భార్య ప్రేమ భర్త మనసుకు తెలుస్తుంటుంది. భార్య ద్వేషం కూడా భర్తకు తెలుస్తుంటుంది. ఈ రెంటికీ కారణాలు ఉంటాయి. కాని భార్యకు ద్వేషం ఉండి ప్రేమ నటిస్తుంటే? మనసు లోపల ఏ అనుబంధం మిగుల్చుకోకుండా కేవలం నాటకీయమైన ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటే? ఆ సంగతి భర్తకు తెలిసిపోతూ ఉంటే? ఆ భర్త దానిని ఎలా అర్థం చేసుకోవాలి?
సునంద ఆ రోజు భర్త ఆఫీసుకు ఫోన్ చేసింది. ‘ఏమండీ ఏం చేస్తున్నారు?’ అడిగింది. ‘భోజనం చేశారా?’ అడిగింది. ‘ఇంటికి ఎప్పుడొస్తున్నారు?’ అడిగింది. ‘తొందరగా వచ్చేయండి మరి’ అని గారం పోయింది. భార్య ఫోన్ పెట్టేశాక రామచంద్రం ఆశ్చర్యపోయాడు. భార్య తన పట్ల కొంచెం జంకుగా ఉంటుంది. తను కొంచెం సరదాగా మాట్లాడితే తనూ సరదాగా మాట్లాడుతుంది. తన మూడ్‌ని బట్టి వ్యవహరిస్తుంది. అనవసర చనువు తీసుకోదు. అలాంటిది ఇలా ఫోన్ చేసి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంటికి వెళితే భార్య ఉత్సాహంగా ఎదురు వచ్చింది. ‘ఇవాళ ఏం వండానో చెప్పుకోండి చూద్దాం’ అంది. ‘ఏం వండావు?’ ‘మీకిష్టమని పాలకూర చికెన్ చేశాను’ ‘ఓ’... ‘పిల్లలేరి?’ ‘వాళ్ల రూమ్‌లో టీవీ చూసుకుంటున్నారు లేండి.
కాసేపట్లో పడుకుంటారు. స్నానం చేస్తారా? ముఖం కడుక్కుని భోజనం చేస్తారా?’ రామచంద్రం మళ్లీ ఆశ్చర్యపోయాడు. ఆఫీసు నుంచి వచ్చాక రాత్రుళ్లు అతడు స్నానం చేయడు. ఇన్నేళ్లలో ఎప్పుడూ చేయలేదు. ఇదేం ప్రశ్న. ‘ముఖమే కడుక్కుంటాను’ ‘కడుక్కోండి మరి’ అని అతడు బాత్‌రూమ్‌లో సింక్ దగ్గర ముఖం కడుక్కుంటూ ఉంటే టవల్ పట్టుకుని బాత్‌రూమ్ డోర్ దగ్గర నిలబడింది. ‘ఏంటి సునందా.. ఏమైనా కావాలా? ఏమైనా కొనుక్కోవాలా?’ అడిగాడు రామచంద్రం, భార్య తాపత్రయానికి నిజంగానే ఏదైనా అడిగితే ఇద్దామని. ‘నాకేం కావాలండీ. మీరుంటే అదే పది వేలు. మీతో కాపురం తప్ప ఇంకేం కావాలి?’ అంది సునంద నవ్వుతూ. ఉదయం పూట పిల్లల్ని స్కూల్‌కి హుషారుగా తయారు చేస్తోంది సునంద. అంతకు ముందు పిల్లలను అప్పుడప్పుడు కసిరేది. విసుక్కునేది లేటవుతుంటే. ఇప్పుడలా లేదు. ముద్దు చేస్తోంది. భర్త రావడంతోటే ‘ఒక్క నిమిషం అండీ’ అని హడావిడిగా వెళ్లి టీ పెట్టుకుని వచ్చి ఇస్తోంది.
