వదల బొమ్మాళీ..నిన్నొదల | Superstition beliefs in the Koheda zone | Sakshi
Sakshi News home page

వదల బొమ్మాళీ..నిన్నొదల

Published Mon, Aug 7 2017 1:34 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

వదల బొమ్మాళీ..నిన్నొదల

వదల బొమ్మాళీ..నిన్నొదల

‘చేతబడి’ప్రభావిత గ్రామాల్లో కోహెడ మండలం ఒకటి. ఇక్కడ 21 గ్రామాలకు కలిపి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 8 ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీకి రోజుకు సగటున 90 మంది వరకు ఔట్‌ పేషెంట్లు వస్తారు. ఇంతమందికి ఉన్న ఒక్క వైద్యురాలే వైద్యం చేయాలి. పిల్లలు, యువకులు, వృద్ధులు ఎవరు వచ్చినా రోగాలు ఏవైనా ఆ డాక్టరే చూడాలి, ఉన్న కాసిని మందులే ఇవ్వాలి. లేకపోతే పైఆస్పత్రులకు వెళ్లాలంటూ రిఫర్‌ చేయాల్సిన పరిస్థితి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పీహెచ్‌సీలోనూ ఇదే పరిస్థితి. దీంతో తగిన వైద్యం అందక గ్రామీణులు, గిరిజనులు భూత వైద్యులు, మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. మరింతగా మూఢ నమ్మకాల్లో కూరుకుపోతున్నారు..
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని ‘మంత్రతంత్రాలు’పట్టిపీడిస్తున్నాయి.. గ్రామీణ, గిరిజన ప్రాంతాలను ‘దెయ్యాలు, భూతాలు’కకావికలం చేస్తున్నాయి.. రోజురోజుకూ ప్రజల్లో మూఢ నమ్మకాలు మరింతగా చుట్టుముడుతున్నాయి.. రోజూ ఏదో ఒక చోట ‘చేతబడి, బాణామతి’పేరిట దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. పసిపిల్లలకు జ్వరం రావడం దగ్గరి నుంచి పొలాల్లో రైతులకు పాముకాటు దాకా అన్నింటికీ మంత్రగాళ్లను, భూత వైద్యులనే ఆశ్రయిస్తున్నారు. ఏ చిన్న వ్యాధి వచ్చినా వారి దగ్గరికే వెళుతున్నారు.. గ్రామాల్లో ప్రజలకు తగిన వైద్యం అందకపోవడం, ఆర్థిక, సామాజిక నేపథ్యం, మూఢ నమ్మకాలు, భూత వైద్యులు, మంత్రగాళ్లు జనాలను మరింతగా గారడీ చేస్తూ, భయపెడుతూ తమదారికి తెచ్చుకుంటుండడం వంటివన్నీ ఈ పరిస్థితికి కారణంగా మారుతున్నాయి.

ఈ మంత్రతంత్రాల అపవాదు కారణంగానే జూలై 10న కరీంనగర్‌ జిల్లా కందుగులలో గంట కొమురయ్య దంపతులు, ముగ్గురు బిడ్డలను హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, జనగామ, సిద్దిపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ‘సాక్షి’ ప్రత్యేక పరిశీలన జరిపింది. అక్కడ ప్రజల ఆర్థిక సామాజిక నేపథ్యం, ప్రజావైద్యం అందుతున్న తీరు, మూఢ నమ్మకాల పరిస్థితులను పరిశీలించింది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ పరిశీలన సందర్భంగా అధిక శాతం జనం మంత్రతంత్రాలు, చేతబడి, భూతవైద్యులపై నమ్మకాన్ని వ్యక్తపరచడం ఆందోళన కరం.
 
ఇదో మాయల తంత్రం
హుస్నాబాద్‌ మండలం బల్లూనాయక్‌ తండాకు చెందిన మాయేందర్‌ (పేరు మార్చాం) అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొందరు యువకుల నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. మోసపోయిన వారు కొద్దిరోజులుగా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు. దీంతో మాయేందర్‌ తల్లిదండ్రులు తమ కుమారుడికి ఎవరో చేతబడి చేసి చెడుమార్గం పట్టిస్తున్నారని భావించి.. అతడిని తీసుకుని ముల్కనూర్‌ గ్రామంలోని ఓ ఎరుకల సాని వద్దకు వెళ్లారు. ఆమె మాయేందర్‌పై పాలోళ్లే చేతబడి చేయించారని చెప్పింది. హుస్నాబాద్‌ మండలం చౌటపల్లిలోని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చింది. దీంతో వారు తమ కుమారుడిని తీసుకుని ఆ మంత్రగాడి వద్దకు వెళ్లారు.
 
ఎద్దు తొక్కని ఇసుక.. ఏడు బావుల నీళ్లు..
కోహెడ మండలం సముద్రాలలో మరో ఘటన కనిపించింది. ఇటీవల వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ప్రభావంతో రైతుల బోర్లలో నీళ్లు తగ్గుతున్నాయి. చెంచరు చేరుపల్లి గ్రామానికి చెందిన శ్రీమన్‌రావు (పేరు మార్చాం) అనే రైతు బోరు కూడా అడుగంటి పోయింది. కానీ శ్రీమన్‌రావు ఏదో అనుమానం పెట్టుకుని సముద్రాల గ్రామంలోని ఉస్మాన్‌ఖాన్‌ అనే మంత్రగాడి వద్దకు వచ్చాడు. ఉస్మాన్‌ఖాన్‌ దివ్యదృష్టితో చూసినట్లుగా చేసి... పక్కనున్న పొలం యజమానే ‘మంత్రాలు’చేయించాడని చెప్పాడు. ఆ దుష్టశక్తిని తరిమేసి, బోరులోకి మళ్లీ నీళ్లు మళ్లించటానికి క్షుద్ర పూజ చేయాలన్నాడు.

ఇందుకోసం ఎద్దు తొక్కని ఇసుక, ఏడు బావుల నీళ్లు, పసుపు కలిపిన బియ్యం, నల్ల వక్కలు, ఆరు నిమ్మకాయలు తెచ్చుకోవాలని చెప్పాడు. ఆ సామగ్రి తెచ్చాక ఏవేవో పూజలు చేసి.. వాటిని మూట కట్టి ఇచ్చాడు. వాటిని బోరులో, పంట పొలంలో చల్లితే పాతాళగంగ మళ్లీ పైకి వస్తుందని చెప్పి పంపించాడు. ఈ మంత్రగాడు పసిపిల్లలకు విరోచనాలు, జలుబు, జ్వరం, పెద్దలకు స్వైన్‌ఫ్లూ, కేన్సర్‌ వంటి వ్యాధులకు కూడా భూత వైద్యం చేస్తాడని.. ప్రతి గురువారం, ఆదివారం చాలా మంది జనం వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.
 
ఎన్నో విధాలుగా..
పసిపిల్లలు మూత్రం పోయడానికి ఇబ్బంది పడడం దగ్గరి నుంచి పెద్దల అనారోగ్య సమస్యల వరకు చాలా మంది భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో కొన్ని వర్గాల వారిని చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి బాణామతిని సాకుగానూ ఉపయోగించుకుంటున్నారు. వారిపై మంత్రతంత్రాల ఆరోపణలు చేసి.. నిర్దోషిగా రుజువు చేసుకోవడానికి వేడి నూనెలో చేతులు పెట్టడం, కాలుతున్న గడ్డపార పట్టుకోవాలని చెప్పడం వంటి పరీక్షలు పెడుతున్నారు.
 
ఒంట్లో మేకులు పీకగలరు!
నల్లగొండ జిల్లా గుండ్లపల్లికి చెందిన కాశమ్మ (65) ఒంటరిగా జీవిస్తోంది. ఇటీవల కీళ్ల నొప్పులు రావడంతో ముగ్గురు భూత వైద్యుల వద్దకు వెళ్లింది. దీనిపై ఆమెను పలకరిస్తే... ‘‘డిండి సర్కారు దవాఖానకు (పీహెచ్‌సీ)కి పోతే మందు గోలీలు ఇచ్చారు. నెల రోజులు మింగినా నొప్పులు తగ్గలేదు. చెర్వుగట్టు గ్రామంలో మంత్రాలు వేస్తారంటే అక్కడికి వెళ్లిన. మా పాలోళ్లే మంత్రాలు చేశారని ఆ మంత్రపాయన చెప్పిండు. నిమ్మకాయలు మంత్రించి ఇచ్చిండు. నాలుగు అమావాస్యలు వెళితే పాణం కొద్దిగా కుదురుకుంది. తర్వాత మా చెల్లె కల్వకుర్తి (నాగర్‌కర్నూలు జిల్లా)కి తీసుకపోయింది. అక్కడి భూత వైద్యురాలు కూడా నాకు ఎవరో చేతబడి చేశారని, మట్టి బొమ్మను చేసి కీళ్లకు మొలలు గుచ్చారని చెప్పింది. నా ఒంటి మీద గుచ్చిన మొలలను గుర్తుపట్టి ఆమె పంటితో పీకేసింది. ఆరు మొలలు ఎల్లినయ్‌. నిమ్మకాయలు మంత్రించి ఇచ్చి, వారం వారం రమ్మని చెప్పింది. ఇప్పుడు మంచిగనే అనిపిస్తోంది..’’అంటూ చెప్పింది.
 
పోలీసు కేసులకే పరిమితం
మంత్రాలు, చేతబడి, బాణామతి అనేవి వైద్య విజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో రోగికి మనోధైర్యం కల్పించడం కోసం మొదలైన ప్రక్రియలనీ.. కానీ అవి సంస్కృతిలో భాగమై వస్తున్నాయని సామాజికవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ మంత్రతంత్రాల సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోందని అంటున్నారు. పోలీసు రికార్డులను బట్టి ప్రతి జిల్లాలో ఏటా సగటున 15 నుంచి 20 కేసుల వరకు మంత్రాలు, చేతబడి, బాణామతి, చెర్దుబాటు పేరుతో నమోదవుతున్నాయి. ఇక పోలీసుస్టేషన్‌ వరకు రాకుండా జరుగుతున్న ఘటనలు 100 నుంచి 150 వరకు ఉంటాయని చెబుతున్నారు. పోలీసు లు కూడా నేరం జరిగిన తరువాత వెళ్లి కేసులు నమోదు చేయడానికే పరిమితమవుతున్నారని స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్‌లో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సుదర్శన్, ఆయన భార్య రాజేశ్వరిని స్థానికులు మంత్రాల నెపంతో హత్య చేశారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు నుంచే వారిని బంధించి ఉంచారు. దీనిపై వారి కుమారుడు శ్రీధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం.
 
ఆస్పత్రులున్నా.. సౌకర్యాలేవి?
రాష్ట్రంలో ఐదు వేల మందికి ఒకటి చొప్పున ఒక ఉప వైద్య కేంద్రం, 30 వేల మంది జనా భాకు ఒక పీహెచ్‌సీ, లక్ష మంది జనాభాకు ఒక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ఉన్నాయి. మొత్తంగా 10,760 గ్రామా లుండగా... పీహెచ్‌సీలు 930, సీహెచ్‌సీలు 125 మాత్రమే ఉన్నాయి. ఇక 4,500 ఉప కేంద్రాలున్నా వాటిలో వైద్యులుం డరు,  ఏఎన్‌ఎంలే ఉంటారు. వాటిలో తగిన వైద్య సేవలు అందుబాటులో ఉండవు. పీహెచ్‌ సీల్లో ఉండే ఒక రిద్దరు వైద్యులు.. రోగులంద రికీ వైద్యసేవలు అందించే పరిస్థితి లేదు. అంటే కేవలం 10% గ్రామాలకే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఉన్న ఆస్పత్రులనూ వైద్యుల కొరత వేధిస్తోంది. వైద్యులు, నర్సులు కలిపి వెయ్యి వరకు ఖాళీలున్నాయి. వైద్యులు ఉన్నచోట వారు వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొంది.
 
ప్రజావైద్యం దిక్కులేకే..
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజావైద్యాన్ని విస్మరించిన ఫలితంగానే పల్లెల్లో బాణామతి, చేతబడుల వంటి మూఢనమ్మకాలు మరింతగా పెరిగిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూఢ నమ్మకాలకు తోడు ప్రజలకు ప్రభుత్వ వైద్యం, మందులు సరిగా అందుబాటులో లేకపోవటంతో వారు భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దీనికి సాంస్కృతిక నేపథ్యం కూడా కొంత తోడయింది. అసలు సగటున ప్రతి నాలుగు ఊళ్లకు ఓ పేరుపొందిన మంత్ర వైద్యుడు ఉండగా.. సగటున పది గ్రామాలకు కలిపి కూడా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం గమనార్హం. ప్రజలు పది ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లి వైద్యం పొందాల్సిన పరిస్థితి. ఉన్న ప్రభుత్వాస్ప త్రుల్లోనూ వైద్యులు, మందుల కొరత వేధిస్తోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రసూతి కేంద్రాలను మెరుగు పరిచింది. కానీ సాధారణ రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, మొండి వ్యాధులను పసిగట్టి వైద్యం చేసే పరిస్థితి లేదు. పేదల ఆర్థిక స్థితికి అనుగుణంగా చవక మందులు అందుబాటులో లేవు.
 
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి..
‘‘రుజువులకు అందని ఓ అభూత కల్పనను జనంపైకి ప్రయోగించి వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న ప్రక్రియ బాణామతి. ఈ నెపంతో దళిత, గిరిజన కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక నేపథ్యం, ప్రజా వైద్యం అందుబాటులో లేకపోవటం వల్లే ప్రజలు ఇంకా మంత్రాలను నమ్ముతున్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోంది. మూఢ నమ్మకాల నిర్మూలన కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి..’’
– తాటి రమేశ్, జన విజ్ఞాన వేదిక కన్వీనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement