Supplement
-
అక్కాచెల్లెళ్ల హెల్త్ఫుల్ సప్లిమెంట్స్!
‘‘మన నేల సుసంపన్నం... పోషకాలన్నీ ఉన్నాయి. కానీ... పోషకాహారలోపంతో బాధపడుతోంది మనదేశం. ఆరోగ్యాభిలాషులుగా మేము హెల్దీ లివింగ్ కోసం ఉద్యమించాం. మొక్కలతో పోషకాలందించాలనే సంకల్పాన్ని చేబూనాం. భూమి... మొక్క మనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. అందుకే మా ప్రయోగాలకు ఎర్త్ ఫుల్ అని పేరు పెట్టాం’’ తమను తాము బ్లాగ్‌లో ఇలా పరిచయం చేసుకున్నారీ అక్కాచెల్లెళ్లు. వాళ్ల పేర్లు సుధ, వేద. ఇద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్ ఇంజనీర్లు. కెరీర్లో కొత్త మలుపు గురించి సాక్షితో పంచుకున్నారిద్దరూ". ‘‘మా నాన్న సొంతూరు విజయవాడ దగ్గర మానికొండ. నాన్న వ్యాపార రీత్యా ఒడిశా, వైజాగ్, హైదరాబాద్‌లో పెరిగాం. అమ్మ ఏజీ ఎమ్మెస్సీ చదివింది. మమ్మల్ని ఐఐటీలో ఇంజనీరింగ్ చేయించాలనే సంకల్పం అమ్మదే. కోచింగ్‌కి చుక్కారామయ్య గారి ఇన్స్టిట్యూట్లో చేర్చడం కోసమే హైదరాబాద్‌లో నల్లకుంటలో ఉండేవాళ్లం. నేను కెమికల్, చెల్లి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశాం. నాకు ఐటీసీ లిమిటెడ్‌లో ఉద్యోగం. హరిద్వార్‌లో పోస్టింగ్. దాదాపు ఆరువందల మంది ఉద్యోగుల్లో ఒక్క అమ్మాయిని. అర్బన్ టచ్‌లో ఉద్యోగం చేసేటప్పుడు సొంత స్టార్టప్ ఆలోచన వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చి ఎంబీఏ చేసి ఊబెర్లో లాంచింగ్ సమయంలో ఉద్యోగం చేశాను. ఇక వేద విషయానికి వస్తే... బ్యాంకింగ్‌రంగంలో ముంబయి, లండన్లలో చేసింది. సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ మూడేళ్లు ప్రయత్నించింది. తనకు బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ. మీషో స్టార్టప్ కోసం బెంగళూరులో ఉద్యోగం చేసింది. ఈ సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. వేద ఇంటి నుంచి పని చేయడానికి హైదరాబాద్‌కి వచ్చింది. ఇద్దరమూ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఆ సమయంలో బర్నింగ్ టాపిక్ ఆరోగ్యమే. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి వ్యాధినిరోధక శక్తి సమృద్ధిగా ఉండాల్సిన అవసరం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది. ఆహారం ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని పొందడం గురించి డాక్టర్లు చెబుతున్నారు. కానీ పరిపూర్ణమైన పరిష్కారం అందుబాటులో లేదప్పటకి. మనకు తెలిసింది... మంచి ఆహారం తీసుకోవడం, అనారోగ్యం వస్తే ఔషధాలు తీసుకోవడం మాత్రమే. ఈ రెండింటికీ మధ్య ఫుడ్ సప్లిమెంట్ అనే మరొక ప్రత్యామ్నాయం ఉందని మనదేశంలో అవగాహన చాలా తక్కువ. మేము ఆ చైతన్యం కోసమే పని చేస్తున్నాం’’ అన్నారు సుధ. సీట్లో కూర్చోవడం నుంచి మొదలు... ‘‘మేమిద్దరం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశాం. పనిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి విపరీతంగా శ్రమించేవాళ్లం. ఆఫీస్ వర్క్‌లో దేహకదలికలు తగినంత ఉండవు. యాసిడ్ రిఫ్లక్స్‌తో సమస్యలు జీర్ణవ్యవస్థ నుంచి మొదలవుతాయి. బ్యాక్ పెయిన్ వరకు వెళ్తుంది. ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసేటప్పటికే దేహం శక్తిని కోల్పోయి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ దేహానికి కావల్సినంత శక్తి అందడం లేదని అర్థమవుతుంది. అనారోగ్యం ఏమిట’ని ప్రశ్నిస్తే ఫలానా అని ఏమి చెప్పాలో అర్థం కాదు. డాక్టర్ సూచన మేరకు ఐరన్, క్యాల్షియమ్, ప్రొటీన్, విటమిన్లతోపాటు మైక్రో న్యూట్రియెంట్స్‌తో కూడిన మందులు వాడుతాం. మందులు ఆపేసిన రెండు వారాలకు మనతో స్నేహం చేయడానికి తిరిగి నీరసం, నిస్సత్తువలు దరి చేరతాయి. మా జనరేషన్ మాత్రమే కాదు, కొంచెం అటూ ఇటూగా సమాజంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇంట్లో దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్న మా నాన్నను చూస్తున్నాం. బలహీనమవుతున్న దేహం మనం అనుసరిస్తున్న డైలీ రొటీన్ ఆరోగ్యానికీ– అనారోగ్యానికీ మధ్య ఉండాల్సిన రక్షణరేఖ చెరిపేసిందనిపించింది. ముఖ్యంగా ఇండియన్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలైతే మరీ విడ్డూరం. అనారోగ్యమేమీ ఉండదు. నడవాలంటే మోకాళ్లు నొప్పులు, కూర్చోవాలంటే వెన్నునొప్పి, బరువు ఎత్తితే భుజం నొప్పి, త్వరగా అలసిపోవడం, నీరసం. నిజానికి ఇవేవీ అనారోగ్యాలు కావు. మనం దేహానికి అవసరమైన పోషకాలందకపోవడం వల్లనే అని మా అధ్యయనంలో తెలుసుకున్నాం. పాశ్చాత్య దేశాల్లో అయితే రోజూ ఆహారంతోపాటు ఫుడ్ సప్లిమెంట్లు కూడా తీసుకుంటారు. నిజానికి మన దేహానికి అవసరమైన పోషకాలన్నింటినీ ఆహారం ద్వారా అందించడం అంత సులువైన పనేమీ కాదు, పోషకాహార పట్టిక, న్యూట్రిషనిస్టుల సూచన ప్రకారం ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైనంత ఐరన్ ఆహారం ద్వారా అందాలంటే తొమ్మిది కప్పుల పాలకూర తినాలి. మా రీసెర్చ్‌లో తెలుసుకున్న విషయాలతోనే సమాజం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. అదే మా స్టార్టప్ అయింది. మా ఎర్త్ఫుల్ బోర్డ్ సభ్యులుగా డాక్టర్, న్యూట్రిషనిస్ట్, ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లున్నారు. ఆకు నుంచి గింజ వరకు... ప్రకృతి మనకు అవసరమైన అన్నింటినీ సమగ్రంగా, సమతూకంగా ఇచ్చింది. కానీ మనమే లైఫ్‌స్టయిల్‌ని పక్కదారి పట్టించుకున్నాం. జామపండుని కొరికి తినాలంటే దంతాలు సహకరించవు. దాంతో గింజలను వదిలేయడమో లేదా రెడీమేడ్ జ్యూస్‌లు తాగడమో చేస్తున్నాం. దాంతో గింజల ద్వారా అందాల్సిన పోషకాలను కోల్పోతున్నాం. జామ ఆకులో జింక్ ఉంటుందని తెలిసినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇలాంటి వాటిని సులువైన రూపంలో అందించడమే మా ప్రయత్నం. అలాగే ఆరోగ్యం పట్ల చైతన్యవంతం చేయడం కూడా. వ్యాపారం అంటే డబ్బు సంపాదన కోసం మాత్రమే కాకూడదు. సామాజిక బాధ్యత ఉండాలి. అలాగే నైతిక విలువలతో కూడినదై ఉండాలి. సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంలో మా కృషి ఉంటోందంటే కలిగే సంతృప్తిని మాటల్లో వివరించలేం. బాక్స్ మార్కెట్ మా వెంట వస్తోంది! భూమ్మీద జీవించాల్సిన మనిషి కోసం భూమి అన్నింటినీ మొక్కల రూపంలో ఇచ్చింది. వాటిని తెలుసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ‘భూమి నుంచి ఉద్భవించిన మొక్కల ఆధారంగా ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నాం, మొక్కల్లో మనకు అవసరమైనవన్నీ ఉన్నాయ’ని చెప్పాలనే ఉద్దేశంతో మా స్టార్టప్‌కి ఎర్త్ఫుల్ అని పెట్టాం. ఈ స్టార్టప్ కోసం చేసిన హోమ్ వర్క్ చిన్నది కాదు. ఈ జర్నీలో మేము ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్తేజితులమవుతున్నాం. తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు బ్లాగ్‌లో, ఎఫ్బీలో షేర్ చేసుకుంటూ ఉండడంతో స్టార్టప్ ప్రారంభించేటప్పటికే మాకు ఫాలోయింగ్ బాగా వచ్చేసింది. దాంతో మార్కెటింగ్ కోసం ప్రయాస పడాల్సిన అవసరం లేకపోయింది. అవుట్లెట్లే స్వయంగా మా ఉత్పత్తులను అడుగుతున్నాయి. కానీ మా ఉత్పత్తులు కమర్షియల్ కావడం మాకిష్టం లేదు’’ – సుధ, వేద, ఫౌండర్స్, ఎర్త్ఫుల్ , హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!) -
భార్య మనసు మారిపోయిందా?
భార్య ప్రేమ భర్త మనసుకు తెలుస్తుంటుంది. భార్య ద్వేషం కూడా భర్తకు తెలుస్తుంటుంది. ఈ రెంటికీ కారణాలు ఉంటాయి. కాని భార్యకు ద్వేషం ఉండి ప్రేమ నటిస్తుంటే? మనసు లోపల ఏ అనుబంధం మిగుల్చుకోకుండా కేవలం నాటకీయమైన ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటే? ఆ సంగతి భర్తకు తెలిసిపోతూ ఉంటే? ఆ భర్త దానిని ఎలా అర్థం చేసుకోవాలి? సునంద ఆ రోజు భర్త ఆఫీసుకు ఫోన్ చేసింది. ‘ఏమండీ ఏం చేస్తున్నారు?’ అడిగింది. ‘భోజనం చేశారా?’ అడిగింది. ‘ఇంటికి ఎప్పుడొస్తున్నారు?’ అడిగింది. ‘తొందరగా వచ్చేయండి మరి’ అని గారం పోయింది. భార్య ఫోన్ పెట్టేశాక రామచంద్రం ఆశ్చర్యపోయాడు. భార్య తన పట్ల కొంచెం జంకుగా ఉంటుంది. తను కొంచెం సరదాగా మాట్లాడితే తనూ సరదాగా మాట్లాడుతుంది. తన మూడ్‌ని బట్టి వ్యవహరిస్తుంది. అనవసర చనువు తీసుకోదు. అలాంటిది ఇలా ఫోన్ చేసి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటికి వెళితే భార్య ఉత్సాహంగా ఎదురు వచ్చింది. ‘ఇవాళ ఏం వండానో చెప్పుకోండి చూద్దాం’ అంది. ‘ఏం వండావు?’ ‘మీకిష్టమని పాలకూర చికెన్ చేశాను’ ‘ఓ’... ‘పిల్లలేరి?’ ‘వాళ్ల రూమ్‌లో టీవీ చూసుకుంటున్నారు లేండి. కాసేపట్లో పడుకుంటారు. స్నానం చేస్తారా? ముఖం కడుక్కుని భోజనం చేస్తారా?’ రామచంద్రం మళ్లీ ఆశ్చర్యపోయాడు. ఆఫీసు నుంచి వచ్చాక రాత్రుళ్లు అతడు స్నానం చేయడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ చేయలేదు. ఇదేం ప్రశ్న. ‘ముఖమే కడుక్కుంటాను’ ‘కడుక్కోండి మరి’ అని అతడు బాత్రూమ్లో సింక్ దగ్గర ముఖం కడుక్కుంటూ ఉంటే టవల్ పట్టుకుని బాత్రూమ్ డోర్ దగ్గర నిలబడింది. ‘ఏంటి సునందా.. ఏమైనా కావాలా? ఏమైనా కొనుక్కోవాలా?’ అడిగాడు రామచంద్రం, భార్య తాపత్రయానికి నిజంగానే ఏదైనా అడిగితే ఇద్దామని. ‘నాకేం కావాలండీ. మీరుంటే అదే పది వేలు. మీతో కాపురం తప్ప ఇంకేం కావాలి?’ అంది సునంద నవ్వుతూ. ఉదయం పూట పిల్లల్ని స్కూల్‌కి హుషారుగా తయారు చేస్తోంది సునంద. అంతకు ముందు పిల్లలను అప్పుడప్పుడు కసిరేది. విసుక్కునేది లేటవుతుంటే. ఇప్పుడలా లేదు. ముద్దు చేస్తోంది. భర్త రావడంతోటే ‘ఒక్క నిమిషం అండీ’ అని హడావిడిగా వెళ్లి టీ పెట్టుకుని వచ్చి ఇస్తోంది. ఆ రోజు పిల్లల కోసం ఉప్మా, అతని కోసం పూరీ చేసింది. ‘ఉప్మా ఏం తింటార్లేండి మీరు. పూరి తినండి’ అని కర్రీతోపాటు ఆవకాయ కూడా తెచ్చి పెట్టింది. అతడు రెడీ అయ్యి బైక్ తీసి ఆఫీసుకు బయలుదేరుతుంటే బాక్స్ తెచ్చి చిరునవ్వుతో నిలబడింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిపోయింది. రామచంద్రంకు గుటకలు పడ్డాయి. ఈమె ఇలా ఎందుకు మారిపోయింది.రామచంద్రంకు, సునందకు పెళ్లయ్యి పదేళ్లు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. రామచంద్రంకు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు. సునంద తల్లిదండ్రులే బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఉద్యోగంలో వచ్చేది గొప్ప జీతం కాకపోయినా వారి సపోర్ట్ వల్ల పిల్లల్ని మంచి బడిలో చదివిస్తున్నాడు. రామచంద్రంకు బయట పెద్ద వ్యాపకాలు లేవు. ఆఫీసు, ఇల్లు.. అంతే తెలిసింది. సునందతో విపరీతంగా మాట్లాడటం కబుర్లు చెప్పడం అలా ఏమీ చేయడు. అతిగా వ్యవహరించడం అనుకుంటాడు. సునంద కూడా మామూలుగా బిహేవ్ చేస్తుంది. ఇద్దరిలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఎంత ఉందో తెలియకపోయినా ద్వేషం మాత్రం లేదు. అనుబంధం ఉంది. ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉంది. కాని సునంద ప్రవర్తన ఇలా మారడం అతడికి విచిత్రంగా ఉంది. పదకొండు గంటలకు భార్య వాట్సప్ నుంచి ముద్దులు, లవ్ సింబల్స్ వచ్చాయి. ఇది ఇంకా స్ట్రేంజ్. సునంద వాట్సప్ వాడటం బహు తక్కువ. పిల్లలకు స్నాక్స్ అయిపోయినప్పుడు, వంట మరీ బద్దకించినప్పుడు ఫుడ్ తెచ్చుకోమనో పెడుతుంది. ఇలా ముద్దులు గిద్దులు పెట్టదు. రామచంద్రం ఆ మెసేజ్‌లు చూసి ఆ తర్వాత పనిలో పడిపోయాడు. రాత్రి కాస్త లేట్ కూడా అయ్యింది. ఇంటికొచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పిల్లలను అప్పటికే నిద్ర పుచ్చేసినట్టుంది. సునందను చూసే సరికి అదిరిపోయాడు. ఏడ్చి ఏడ్చి ఉన్నట్టుగా కళ్లు ఎర్రగా అయిపోయి ఉన్నాయి. చాలా డిస్ట్రబ్డ్‌గా కనిపించింది. విసురుగా ఉన్నాయి కదలికలు. ‘ఏమైంది?’ అన్నాడు కంగారుగా. ‘మీరు నా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదు’ అంది. ‘సునందా... ఏమిటి నీ ప్రవర్తన’ అని అనునయంగా అన్నాడు రామచంద్రం. ఆ రాత్రంతా సునంద ఏడుస్తూ ఉంది. రామచంద్రం ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు. ఇది చాలా విపరీత ప్రదర్శన అనుకుని రెండు మూడు రోజులు సైలెంట్‌గా ఉండి ఆ తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు రామచంద్రం. ఆమెను లోపల వదిలి తాను తప్పుకున్నాడు.సునందను చూసిన సైకియాట్రిస్ట్ ‘తొందరేమీ లేదు మెల్లగా మాట్లాడుకుందాం’ అని మంచినీళ్లిచ్చింది. సునంద చామనఛాయగా ఉంటుంది. పుట్టుకతో మడమ మెలికపడి ఉండటం వల్ల కాలు కొంచెం ఎగరేసి నడుస్తుంది. గమనించి చూస్తే తప్ప ఆ తేడా తెలియదు. కాని లోలోపల ఆ లోపం పట్ల న్యూనత పెంచుకొని కాలేజీకి వచ్చేసరికి చదువు మానేసింది. కొన్ని సంబంధాలు ఈ కాలి లోపం వల్ల తప్పిపోయాయి. అప్పుడు తల్లిదండ్రులు ఈ రామచంద్రం సంబంధం వెతికి చేశారు. ఇద్దరిదీ ఆర్థికంగా సమస్థాయి కాకపోయినా కూతురి కోసం దిగి వచ్చారు. రామచంద్రం ఊహల్లో ఉన్న భార్య వేరు. వచ్చిన భార్య వేరు. అయితే ఆ భార్యను అతడు ఎప్పుడూ ఆమెకు తెలిసేంత ప్రేమతో చూడలేదు. అలాగని దూరమూ లేడు. చాలా సాధారణ స్థాయిలో వ్యవహరించేవాడు. కాని అతడి లోపల ఉన్న ఏదో అసంతృప్తి అతని పిలుపు వల్ల తెలిసేది. ‘ఎల్.సునంద’ అని పిలిచేవాడు అప్పుడప్పుడు. ఆమె ఇంటి పేరు ఎల్ కాదు. ఎల్ అంటే ‘లెగ్’. ‘ఏమోయ్ లెగ్గూ’ అనేవాడు అప్పుడప్పుడు. ‘నల్ల పెళ్లాం’ అనేవాడు. వాటికి సునంద నవ్వి ఊరుకునేది కాని లోపలి ప్రేమ వ్యక్తం చేసేది కాదు. ఈ మధ్య ఆమెకు ఒక ఫేస్బుక్ ఫ్రెండ్ పరిచయమయ్యాడు. మొదటిసారి అతడు ‘మీరు బంగారమండీ’ అన్నాడు. ‘మీరు మహరాణి అండీ’ అన్నాడు. ‘మీ కళ్లల్లో స్వచ్ఛత అద్భుతం’ అన్నాడు. ‘నా కాలు సంగతి మీకు తెలియదు’ అని సునంద అంటే ‘కాలు ఎవరు చూస్తారండీ... మనసు చూడాలి’ అన్నాడు. ఇవన్నీ సునందకు కొత్త. అందుకే తబ్బిబ్బు అవుతోంది. అయితే అవన్నీ వేరే మగవాడి నుంచి వినడం ఆమెకు ఇష్టం లేదు. అందుకే గిల్ట్ ఫీల్ అవుతోంది. ఆ గిల్ట్తో భర్త మీద అతి ప్రేమ మొదలెట్టింది. కొత్త స్నేహం కొనసాగించలేక, ఉన్న అనుబంధంలో తనకు కావలసింది పొందలేక ఆమె నలుగుబాటే ఈ కేస్. సైకియాట్రిస్ట్ అంతా విని భర్తకు విడిగా చెప్పింది–‘మీరు ఉట్టి భర్తగా కాకుండా ప్రేమించే భర్తగా మారాలి. లాలించే భర్తగా మారాలి. ఆమె లోపాలను దాటి ఇష్టపడే భర్తగా మారాలి. ఈ జన్మకు తనే మీ భార్య అని ఆమె అనుకుంటోంది. ఇద్దరు పిల్లల్ని కని ఇచ్చి జీవితాన్ని ఇచ్చి మీ నుంచి ఆశించే కొద్దిపాటి ప్రేమ కూడా పొందకపోతే ఆమె పరిస్థితి ఏమి కావాలి? చెప్పండి?’ అంది. రోజులు గడిచాయి. సునంద ఫేస్బుక్ నుంచి బయటకు వచ్చేసింది.రామచంద్రంకు స్పెషల్ కాల్స్ చేయడం లేదు. స్పెషల్ మెసేజెస్ పెట్టడం లేదు. కాని అతడు ఇంటికొచ్చాక టీవీ చూస్తూ చేయి పట్టుకుని దగ్గర కూచోబెట్టుకున్నప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా అతడి భుజాన తల వాల్చుతోంది. – కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్ -
ఇంటికొచ్చిన ఆకాశం
ప్రాణం పోయినంత పనౌతుంది.. దగ్గరి బంధువు పోతే!జ్ఞాపకాలు గుచ్చిగుచ్చి ఏడ్పిస్తాయి.. నిర్లక్ష్యాలు వెక్కిరిస్తాయి!అనుబంధాలు చక్కిలిగిలి పెడ్తాయ్!మనిషిపోతే.. ఇంకా ఎంతో ఉంటుంది..లేమి గుండె నింపుతుంది... తలపు తలుపు తెరుస్తుంది..ఆకాశం ఇంటికొస్తుంది!! ‘‘నిరంజన్... ఓ అన్న. జానకి.. అతని చెల్లెలు. కుటుంబం కోసం కష్టపడ్డం తప్ప ఇంకేం తెలియని.. పట్టని మనిషి అతను. అన్న అనుబంధం కోసం తపించే చెల్లెలు ఆమె. ఈ ఇద్దరి కథే... ‘‘హ్యాపీ జర్నీ’’.. మరాఠీ సినిమా. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. రక్తసంబంధంగా మాత్రమే మిగిలిన ఆ బంధం.. ఆప్యాయతానురాగాల అనుబంధంగా ఎలా బలపడిందో చూపే ప్రయాణం. తొలి మజిలీ గ్యారేజ్ నడుపుతున్న తండ్రి ఆర్థిక బాధ్యతను పంచుకోవడానికి టీనేజ్లోనే గల్ఫ్‌కి వెళ్తాడు నిరంజన్. అప్పటికి జానకి వయసు రెండేళ్లు. అవసరమున్నప్పుడు అమ్మానాన్నలతో ఫోన్లో మాట్లాడ్డం తప్ప దాదాపుగా ఇండియాకు రాకుండానే పనిలో మునిగిపోతాడు. ఇంటికి డబ్బులు పంపించడమే అతని ధ్యేయం. అలాంటి నిరంజన్.. కుటుంబంలో జరిగిన ఓ విషాదం వల్ల ఇండియా వస్తాడు. అప్పటికి అతని చెల్లెలి వయసు పదిహేడేళ్లు. మూడో రోజు.. నిరంజన్ గల్ఫ్ నుంచి వచ్చిన మూడోరోజున .. నాలుగువేల రూపాయల ఇంటర్నెట్ బిల్ వస్తుంది. ‘‘ఇంత బిల్ ఏంటీ’’ అంటూ పేరెంట్స్‌ని కేకలేస్తాడు. ‘‘నాకేం తెలీదు.. జానకే వాడేది’’ తల్లి చెప్తుంది అమాయకంగా. ఆ రాత్రి .. ఇంటి బయట.. వ్యాన్‌లో చెల్లెలు ఉన్నట్టు నిరంజన్‌కు కలొస్తుంది. దిగ్గున లేచి ఆరుబయటకు వస్తాడు. వ్యాన్లోకెళ్తాడు. వెనక సీట్లో ఓ అమ్మాయి అటు తిరిగి పడుకుని ఉంటుంది. షాక్ అవుతాడు. శంకిస్తూనే ఆ అమ్మాయి భుజం తడ్తాడు. ఆ పిల్ల ఇటు తిరుగుతుంది. అవాక్కవుతాడు. చెల్లెలు! ‘‘నువ్వు .. ఇక్కడ?’’ విస్మయంగా అతను. ‘‘అవున్నేనే’’ అంటూ లేచి కూర్చుంటుంది జానకి. లాంగ్‌డ్రైవ్‌కి తీసుకుపొమ్మని అడుగుతుంది. ‘‘లాంగ్ డ్రైవ్ లేదు ఏం లేదు. ముందు ఇక్కణ్ణుంచి వెళ్లిపో’’ అని కోప్పడ్తూ వ్యాన్ దిగి ముందున్న పచ్చికలో కూర్చుని కునికిపాట్లు పడ్తుంటాడు. హఠాత్తుగా మెలకువ వస్తుంది. వ్యాన్ విండో సీట్లోంచి తననే చూస్తూ జానకి కనిపిస్తుంది. పెంకిపిల్ల అని విసుక్కుంటూ ‘‘లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళితే వెళ్లిపోతావా?’’ అని అడుగుతాడు. ‘‘నేననుకున్న పని పూర్తవగానే వెళ్లిపోతా.. నువ్వు ఉండమన్నా ఉండను’’ అంటుంది. తెల్లవారి... ఇంటిముందున్న వ్యాన్ని చూపిస్తూ ‘‘అది బాగైపోతే డెలివరీ చేయొచ్చు కదా’’ అంటాడు తండ్రితో నిరంజన్. ‘‘ఇంకా కొంచెం పనుంది’’ చెప్తాడు తండ్రి. లోపల గదిలో.. బట్టలు మూటకడుతూ ‘‘జానకి బట్టలు.. అనాథాశ్రమంలో ఇచ్చొస్తావా?’’ బాధ నిండిన స్వరంతో అడుగుతుంది నిరంజన్ వాళ్లమ్మ. ‘‘అమ్మా.. ఆత్మలుంటాయా?’’ అడుగుతాడు. ‘‘కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్లు ఆత్మలుగా మారి కోరికలు తీర్చుకుని పోతారు. అవునూ .. ఎందుకడిగావ్ ఇది?’’ అంటుంది తల్లి. ‘‘తెలుసుకుందామని’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోతాడు. ఈ లోపు బయటనుంచి ఒకటే హార్న్.. చెవులు చిల్లులు పడేలా. చిరాకు పడుతూనే ఇంట్లో ఎవరూ చూడకుండా టీ తీసుకెళ్లి వ్యాన్ విండోలోంచి చెల్లికి ఇస్తాడు. ‘‘కాఫీ లేదా? టీ తెచ్చావ్’’ అయిష్టంగా మొహం పెడుతూ చెల్లి. ‘‘ఇచ్చింది తాగు’’ అని వెళ్లబోతుంటే ‘‘నిరంజన్... నోట్పాడ్ తెచ్చివ్వా?’’ అడుగుతుంది జానకి. ‘‘నోట్పాడా? నీకేమన్నా బుద్ధుందా? ఇంటర్నెట్ బిల్ నాలుగువేలొచ్చింది తెల్సా? అవునూ... ఆ పెన్‌డ్రైవ్‌లో ఆ పోర్న్ వీడియోలేంటీ? నీ వయసేంటి? నువ్ చేస్తున్న పనులేంటి?’’ అని బెదిరిస్తాడు. ‘‘అవి నా పర్సనల్ థింగ్స్. చెక్ చేయడం మ్యానర్సేనా?’’ జానకి ఎదురు మాట్లాడుతుంది. ఎప్పటిలాగే వినిపించుకోకుండా వెళ్లిపోతాడు అతను. ఇంట్లో అల్మారా సర్దుతుంటే ఫోటోలతో ఉన్న జానకి బ్యాగ్ కనపడుతుంది. జానకికి ఊహ తెలిసినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు దిగిన ఫోటోలు. అమ్మ, నాన్న, జానకి... తన ఫోటో ఉన్న ఫ్రేమ్ పట్టుకుని. కొన్ని ఫొటోల్లో జానకి.. తన ఫోటో ఫ్రేమ్ పట్టుకొని. అమ్మ, నాన్న, జానకి.. ముగ్గురే దిగిన ఫోటో ఒక్కటీ లేదు. తను లేకపోయినా తన ఫోటో పట్టుకుని కుటుంబ ఛాయాచిత్రాన్ని పూర్తి చేసింది చెల్లెలు. కళ్లు చెమ్మగిల్లుతాయి నిరంజన్‌కు. తను గల్ఫ్‌లో ఉన్నా చెల్లెలు తనను ఆ కుటుంబంతో కలిపే ఉంచింది. మనసు ఆర్ద్రమవుతుంది. వెంటనే నోట్‌ప్యాడ్ తీసుకొని చెల్లికి ఇచ్చొస్తాడు. ఆమె ఆనందానికి అవధులుండవ్. లక్షన్నర బిల్లు.. రెండోరోజుకల్లా ఓ ఆరు జతల కొత్తబట్టలు ఇంటికి డెలివరీ అవుతాయి. లక్షన్నర రూపాయలు క్రెడిట్‌కార్డ్ నుంచి డెబిట్ అయినట్టూ మెస్సేజ్ వస్తుంది. అనుమానం చెల్లి మీదకు మళ్లి ఆ కొత్తబట్టల బ్యాగ్స్‌తో విసావిసా చెల్లి దగ్గరకు వస్తాడు. నోట్ ప్యాడ్‌లో మ్యూజిక్ వింటున్న జానకి చెవుల్లోంచి ఇయర్ ఫోన్స్ లాగేసి.. ‘‘ఏంటీ పని?’’ అని గద్దిస్తాడు. ‘‘అరే వ్వా.. వచ్చేశాయా బట్టలు? ఏం నచ్చలేదా?’’ అంటుంది. కోపాన్ని దిగమింగుకుంటూ.. ‘‘నా జీవితంలో ఇంత ఖరీదైన బట్టలు నేనెప్పుడూ వేసుకోలేదు. నాకెవ్వరూ ఇప్పించలేదు’’ అరుస్తాడు. ‘‘అందుకే ఇప్పుడు వేసుకో నిరంజన్.. నేను ఇప్పించానుగా’’ అంటుంది. ‘‘మతి ఉండే మాట్లాడుతున్నావా? వీటికి లక్షన్నర తగలేస్తావా? డబ్బులనుకున్నావా? ఇంకేమన్నానా? ఎంత కష్టపడితే వస్తాయో తెలుసా?’’ అంటూ కన్నెర్ర చేస్తాడు. ‘‘తెలుసు. మా కోసం నీ ఇష్టాలను చంపుకొని ఎంత కష్టపడ్డావో తెలుసు. మమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నువ్వెన్ని కోల్పోయావో తెలుసు. నా ట్రీట్మెంట్ కోసం పైసాపైసా కూడబెట్టిందీ తెలుసు. కానీ ఏమైంది? నిరంజన్... ఇప్పటినుంచైనా నీ కోసం నువ్వు బతుకు. నచ్చినట్టు ఉండు. ముసలోడిలా ఉండకు. స్టయిల్ మార్చు’’ అంటూ ఇంకేదో చెప్పబోతుంటే.. ‘‘నోర్ముయ్’’ ఆవేశంగా అతను. అంతే! ఏడుపు లంకించుకుంటుంది ఆ పిల్ల. కంగారుపడి ‘ఏడ్వకు’ అంటూ చెల్లెలిని బతిమాలుతాడు. సారీ చెప్తాడు. మలి మజిలీ... ఆ రోజు రాత్రి మళ్లీ లాంగ్‌డ్రైవ్‌కి వెళ్తారు అన్నాచెల్లెళ్లు. ఊరవతల ఓ సెలయేటి ఒడ్డున వ్యాన్ ఆపి.. దిగుతాడు నిరంజన్. ఒడ్డున కూర్చుని బీర్ తాగుతుంటాడు. వ్యాన్ విండో దగ్గర జానకి. ‘‘ఖతర్‌కి వెళ్లినప్పుడు నీ వయసెంత అన్నయ్యా?’’ అడుగుతుంది. ‘‘పదహారుంటాయేయో. వారానికి ఒక్కరోజు రెండు పూటలా భోజనం చేసే చాన్స్ దొరికేది. ఓ నాలుగేళ్లకు అక్కడి నుంచి దుబాయ్కొచ్చా. ఉద్యోగం చేస్తూనే కంప్యూటర్స్ నేర్చుకున్నా. తర్వాత కొన్నాళ్లకు మంచి జాబ్ దొరికింది. అంటే రోజూ రెండుపూటలా భోజనం చేసే అవకాశం ఇచ్చిన కొలువన్నమాట’’ బీర్ తాగుతూ తన జీవితం గురించి చెప్తాడు చెల్లికి. ఆమె కళ్లల్లో నీళ్లు. ‘‘నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అన్నయ్యా? అందరిలాగే నాకూ నీతో షికారుకెళ్లాలని.. కలిసి ఆడాలని.. పాడాలని.. సినిమాలు చూడాలని.. నీ దగ్గర అలగాలని..’’ తీరని కోరికలన్నీ వివరిస్తుంది. నిరంజన్ కళ్లల్లోనూ నీటి చెమ్మ. ‘‘నాకూ ఇవ్వవా బీర్...’’ అడుగుతుంది కిటికీలోంచి చేయి చాస్తూ. ‘‘ఆ..’’ గదమాయిస్తాడు. ‘‘ప్లీజ్’’ రిక్వెస్ట్ చేస్తుంది. నవ్వుతూ బీర్ ఇస్తాడు. గటగటా తాగేసి బాటిల్ నీళ్లల్లో పడేస్తూ.. ‘‘గర్ల్ ఫ్రెండ్?’ అడుగుతుంది. ‘‘ఏంటీ, ఈ మెకానిక్కు.. అదీ గల్ఫ్‌లో గర్ల్‌ఫ్రెండా?’’ నవ్వేస్తాడు. చివుక్కుమంటుంది చెల్లి మనసు. ‘‘అవునూ.. స్కూల్ డేస్‌లో నీకో గర్ల్ ఫ్రెండ్ ఉండేదని విన్నానే?’’ అంటుంది.‘‘అలీస్. కాని నేను గల్ఫ్కెళ్లిపోయా కదా.. అక్కడితో ఎండ్ అయింది’’ అంటాడు విచారంగా. నిట్టూరుస్తుంది జానకి. అలా ఆ రోజు నుంచి ఆ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం పెరుగుతూంటుంది. ప్రతిరోజూ ఇద్దరూ కలిసి లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లడం.. ఆ ప్రయాణంలో చిన్నప్పటి నుంచి మిస్ అయినవన్నీ గుర్తు చేసుకోవడం.. మాట్లాడుకోవడం వాళ్ల దినచర్య అవుతుంది. ఆ అన్నకు బిడ్డగా.. చెల్లికి నచ్చినట్టుగా వ్యాన్‌ను క్యారవాన్‌లా మోడిఫై చేస్తాడు. స్టవ్ అమరుస్తాడు. కాఫీనుంచి డిన్నర్ దాకా కలిసే చేస్తుంటారు. చెల్లి మెచ్చేట్టుగా తన డ్రెస్సింగ్, హెయిర్ స్టయిల్ మార్చుకొని యంగ్లుక్కి వచ్చేస్తాడు. నిరంజన్ తల్లిదండ్రులకు ఆశ్చర్యంతోపాటు అనుమానమూ కలుగుతూంటుంది. ఎప్పుడు చూసినా అతను వ్యాన్‌లో ఉండడం.. వ్యాన్ గోడలకు లిప్‌స్టిక్, నెయిల్ పాలిష్ మరకలూ కనిపిస్తూండడంతో నిరంజన్ తల్లి ఆందోళన పడ్తూంటుంది. ‘‘పోనీలే.. ఇప్పటికైనా ఓ తోడు కావాలని వాడికి అర్థమైంది. అనవసరంగా టెన్షన్ పడకు’’ అంటూ ఆమెకు సర్దిచెప్తాడు తండ్రి. ఆ టైమ్‌లోనే తన బాయ్‌ఫ్రెండ్‌ను అన్నకు చూపిస్తుంది జానకి.తామిద్దరూ మాట్లాడుకునే అవకాశం కల్పించమని కోరుతుంది అన్నను. కల్పిస్తాడు నిరంజన్. అలా మొత్తానికి చిన్నప్పటి నుంచి తామిద్దరూ కోల్పోయిన అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని ఇద్దరూ ఆస్వాదించేలా చేస్తుంది జానకి. డబ్బు సంపాదించే యంత్రంలా కష్టపడ్డం మాత్రమే తెలిసిన అన్నను మనిషిగా మలచి అతనికి మనసుందన్న విషయాన్ని గుర్తుకు తెస్తుంది. ఆ క్రమంలోనే.. నిరంజన్ చిన్నప్పటి గర్ల్‌ఫ్రెండ్ అలీస్‌తో కలుపుతుంది అతణ్ణి. ఇరువైపుల పెద్దలూ ఆ పెళ్లికి అంగీకరిస్తారు. ఆ సంతోషంలో.. ఆ రాత్రి.. అన్నతో ... ‘‘నిరంజన్ నీకు కూతురు పుడితే... పిచ్చిపిచ్చి రిస్ట్రిక్షన్స్ పెట్టకు. సెల్‌ఫోన్స్.. మెయిల్స్ చెక్ చేయకు...’’ అని ఆమె చెప్తూంటే అన్నిటికీ ‘‘సరే’’ అంటూంటాడు నిరంజన్. ‘‘ఆమె బాయ్‌ఫ్రెండ్ సిగరెట్ అడిగితే ‘నో స్మోకింగ్’ అంటూ లెక్చర్స్ ఇవ్వకు’’ అంటుంది.. ‘‘నో.. దీనికి ఒప్పుకోను’’ అంటాడు అతను. నవ్వుకుంటారు. ఆమె నిద్రపోయాక వ్యాన్ దిగి వెళ్లిపోతాడు నిరంజన్.తెల్లవారుతుంది. ఎందుకో డౌట్ వచ్చి వ్యాన్ దగ్గరకు పరిగెత్తుకొస్తాడు నిరంజన్. చెల్లి కనిపించదు. అంతా వెదుకుతాడు.. డిక్కీతో సహా. ఎక్కడా కనిపించదు. ఏడుస్తాడు.. పొగిలి పొగిలి. ‘‘నేను వచ్చిన పని అయిపోగానే వెళ్లిపోతా’’ అన్న చెల్లెలి మాటలు గుర్తొస్తాయి. ఆ వ్యాన్‌ను ఆప్యాయంగా తడిమి వెనుదిరుగుతాడు. నిరంజన్‌కు అలీస్‌తో పెళ్లవుతుంది. జానకి మళ్లీ పుడుతుంది.అసలు సంగతి ఏమిటంటే, నిరంజన్ చెల్లి జానకి బ్లడ్ క్యాన్సర్‌తో చనిపోతుంది. అందుకే ఇండియా వస్తాడు నిరంజన్. ఆ వ్యాన్‌లో ఉన్నది ఆమె ఆత్మ. సరస్వతి రమ -
అయస్కాంతంతో బంధాలు పదిలం!
న్యూయార్క్: అయస్కాంతంతో ఎక్కువగా గడిపే ప్రేమికుల మధ్య అనుబంధం మరింత దృఢంగా ఉంటుందని టెక్సాస్‌కు చెందిన ఏ అండ్ ఎమ్ వర్సిటీ పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధనలో 18-22 మధ్య వయసున్న విడిపోయిన జంటలు పాల్గొన్నాయి. వీటిలో కొన్ని జంటలకు అయస్కాంతం ముక్కల్ని ఇచ్చి ఆడమన్నారు. మరికొన్ని జంటలకు అయస్కాంతశక్తి లేని ముక్కల్ని ఇచ్చి ఆడమన్నారు. అయస్కాంతంతో ఆడిన ప్రేమికుల మధ్య గాఢమైన అనుబంధం ఉన్నట్లు, అయస్కాంతంతో ఆడిన వారిలో వ్యక్తుల పట్ల ప్రేమ, గాఢమైన అనుబంధం వంటి లక్షణాలను పరిశోధకులు గుర్తించారు. ఈ తాజా అధ్యయనం ఇటీవలే ప్లస్ వన్ జర్నల్ లో ప్రచురితమైంది.