ఆ రోజు పిల్లల కోసం ఉప్మా, అతని కోసం పూరీ చేసింది. ‘ఉప్మా ఏం తింటార్లేండి మీరు. పూరి తినండి’ అని కర్రీతోపాటు ఆవకాయ కూడా తెచ్చి పెట్టింది. అతడు రెడీ అయ్యి బైక్ తీసి ఆఫీసుకు బయలుదేరుతుంటే బాక్స్ తెచ్చి చిరునవ్వుతో నిలబడింది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లిపోయింది. రామచంద్రంకు గుటకలు పడ్డాయి. ఈమె ఇలా ఎందుకు మారిపోయింది.రామచంద్రంకు, సునందకు పెళ్లయ్యి పదేళ్లు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. రామచంద్రంకు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు. సునంద తల్లిదండ్రులే బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. ఉద్యోగంలో వచ్చేది గొప్ప జీతం కాకపోయినా వారి సపోర్ట్ వల్ల పిల్లల్ని మంచి బడిలో చదివిస్తున్నాడు. రామచంద్రంకు బయట పెద్ద వ్యాపకాలు లేవు. ఆఫీసు, ఇల్లు.. అంతే తెలిసింది. సునందతో విపరీతంగా మాట్లాడటం కబుర్లు చెప్పడం అలా ఏమీ చేయడు. అతిగా వ్యవహరించడం అనుకుంటాడు. సునంద కూడా మామూలుగా బిహేవ్ చేస్తుంది.
ఇద్దరిలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఎంత ఉందో తెలియకపోయినా ద్వేషం మాత్రం లేదు. అనుబంధం ఉంది. ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉంది. కాని సునంద ప్రవర్తన ఇలా మారడం అతడికి విచిత్రంగా ఉంది. పదకొండు గంటలకు భార్య వాట్సప్ నుంచి ముద్దులు, లవ్ సింబల్స్ వచ్చాయి. ఇది ఇంకా స్ట్రేంజ్. సునంద వాట్సప్ వాడటం బహు తక్కువ. పిల్లలకు స్నాక్స్ అయిపోయినప్పుడు, వంట మరీ బద్దకించినప్పుడు ఫుడ్ తెచ్చుకోమనో పెడుతుంది. ఇలా ముద్దులు గిద్దులు పెట్టదు. రామచంద్రం ఆ మెసేజ్‌లు చూసి ఆ తర్వాత పనిలో పడిపోయాడు. రాత్రి కాస్త లేట్ కూడా అయ్యింది. ఇంటికొచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. పిల్లలను అప్పటికే నిద్ర పుచ్చేసినట్టుంది. సునందను చూసే సరికి అదిరిపోయాడు. ఏడ్చి ఏడ్చి ఉన్నట్టుగా కళ్లు ఎర్రగా అయిపోయి ఉన్నాయి. చాలా డిస్ట్రబ్డ్‌గా కనిపించింది. విసురుగా ఉన్నాయి కదలికలు. ‘ఏమైంది?’ అన్నాడు కంగారుగా.
‘మీరు నా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదు’ అంది. ‘సునందా... ఏమిటి నీ ప్రవర్తన’ అని అనునయంగా అన్నాడు రామచంద్రం. ఆ రాత్రంతా సునంద ఏడుస్తూ ఉంది. రామచంద్రం ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు. ఇది చాలా విపరీత ప్రదర్శన అనుకుని రెండు మూడు రోజులు సైలెంట్‌గా ఉండి ఆ తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాడు రామచంద్రం. ఆమెను లోపల వదిలి తాను తప్పుకున్నాడు.సునందను చూసిన సైకియాట్రిస్ట్ ‘తొందరేమీ లేదు మెల్లగా మాట్లాడుకుందాం’ అని మంచినీళ్లిచ్చింది. సునంద చామనఛాయగా ఉంటుంది. పుట్టుకతో మడమ మెలికపడి ఉండటం వల్ల కాలు కొంచెం ఎగరేసి నడుస్తుంది. గమనించి చూస్తే తప్ప ఆ తేడా తెలియదు. కాని లోలోపల ఆ లోపం పట్ల న్యూనత పెంచుకొని కాలేజీకి వచ్చేసరికి చదువు మానేసింది. కొన్ని సంబంధాలు ఈ కాలి లోపం వల్ల తప్పిపోయాయి. అప్పుడు తల్లిదండ్రులు ఈ రామచంద్రం సంబంధం వెతికి చేశారు.
ఇద్దరిదీ ఆర్థికంగా సమస్థాయి కాకపోయినా కూతురి కోసం దిగి వచ్చారు. రామచంద్రం ఊహల్లో ఉన్న భార్య వేరు. వచ్చిన భార్య వేరు. అయితే ఆ భార్యను అతడు ఎప్పుడూ ఆమెకు తెలిసేంత ప్రేమతో చూడలేదు. అలాగని దూరమూ లేడు. చాలా సాధారణ స్థాయిలో వ్యవహరించేవాడు. కాని అతడి లోపల ఉన్న ఏదో అసంతృప్తి అతని పిలుపు వల్ల తెలిసేది. ‘ఎల్.సునంద’ అని పిలిచేవాడు అప్పుడప్పుడు. ఆమె ఇంటి పేరు ఎల్ కాదు. ఎల్ అంటే ‘లెగ్’. ‘ఏమోయ్ లెగ్గూ’ అనేవాడు అప్పుడప్పుడు. ‘నల్ల పెళ్లాం’ అనేవాడు. వాటికి సునంద నవ్వి ఊరుకునేది కాని లోపలి ప్రేమ వ్యక్తం చేసేది కాదు. ఈ మధ్య ఆమెకు ఒక ఫేస్‌బుక్ ఫ్రెండ్ పరిచయమయ్యాడు. మొదటిసారి అతడు ‘మీరు బంగారమండీ’ అన్నాడు. ‘మీరు మహరాణి అండీ’ అన్నాడు. ‘మీ కళ్లల్లో స్వచ్ఛత అద్భుతం’ అన్నాడు. ‘నా కాలు సంగతి మీకు తెలియదు’ అని సునంద అంటే ‘కాలు ఎవరు చూస్తారండీ... మనసు చూడాలి’ అన్నాడు. ఇవన్నీ సునందకు కొత్త. అందుకే తబ్బిబ్బు అవుతోంది. అయితే అవన్నీ వేరే మగవాడి నుంచి వినడం ఆమెకు ఇష్టం లేదు.
అందుకే గిల్ట్ ఫీల్ అవుతోంది. ఆ గిల్ట్‌తో భర్త మీద అతి ప్రేమ మొదలెట్టింది. కొత్త స్నేహం కొనసాగించలేక, ఉన్న అనుబంధంలో తనకు కావలసింది పొందలేక ఆమె నలుగుబాటే ఈ కేస్. సైకియాట్రిస్ట్ అంతా విని భర్తకు విడిగా చెప్పింది–‘మీరు ఉట్టి భర్తగా కాకుండా ప్రేమించే భర్తగా మారాలి. లాలించే భర్తగా మారాలి. ఆమె లోపాలను దాటి ఇష్టపడే భర్తగా మారాలి. ఈ జన్మకు తనే మీ భార్య అని ఆమె అనుకుంటోంది. ఇద్దరు పిల్లల్ని కని ఇచ్చి జీవితాన్ని ఇచ్చి మీ నుంచి ఆశించే కొద్దిపాటి ప్రేమ కూడా పొందకపోతే ఆమె పరిస్థితి ఏమి కావాలి? చెప్పండి?’ అంది. రోజులు గడిచాయి. సునంద ఫేస్‌బుక్ నుంచి బయటకు వచ్చేసింది.రామచంద్రంకు స్పెషల్ కాల్స్ చేయడం లేదు. స్పెషల్ మెసేజెస్ పెట్టడం లేదు. కాని అతడు ఇంటికొచ్చాక టీవీ చూస్తూ చేయి పట్టుకుని దగ్గర కూచోబెట్టుకున్నప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా అతడి భుజాన తల వాల్చుతోంది.
– కథనం: సాక్షి ఫీచర్స్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment