రి కన్న కూతురునే పొట్టన బెట్టుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామనాథపురానికి చెందిన వీరసెల్వం విపరీతంగా మూఢ నమ్మకాలు, తాంత్రీక పూజలను నమ్ముతాడు. ఆయన కూతురు తరుణి(19) గత కొన్ని రోజుల నుంచి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే తరుణి ఇటీవల తన తల్లి సమాధి ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లి వచ్చింది. దీంతో తన భార్య ఆత్మ తరుణి శరీరంలోకి ప్రవేశించిందని అందువల్లనే ఆమె అనారోగ్యానికి గురైనట్లు వీరసెల్వం భావించాడు. ఏదీఏమైనా ఆమె శరీరం నుంచి తన భార్య ఆత్మను బయటకు పంపించాలని తాంత్రికపూజలు చేయడం మొదలుపెట్టాడు. భార్య ఆత్మను కూతురు శరీరం నుంచి వెళ్లగొట్టాలని ఆమె మెడ, నడుముపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే తరుణి మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆమె మృతి చెందడాని తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: అందమైన అమ్మాయిలను చూపిస్తూ మసాజ్ -
10 రోజుల పసికందుకు ఒళ్లంతా వాతలు
శాస్త్ర సాంకేతికంగా పురోగమిస్తున్నాం... రోదసిలో ప్రయాణిస్తున్నాం... రోబోలను సృష్టించి అపర మేథాసంపత్తిని రుజువు చేసుకుంటున్నాం. కానీ ఇంకా మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తరచూ మన్యంలో అనేక సంఘటనలు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. తాజాగా రోజుల బిడ్డకు అనారోగ్యం సోకిందని వాతలు పెట్టిన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయనగరం, సాలూరు రూరల్: మన్యంలో ఇంకా మూఢ నమ్మకాలను వీడటం లేదు. వీరిని చైతన్యపరచడంలో అధికారులు కూడా పూర్తిగా విజయం సాధించడం లేదు. తర చూ ఏదో ఓ చోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పాచిపెంట మండలంలో కేసలి పంచాయతీ గిరిశిఖర ఊబిగుడ్డి గ్రామానికి చెం దిన పాడి నర్సమ్మ ఈ ఏడాది జనవరి 25న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. జనవరి 30న బిడ్డకు ఊపిరాడక అస్వస్థతకు లోనవడం, పచ్చకామెర్లు లక్షణాలు కన్పించడంతో స్థానిక మంత్రసానిని ఆశ్రయించారు. ఆమె సూచనలతో చిన్నారి కడుపు చుట్టూ, చెవి, నుదురు, చేయిపై కాల్చిన సూదులతో వాతలు పెట్టారు. బిడ్డ పరిస్థితి విషమంగా మా రడంతో సాలూరు సీహెచ్‌సీలో వైద్యులు బిడ్డకు ప్రస్తుత చికిత్సను అందిస్తున్నారు. ఇనుప చువ్వల కారణంగా బిడ్డకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్ తీస్తే బిడ్డ ఊపిరి తీసుకోవడానికి బ్బంది పడుతుండడంతో వైద్యాధికారులు బిడ్డ ఆరోగ్యంపై నేటికీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. సాలూరు మండలం కరాసవలసలో 2018లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరుస మరణాలతో రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. వారి మరణాలకు కారణం భూతమేనని గ్రామస్తులు భూత వైద్యులతో పూజలు చేయించారు. కొందరైతే తాత్కాలికంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇళ్లకు రక్షలు కట్టించారు. ఆ గ్రామంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు పక్క గ్రామాలవారు సైతం రావడం మానుకున్నారు. పార్వతీపురం మండలంలోని డోకిశీల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పాచిపెంట మండలం గుమ్మిడిగుడ్డివలస పంచాయతీ అడారువలస గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి జన్ని తమ్మయ్య మృతికి మూఢనమ్మకమే ప్రధానకారణమని అధికారులు తెలిపారు. అపెండిసైటిస్ లక్షణాలతో బాధపడిన ఈ విద్యార్థి తనకు చేతబడి చేశారని భూతవైద్యుని వద్దకు తీసుకువెళ్లమని కుటుంబీకులకు తెలపడం తరువాత చోటుచేసుకున్న పలు పరిణామాల వల్ల ఆ విద్యార్థి 2017 సెప్టెంబర్ 13న మృత్యుఒడికి చేరాడు. 2016 సెప్టెంబరు నెలలో సాలూరు మండలంలోని తోణాం పంచాయతీ బింగుడువలస గ్రామంలో జరిగిన చోడిపల్లి సీతమ్మ, శంబు దంపతుల హత్యకు ఈ మూఢనమ్మకమే ప్రధాన కారణం. తల్లిదండ్రులు చనిపోవడంతో వారి కుమార్తె కుమారి అనాథగా మారింది. గ్రామాల్లో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ సాలూరు మండలంలోని కొదమ, గంజాయిభద్ర పంచాయతీల్లోని పలు గిరిజన గ్రామాల్లో ప్రజలు తెలిపిన సంఘటనలూ ఉన్నాయి. కానరాని చైతన్య కార్యక్రమాలు గిరిజనుల్లో ఎక్కువగా మూఢ నమ్మకాలు ఉంటున్నాయి. అలాంటివారిని చైతన్యపరిచేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. కానీ ఆ చర్యలు అంతగా కనిపించడం లేదు. వరుస సంఘటనలు జరుగుతున్నా వారు ఆ దిశలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అవగాహన కల్పిస్తాం మూఢ నమ్మకాలు విడనాడాలని తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ముందుగా ఆరోగ్య విషయంలో మూఢనమ్మకాలు విడనాడాలని విస్తృతంగా తెలియజేస్తాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – రవికుమార్ రెడ్డి, ఐటీడీఏ ఇన్చార్జ్ డిప్యూటీ డీఎమ్‌అండ్‌హెచ్‌ఓ -
చావు కూడు పెట్టలేదని దారుణంగా...
బర్మార్ (రాజస్తాన్): అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ మూఢనమ్మకాలు, వింత ఆచారాలతో కుటుంబాల్ని వెలివేసే సంస్కృతి నేటికీ కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇటువంటి సంఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వింత ఆచారం కారణంగా రాజస్తాన్‌లోని బర్మార్ అనే గ్రామానికి చెందిన ఓ కుటుంబాన్ని వెలివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... బర్మార్ జిల్లాలోని చోటాన్ అనే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మూడేళ్ల క్రితం మరణించాడు. అయితే ఆ గ్రామ ఆచారం ప్రకారం.. ఆర్ధిక పరిస్థితితో నిమిత్తం లేకుండా మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తమను పరామర్శించిన వారికి కచ్చితంగా విందు ఏర్పాటు చేయాలి. దీనిని ‘మృత్యుభోజ్’ (పెద్దకర్మ వంటిది) అంటారు. కానీ మరణించిన వ్యక్తి నిరుపేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు విందు ఏర్పాట్లు చేయలేకపోయారు. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు ఆ కుటుంబాన్ని నానా రకాలుగా వేధించడం మొదలుపెట్టారు. పెళ్లి చేసుకోవద్దంటూ హెచ్చరికలు.. బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ... మృత్యుభోజ్ ఏర్పాటు చేయని కారణంగా తమకు ఉన్న కొద్దిపాటి భూమిని పంచాయతీ పెద్దలు లాక్కున్నారని ఆరోపించాడు. తమను ఇంటి నుంచి వెళ్లగొట్టి.. ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా వేధిస్తున్నట్లు తెలిపాడు. ఊళ్లో జరిగే వేడుకలకు తమను ఆహ్వానించకుండా అవమానానికి గురిచేస్తున్నారన్నాడు. చిన్న పిల్లల్ని బడిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయాడు. తమ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారని... వారిని ఎవరూ పెళ్లి చేసుకోవద్దంటూ పంచాయతీ పెద్దలు 21 గ్రామాలకు చెందిన యువకులను హెచ్చరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడేళ్లుగా ఈ అన్యాయాలను సహిస్తున్నామని.. ఓపిక నశించడంతో బకాసర్ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 11న ఫిర్యాదు చేశామని తెలిపాడు. కాగా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బర్మార్ ఎస్పీ గంగదీప్ సింగ్లా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
మూఢాచారాలకు ముకుతాడు
ఛూ మంతర్‌కాళీ, నీ కష్టాల గుట్టు తెలిసింది, చిటికెలో వాటిని కడతేరుస్తాను అని మాయమాటలతో అమాయక జనాలను రకరకాలుగా దోచుకునే మోసగాళ్లకు కొదవ లేదు. మూఢ నమ్మకాలకూ అంతులేదు. వాటికి ఏదో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రాజ్‌భవన్ ఆమోదించింది. సాక్షి, బెంగళూరు: డిజిటల్ యుగంలో కూడా మూఢనమ్మకాలు పాతుకుపోయాయి. నిరక్షరాస్యత, వెనుకబాటు వల్ల మూఢనమ్మకాలతో నకిలీ స్వాములు, బాబాలు మాయలు మంత్రాలు, క్షుద్రపూజలంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మూఢనమ్మకాల నియంత్రణ బిల్లును గత ఏడాది బెళగావి సువర్ణసౌధలో జరిగిన శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఆ బిల్లుకు తాజాగా రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ఆమోదముద్ర వేయడంతో ఇక చట్టం సాకారమైంది. ఆ చట్టం ప్రకారం మూఢ నమ్మకాల కారణంగా వ్యక్తి మృతి చెందినా లేదా గాయపడినా భారతీయ శిక్షా స్మతి ప్రకారం హత్య (302), హత్యాయత్నం(307) కేసుల్ని బాధ్యులపై నమోదు చేస్తారు. మాయలు, మంత్రాలు, చేతబడి, బాణామతి, మడె స్నానం తదితరాలను మూఢనమ్మకాల నియంత్రణ చట్టం ప్రకారం నేరాలుగా పరిగణిస్తారు. నేరం రుజువైతే ఒక సంవత్సరం నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించవచ్చు. భిన్న వాదనలపై స్పష్టత మూఢ నమ్మకాల నియంత్రణ చట్టానికి సంబంధించి మొదటి నుంచి సానుకూల, వ్యతిరేకతలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ చట్టం అస్పష్టంగా ఉందని దీనివల్ల దేవాలయాలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాల్లో నిర్వహించే పూజలు, హోమాలు సైతం మూఢనమ్మకాలుగా పరిగణించే అవకాశం ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఏవి ఈ చట్టం పరిధిలోకి వస్తాయో, ఏవి రావో నిర్ధారించడానికి ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పరచింది. పూర్తి వివరాలతో కూడిన జాబితాను కూడా విడుదల చేసింది. అంతేకాకుండా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం, పోలీసుల సహాయంతో అనుమానిత స్థలాలపై ఆ అధికారి తనిఖీలు చేపట్టడానికి పూర్తి స్వేచ్ఛను కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చట్టం పరిధిలోకి వచ్చేవి... 1. బాణామతి, నగ్నంగా ఊరేగించడం, వ్యక్తి లేదా సమూహంపై నిషేధం, బహిష్కారం 2. అతీంద్రియ శక్తులు ఆవహిస్తాయంటూ ప్రచారం 3. దయ్యాలు, భూతాలు విడిపిస్తామంటూ హింసించడం, కొక్కెలకు వేలాడదీయడం, బహిరంగంగా లైంగిక చర్యకు ప్రేరేపించడం లేదా ఒత్తిడి చేయడం, నోటిలో మల, మూత్రాలు వేయడం 4. వ్యక్తులను సాతాను, దయ్యం, భూతమంటూ సంబోధించడం 5. దయ్యాలను ఆహ్వానించడం, అఘోర, చేతబడి చర్యలకు ప్రోత్సహించడం 6. వేళ్లతో తాకుతూ శస్త్రచికిత్సలు చేయడం 7. తమను తాము అవాతరపురుషుడిగా ప్రకటించుకోవడం, గత జన్మలో మనమిద్దరం భార్యభర్తలమనీ లేదా ప్రేమికులమంటూ మహిళలు, యువతులను ప్రలోభ పెట్టి లైంగిక చర్యలకు ప్రేరేపించడం 8. పిల్లలను ముళ్లు, నిప్పులపై నడిపించడం 9. రుతుక్రమంలోనున్న స్త్రీలను, గర్భిణీలను ప్రత్యేకంగా ఉంచడం 10. మడిస్నానం, నోటికి శూలాలు, తాళాలు వేయడం తదితరాలు. -
వదల బొమ్మాళీ..నిన్నొదల
‘చేతబడి’ప్రభావిత గ్రామాల్లో కోహెడ మండలం ఒకటి. ఇక్కడ 21 గ్రామాలకు కలిపి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 8 ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీకి రోజుకు సగటున 90 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తారు. ఇంతమందికి ఉన్న ఒక్క వైద్యురాలే వైద్యం చేయాలి. పిల్లలు, యువకులు, వృద్ధులు ఎవరు వచ్చినా రోగాలు ఏవైనా ఆ డాక్టరే చూడాలి, ఉన్న కాసిని మందులే ఇవ్వాలి. లేకపోతే పైఆస్పత్రులకు వెళ్లాలంటూ రిఫర్ చేయాల్సిన పరిస్థితి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పీహెచ్‌సీలోనూ ఇదే పరిస్థితి. దీంతో తగిన వైద్యం అందక గ్రామీణులు, గిరిజనులు భూత వైద్యులు, మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. మరింతగా మూఢ నమ్మకాల్లో కూరుకుపోతున్నారు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ‘మంత్రతంత్రాలు’పట్టిపీడిస్తున్నాయి.. గ్రామీణ, గిరిజన ప్రాంతాలను ‘దెయ్యాలు, భూతాలు’కకావికలం చేస్తున్నాయి.. రోజురోజుకూ ప్రజల్లో మూఢ నమ్మకాలు మరింతగా చుట్టుముడుతున్నాయి.. రోజూ ఏదో ఒక చోట ‘చేతబడి, బాణామతి’పేరిట దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. పసిపిల్లలకు జ్వరం రావడం దగ్గరి నుంచి పొలాల్లో రైతులకు పాముకాటు దాకా అన్నింటికీ మంత్రగాళ్లను, భూత వైద్యులనే ఆశ్రయిస్తున్నారు. ఏ చిన్న వ్యాధి వచ్చినా వారి దగ్గరికే వెళుతున్నారు.. గ్రామాల్లో ప్రజలకు తగిన వైద్యం అందకపోవడం, ఆర్థిక, సామాజిక నేపథ్యం, మూఢ నమ్మకాలు, భూత వైద్యులు, మంత్రగాళ్లు జనాలను మరింతగా గారడీ చేస్తూ, భయపెడుతూ తమదారికి తెచ్చుకుంటుండడం వంటివన్నీ ఈ పరిస్థితికి కారణంగా మారుతున్నాయి. ఈ మంత్రతంత్రాల అపవాదు కారణంగానే జూలై 10న కరీంనగర్ జిల్లా కందుగులలో గంట కొమురయ్య దంపతులు, ముగ్గురు బిడ్డలను హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, జనగామ, సిద్దిపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ‘సాక్షి’ ప్రత్యేక పరిశీలన జరిపింది. అక్కడ ప్రజల ఆర్థిక సామాజిక నేపథ్యం, ప్రజావైద్యం అందుతున్న తీరు, మూఢ నమ్మకాల పరిస్థితులను పరిశీలించింది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ పరిశీలన సందర్భంగా అధిక శాతం జనం మంత్రతంత్రాలు, చేతబడి, భూతవైద్యులపై నమ్మకాన్ని వ్యక్తపరచడం ఆందోళన కరం. ఇదో మాయల తంత్రం హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాకు చెందిన మాయేందర్ (పేరు మార్చాం) అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొందరు యువకుల నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. మోసపోయిన వారు కొద్దిరోజులుగా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు. దీంతో మాయేందర్ తల్లిదండ్రులు తమ కుమారుడికి ఎవరో చేతబడి చేసి చెడుమార్గం పట్టిస్తున్నారని భావించి.. అతడిని తీసుకుని ముల్కనూర్ గ్రామంలోని ఓ ఎరుకల సాని వద్దకు వెళ్లారు. ఆమె మాయేందర్పై పాలోళ్లే చేతబడి చేయించారని చెప్పింది. హుస్నాబాద్ మండలం చౌటపల్లిలోని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చింది. దీంతో వారు తమ కుమారుడిని తీసుకుని ఆ మంత్రగాడి వద్దకు వెళ్లారు. ఎద్దు తొక్కని ఇసుక.. ఏడు బావుల నీళ్లు.. కోహెడ మండలం సముద్రాలలో మరో ఘటన కనిపించింది. ఇటీవల వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ప్రభావంతో రైతుల బోర్లలో నీళ్లు తగ్గుతున్నాయి. చెంచరు చేరుపల్లి గ్రామానికి చెందిన శ్రీమన్‌రావు (పేరు మార్చాం) అనే రైతు బోరు కూడా అడుగంటి పోయింది. కానీ శ్రీమన్‌రావు ఏదో అనుమానం పెట్టుకుని సముద్రాల గ్రామంలోని ఉస్మాన్‌ఖాన్ అనే మంత్రగాడి వద్దకు వచ్చాడు. ఉస్మాన్‌ఖాన్ దివ్యదృష్టితో చూసినట్లుగా చేసి... పక్కనున్న పొలం యజమానే ‘మంత్రాలు’చేయించాడని చెప్పాడు. ఆ దుష్టశక్తిని తరిమేసి, బోరులోకి మళ్లీ నీళ్లు మళ్లించటానికి క్షుద్ర పూజ చేయాలన్నాడు. ఇందుకోసం ఎద్దు తొక్కని ఇసుక, ఏడు బావుల నీళ్లు, పసుపు కలిపిన బియ్యం, నల్ల వక్కలు, ఆరు నిమ్మకాయలు తెచ్చుకోవాలని చెప్పాడు. ఆ సామగ్రి తెచ్చాక ఏవేవో పూజలు చేసి.. వాటిని మూట కట్టి ఇచ్చాడు. వాటిని బోరులో, పంట పొలంలో చల్లితే పాతాళగంగ మళ్లీ పైకి వస్తుందని చెప్పి పంపించాడు. ఈ మంత్రగాడు పసిపిల్లలకు విరోచనాలు, జలుబు, జ్వరం, పెద్దలకు స్వైన్‌ఫ్లూ, కేన్సర్ వంటి వ్యాధులకు కూడా భూత వైద్యం చేస్తాడని.. ప్రతి గురువారం, ఆదివారం చాలా మంది జనం వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఎన్నో విధాలుగా.. పసిపిల్లలు మూత్రం పోయడానికి ఇబ్బంది పడడం దగ్గరి నుంచి పెద్దల అనారోగ్య సమస్యల వరకు చాలా మంది భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో కొన్ని వర్గాల వారిని చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి బాణామతిని సాకుగానూ ఉపయోగించుకుంటున్నారు. వారిపై మంత్రతంత్రాల ఆరోపణలు చేసి.. నిర్దోషిగా రుజువు చేసుకోవడానికి వేడి నూనెలో చేతులు పెట్టడం, కాలుతున్న గడ్డపార పట్టుకోవాలని చెప్పడం వంటి పరీక్షలు పెడుతున్నారు. ఒంట్లో మేకులు పీకగలరు! నల్లగొండ జిల్లా గుండ్లపల్లికి చెందిన కాశమ్మ (65) ఒంటరిగా జీవిస్తోంది. ఇటీవల కీళ్ల నొప్పులు రావడంతో ముగ్గురు భూత వైద్యుల వద్దకు వెళ్లింది. దీనిపై ఆమెను పలకరిస్తే... ‘‘డిండి సర్కారు దవాఖానకు (పీహెచ్సీ)కి పోతే మందు గోలీలు ఇచ్చారు. నెల రోజులు మింగినా నొప్పులు తగ్గలేదు. చెర్వుగట్టు గ్రామంలో మంత్రాలు వేస్తారంటే అక్కడికి వెళ్లిన. మా పాలోళ్లే మంత్రాలు చేశారని ఆ మంత్రపాయన చెప్పిండు. నిమ్మకాయలు మంత్రించి ఇచ్చిండు. నాలుగు అమావాస్యలు వెళితే పాణం కొద్దిగా కుదురుకుంది. తర్వాత మా చెల్లె కల్వకుర్తి (నాగర్‌కర్నూలు జిల్లా)కి తీసుకపోయింది. అక్కడి భూత వైద్యురాలు కూడా నాకు ఎవరో చేతబడి చేశారని, మట్టి బొమ్మను చేసి కీళ్లకు మొలలు గుచ్చారని చెప్పింది. నా ఒంటి మీద గుచ్చిన మొలలను గుర్తుపట్టి ఆమె పంటితో పీకేసింది. ఆరు మొలలు ఎల్లినయ్. నిమ్మకాయలు మంత్రించి ఇచ్చి, వారం వారం రమ్మని చెప్పింది. ఇప్పుడు మంచిగనే అనిపిస్తోంది..’’అంటూ చెప్పింది. పోలీసు కేసులకే పరిమితం మంత్రాలు, చేతబడి, బాణామతి అనేవి వైద్య విజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో రోగికి మనోధైర్యం కల్పించడం కోసం మొదలైన ప్రక్రియలనీ.. కానీ అవి సంస్కృతిలో భాగమై వస్తున్నాయని సామాజికవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ మంత్రతంత్రాల సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోందని అంటున్నారు. పోలీసు రికార్డులను బట్టి ప్రతి జిల్లాలో ఏటా సగటున 15 నుంచి 20 కేసుల వరకు మంత్రాలు, చేతబడి, బాణామతి, చెర్దుబాటు పేరుతో నమోదవుతున్నాయి. ఇక పోలీసుస్టేషన్ వరకు రాకుండా జరుగుతున్న ఘటనలు 100 నుంచి 150 వరకు ఉంటాయని చెబుతున్నారు. పోలీసు లు కూడా నేరం జరిగిన తరువాత వెళ్లి కేసులు నమోదు చేయడానికే పరిమితమవుతున్నారని స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్‌లో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సుదర్శన్, ఆయన భార్య రాజేశ్వరిని స్థానికులు మంత్రాల నెపంతో హత్య చేశారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు నుంచే వారిని బంధించి ఉంచారు. దీనిపై వారి కుమారుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. ఆస్పత్రులున్నా.. సౌకర్యాలేవి? రాష్ట్రంలో ఐదు వేల మందికి ఒకటి చొప్పున ఒక ఉప వైద్య కేంద్రం, 30 వేల మంది జనా భాకు ఒక పీహెచ్సీ, లక్ష మంది జనాభాకు ఒక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ఉన్నాయి. మొత్తంగా 10,760 గ్రామా లుండగా... పీహెచ్‌సీలు 930, సీహెచ్‌సీలు 125 మాత్రమే ఉన్నాయి. ఇక 4,500 ఉప కేంద్రాలున్నా వాటిలో వైద్యులుం డరు, ఏఎన్ఎంలే ఉంటారు. వాటిలో తగిన వైద్య సేవలు అందుబాటులో ఉండవు. పీహెచ్ సీల్లో ఉండే ఒక రిద్దరు వైద్యులు.. రోగులంద రికీ వైద్యసేవలు అందించే పరిస్థితి లేదు. అంటే కేవలం 10% గ్రామాలకే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఉన్న ఆస్పత్రులనూ వైద్యుల కొరత వేధిస్తోంది. వైద్యులు, నర్సులు కలిపి వెయ్యి వరకు ఖాళీలున్నాయి. వైద్యులు ఉన్నచోట వారు వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజావైద్యం దిక్కులేకే.. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజావైద్యాన్ని విస్మరించిన ఫలితంగానే పల్లెల్లో బాణామతి, చేతబడుల వంటి మూఢనమ్మకాలు మరింతగా పెరిగిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూఢ నమ్మకాలకు తోడు ప్రజలకు ప్రభుత్వ వైద్యం, మందులు సరిగా అందుబాటులో లేకపోవటంతో వారు భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దీనికి సాంస్కృతిక నేపథ్యం కూడా కొంత తోడయింది. అసలు సగటున ప్రతి నాలుగు ఊళ్లకు ఓ పేరుపొందిన మంత్ర వైద్యుడు ఉండగా.. సగటున పది గ్రామాలకు కలిపి కూడా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం గమనార్హం. ప్రజలు పది ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లి వైద్యం పొందాల్సిన పరిస్థితి. ఉన్న ప్రభుత్వాస్ప త్రుల్లోనూ వైద్యులు, మందుల కొరత వేధిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రసూతి కేంద్రాలను మెరుగు పరిచింది. కానీ సాధారణ రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, మొండి వ్యాధులను పసిగట్టి వైద్యం చేసే పరిస్థితి లేదు. పేదల ఆర్థిక స్థితికి అనుగుణంగా చవక మందులు అందుబాటులో లేవు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి.. ‘‘రుజువులకు అందని ఓ అభూత కల్పనను జనంపైకి ప్రయోగించి వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న ప్రక్రియ బాణామతి. ఈ నెపంతో దళిత, గిరిజన కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక నేపథ్యం, ప్రజా వైద్యం అందుబాటులో లేకపోవటం వల్లే ప్రజలు ఇంకా మంత్రాలను నమ్ముతున్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోంది. మూఢ నమ్మకాల నిర్మూలన కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి..’’ – తాటి రమేశ్, జన విజ్ఞాన వేదిక కన్వీనర్ -
చాదస్తపు స్నేహితుడు
పిల్లల కథ నందనవనంలో నారాయణ అనే వ్యాపారి ఉండేవాడు. ఆ గ్రామంలో తనొక్కడిదే సరుకుల దుకాణం కావడంతో వ్యాపారం జోరుగా సాగేది. దుకాణంలోని పనంతా ఒక్కడే చేసుకోలేక పోలప్ప అనే తన చిన్ననాటి స్నేహితుణ్ని సహాయకుడిగా ఉంచుకున్నాడు. పోలప్పకు నెలకు ఐదువందలు వేతనంగా ఇచ్చేవాడు. ఒకరోజు దుకాణానికి సత్యమూర్తి అనే వ్యక్తి వచ్చాడు. అతడు కూడా నారాయణకు స్నేహితుడే! దుకాణంలో పోలప్పను గమనించిన సత్యమూర్తి ఏదో ప్రమాదాన్ని శంకించాడు. నారాయణను బయటకు పిలిచి, ‘‘ఏరా! ఈ అయోమయం శాల్తీని గుమాస్తాగా పెట్టుకున్నావా? వాడికి మందబుద్ధి, మూఢనమ్మకాలు అధికమని మనకు చిన్నప్పట్నించీ తెలుసు కదా. తెలిసీ ఇలా ఎందుకు చేశావు?’’ అని సున్నితంగా మందలించాడు. ‘‘భలే వాడివే! నీవు పోలప్పలోని కొన్ని గుణాలనే చూశావు. వాడికి చాదస్తం ఉన్న మాట నిజమే. కానీ నేను ఒక వ్యాపారిగా ఆలోచించి, వాడిని పనిలో పెట్టుకున్నాను. అతి తక్కువ జీతానికి రోజంతా దుకాణాన్ని కనిపెట్టుకుని ఉండేవాడు వీడొక్కడే! అలాగే నేను ఏ పని చెప్పినా కిక్కురుమనకుండా చేస్తాడు. పైగా... మధ్యాహ్నం పూట బేరాలు లేనప్పుడు ఆ కబురూ, ఈ కబురూ చెప్పి కాలం దొర్లిపోయేలా చేస్తున్నాడు’’ అని సత్యమూర్తిని సమాధానపరిచాడు నారాయణ. ‘‘సరే, నీ ఇష్టం. ఎందుకైనా మంచిది. జాగ్రత్తగా ఉండు. మూర్ఖులతో సాహచర్యం ఎప్పుడూ ప్రయోజనాన్నివ్వదు’’ అంటూ సత్యమూర్తి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత, ఒకసారి సరుకులు కొనడానికి రంగనగరం వెళ్లవలసి వచ్చింది. నారాయణ, పోలప్ప ఇద్దరూ బయలుదేరారు. రంగనగరానికి రెండు దారులు ఉన్నాయి. అందులో ఒకటి గుర్రపుబండ్లు వెళ్లేదారి, రెండవది కాలిబాట. కాలిబాటంతా చిక్కటి అడవి గుండానే సాగుతుంది. అయితే రంగనగరానికి వెళ్లడానికి అది దగ్గరి దారి! గుర్రపుబండిలో వెళితే ఖర్చవుతుందని, నారాయణ కాలిబాటన వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. ఒక రొట్టెల మూట, నీళ్లు నింపిన సొరకాయ బుర్రను పోలప్ప భుజాలపైకి ఎక్కించాక, ఇద్దరూ కాలిబాటన ప్రయాణించసాగారు. నారాయణకు ప్రయాణకష్టం తెలియకుండా పోలప్ప దారివెంట పలు కబుర్లు చెబుతూనే ఉన్నాడు. మధ్యాహ్నమయ్యాక, ఇద్దరూ ఒక మర్రిచెట్టు కింద ఆగారు. కాసిన్ని రొట్టెలు తిన్నాక, చేతులు కడుక్కోవడానికి నారాయణ చెట్టు వెనక్కు వెళ్లాడు. అయితే అక్కడో దిగుడుబావి ఉంది. అయితే చుట్టూ పెరిగిన గడ్డితో మూసుకుపోయి కనిపించకుండా ఉంది. నారాయణ పొరబాటున ఆ గడ్డిపై కాలుపెట్టి జారి బావిలో పడిపోయాడు. బావిలోకి జారిపోయేటప్పుడు భయంతో బిగ్గరగా కేకలు వేశాడు. రొట్టె తింటోన్న పోలప్ప ఆ కేకలు వినగానే ఆదుర్దాగా లేచి నారాయణ కోసం పరుగులు తీశాడు. చుట్టుపక్కల వెతికి బావిని కనిపెట్టాడు. అప్పటికే బావి నీటిలో నాలుగైదుసార్లు మునిగి తేలాడు నారాయణ. బావి అంచులో పెరిగి ఉన్న ఒక చెట్టుకొమ్మను ఆసరాగా పట్టుకుని, వేళ్లాడుతున్నాడు. అది చూసిన పోలప్ప, ‘‘నువ్వేమీ భయపడొద్దు. నిన్ను పైకి తెస్తాను’’ అని నారాయణకు ధైర్యం చెప్పి చుట్టుపక్కల వెతికాడు. కొంతసేపు వెదికాక గట్టిగా, పొడవుగా ఉన్న చెట్టుతీగ ఒకటి కనిపించింది. దానిని తెచ్చి ఒక కొస తాను పట్టుకుని మరో కొసను బావిలోకి వదిలాడు. ‘‘హమ్మయ్య, పోలప్ప సాయంతో బతికి బయటపడుతున్నాను’’ అని ఊపిరి పీల్చుకున్న నారాయణ ఆ కొసను గట్టిగా పట్టుకుని మెల్లగా పైకి రాసాగాడు. ఇంకొద్ది క్షణాలకు నారాయణ బావి పైకి చేరేవాడే! ఇంతలో... నీటిలో బాగా తడిసిన నారాయణకు వరుసపెట్టి తుమ్ములు వచ్చాయి. ఆ తుమ్ముల్ని వినగానే పోలప్పలోని చాదస్తం బయటపడింది. ‘తుమ్ముల్ని విన్న వెంటనే కాళ్లు చేతులు కడుక్కుని, కాసేపు విశ్రాంతి తీసుకున్నాకే ఏ పనైనా చేయాలి. సొరకాయ బుర్రలోని నీళ్లు కూడా అయిపోయాయి. కాళ్లు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో?’ అని తనలో తాను గొణుక్కుంటూ, తన చేతిలోని తీగ కొసను వదిలేసి చుట్టుపక్కల నీళ్లకొరకు వెదకసాగాడు పోలప్ప. (పిల్లలూ... నారాయణ ఏమై ఉంటాడో ఊహించండి. అలాగే, నారాయణ స్థితికి కారణాన్ని కూడా మీ స్నేహితులతో చర్చించండి. చాదస్తం, మూఢ విశ్వాసాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో తెలిసింది కదా!) - శాఖమూరి శ్రీనివాస్ -
మూఢ నమ్మకాలు వద్దు
జిల్లా ఎస్సీ రాజకుమారి తాండూరు రూరల్: మూఢ నమ్మకాలు వద్దని, వీటిపై ప్రజలకు క ళాజాత బృదంతో మరింత అవగాహన కల్పిస్తామని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఫైళ్లు పరిశీలించేందుకు వచ్చిన ఆమె విలేకర్లతో మట్లాడారు. అక్రమసంబంధాల వ ల్లనే హత్యలు పెరుగుతున్నాయన్నారు. తాండూరు డివిజన్ పరిధిలో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయన్నారు. డివిజన్ పరిధిలో గత మూడేళ్లకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించానని చెప్పారు. 2012లో తాండూరు డివిజన్లో 527 కేసులు నమోదు కాగా 13 మాత్రమే దర్యాప్తులో ఉన్నాయన్నారు. 2013లో 660 కేసులకు గాను 127 దర్యాప్తులో ఉండగా 2014(ఆగస్టువరకు) 468 కేసులు నమోదు కాగా 364 దర్యాప్తులో ఉన్నాయని ఆమె చెప్పారు.దర్యాప్తులో ఉన్న కేసులకు వెంటనే కొర్టులో చార్జీషిట్ వేయాలని డీఎస్పీని ఆదేశించినట్లు ఎస్పీ చెప్పారు. డివిజన్ లో 2014లో 78 శాతం దొంగతనాల రికవరీ జరిగిందన్నారు. 2012లో లాభం కోసం చేసిన హత్యలు 6 నమోదవగా రెండేళ్లుగా ఎలాంటి కేసులు నమోదు కాలేదన్నారు. పట్టణంలో చోరీలు తగ్గుముఖం పట్టాయన్నారు. అట్రాసిటి కేసుల దర్యాప్తు వేగవంతం తాండూరు డివిజన్ పరిధిలో ఎస్సీ,ఎస్టీ, వరకట్న కేసులకు సంబంధించి 2012 లో 19 కేసులు నమోద య్యాయని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఇందులో 15 ఎస్సీ,ఎస్టీ కేసులు కాగా, 4 వరకట్న కేసులు నమోదయ్యాయన్నారు. 2013 లో 35 నమోదు కాగా ఇందులో 31 ఎస్సీ,ఎస్టీ, 4 వరకట్నం కేసులు ఉన్నాయన్నారు. 2014(ఆగస్టు వరకు) 14 నమోదు కాగా ఇందులో రెండు వరకట్నం కేసులు నమోదయ్యాయన్నారు. ఎస్సీ,ఎస్టీ కేసుల దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, రూరల్ సీఐ శివశంకర్‌లు ఉన్నారు.