‘‘మన నేల సుసంపన్నం... పోషకాలన్నీ ఉన్నాయి. కానీ... పోషకాహారలోపంతో బాధపడుతోంది మనదేశం. ఆరోగ్యాభిలాషులుగా మేము హెల్దీ లివింగ్ కోసం ఉద్యమించాం. మొక్కలతో పోషకాలందించాలనే సంకల్పాన్ని చేబూనాం. భూమి... మొక్క మనకు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. అందుకే మా ప్రయోగాలకు ఎర్త్ ఫుల్ అని పేరు పెట్టాం’’ తమను తాము బ్లాగ్‌లో ఇలా పరిచయం చేసుకున్నారీ అక్కాచెల్లెళ్లు. వాళ్ల పేర్లు సుధ, వేద. ఇద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్ ఇంజనీర్‌లు. కెరీర్‌లో కొత్త మలుపు గురించి సాక్షితో పంచుకున్నారిద్దరూ".
‘‘మా నాన్న సొంతూరు విజయవాడ దగ్గర మానికొండ. నాన్న వ్యాపార రీత్యా ఒడిశా, వైజాగ్, హైదరాబాద్‌లో పెరిగాం. అమ్మ ఏజీ ఎమ్మెస్సీ చదివింది. మమ్మల్ని ఐఐటీలో ఇంజనీరింగ్ చేయించాలనే సంకల్పం అమ్మదే. కోచింగ్‌కి చుక్కారామయ్య గారి ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చడం కోసమే హైదరాబాద్‌లో నల్లకుంటలో ఉండేవాళ్లం. నేను కెమికల్, చెల్లి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశాం. నాకు ఐటీసీ లిమిటెడ్‌లో ఉద్యోగం. హరిద్వార్‌లో పోస్టింగ్.
దాదాపు ఆరువందల మంది ఉద్యోగుల్లో ఒక్క అమ్మాయిని. అర్బన్ టచ్‌లో ఉద్యోగం చేసేటప్పుడు సొంత స్టార్టప్ ఆలోచన వచ్చింది. హైదరాబాద్‌కి వచ్చి ఎంబీఏ చేసి ఊబెర్‌లో లాంచింగ్ సమయంలో ఉద్యోగం చేశాను. ఇక వేద విషయానికి వస్తే... బ్యాంకింగ్‌రంగంలో ముంబయి, లండన్‌లలో చేసింది. సివిల్స్ కోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటూ మూడేళ్లు ప్రయత్నించింది. తనకు బిజినెస్ నాలెడ్జ్ ఎక్కువ. మీషో స్టార్టప్ కోసం బెంగళూరులో ఉద్యోగం చేసింది. ఈ సమయంలో కోవిడ్ ప్రపంచాన్ని కుదిపేసింది. వేద ఇంటి నుంచి పని చేయడానికి హైదరాబాద్‌కి వచ్చింది.
ఇద్దరమూ ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఆ సమయంలో బర్నింగ్ టాపిక్ ఆరోగ్యమే. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి వ్యాధినిరోధక శక్తి సమృద్ధిగా ఉండాల్సిన అవసరం గురించి ప్రపంచం అంతా మాట్లాడుతోంది. ఆహారం ద్వారా సమగ్ర ఆరోగ్యాన్ని పొందడం గురించి డాక్టర్లు చెబుతున్నారు. కానీ పరిపూర్ణమైన పరిష్కారం అందుబాటులో లేదప్పటకి. మనకు తెలిసింది... మంచి ఆహారం తీసుకోవడం, అనారోగ్యం వస్తే ఔషధాలు తీసుకోవడం మాత్రమే. ఈ రెండింటికీ మధ్య ఫుడ్ సప్లిమెంట్ అనే మరొక ప్రత్యామ్నాయం ఉందని మనదేశంలో అవగాహన చాలా తక్కువ. మేము ఆ చైతన్యం కోసమే పని చేస్తున్నాం’’ అన్నారు సుధ.
సీట్‌లో కూర్చోవడం నుంచి మొదలు...
‘‘మేమిద్దరం కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశాం. పనిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరడానికి విపరీతంగా శ్రమించేవాళ్లం. ఆఫీస్ వర్క్‌లో దేహకదలికలు తగినంత ఉండవు. యాసిడ్ రిఫ్లక్స్‌తో సమస్యలు జీర్ణవ్యవస్థ నుంచి మొదలవుతాయి. బ్యాక్ పెయిన్ వరకు వెళ్తుంది. ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసేటప్పటికే దేహం శక్తిని కోల్పోయి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ దేహానికి కావల్సినంత శక్తి అందడం లేదని అర్థమవుతుంది. అనారోగ్యం ఏమిట’ని ప్రశ్నిస్తే ఫలానా అని ఏమి చెప్పాలో అర్థం కాదు.
డాక్టర్ సూచన మేరకు ఐరన్, క్యాల్షియమ్, ప్రొటీన్, విటమిన్‌లతోపాటు మైక్రో న్యూట్రియెంట్స్‌తో కూడిన మందులు వాడుతాం. మందులు ఆపేసిన రెండు వారాలకు మనతో స్నేహం చేయడానికి తిరిగి నీరసం, నిస్సత్తువలు దరి చేరతాయి. మా జనరేషన్ మాత్రమే కాదు, కొంచెం అటూ ఇటూగా సమాజంలో ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇంట్లో దీర్ఘకాలంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న మా నాన్నను చూస్తున్నాం.
బలహీనమవుతున్న దేహం
మనం అనుసరిస్తున్న డైలీ రొటీన్ ఆరోగ్యానికీ– అనారోగ్యానికీ మధ్య ఉండాల్సిన రక్షణరేఖ చెరిపేసిందనిపించింది. ముఖ్యంగా ఇండియన్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలైతే మరీ విడ్డూరం. అనారోగ్యమేమీ ఉండదు. నడవాలంటే మోకాళ్లు నొప్పులు, కూర్చోవాలంటే వెన్నునొప్పి, బరువు ఎత్తితే భుజం నొప్పి, త్వరగా అలసిపోవడం, నీరసం. నిజానికి ఇవేవీ అనారోగ్యాలు కావు. మనం దేహానికి అవసరమైన పోషకాలందకపోవడం వల్లనే అని మా అధ్యయనంలో తెలుసుకున్నాం.
పాశ్చాత్య దేశాల్లో అయితే రోజూ ఆహారంతోపాటు ఫుడ్ సప్లిమెంట్‌లు కూడా తీసుకుంటారు. నిజానికి మన దేహానికి అవసరమైన పోషకాలన్నింటినీ ఆహారం ద్వారా అందించడం అంత సులువైన పనేమీ కాదు, పోషకాహార పట్టిక, న్యూట్రిషనిస్టుల సూచన ప్రకారం ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైనంత ఐరన్ ఆహారం ద్వారా అందాలంటే తొమ్మిది కప్పుల పాలకూర తినాలి. మా రీసెర్చ్‌లో తెలుసుకున్న విషయాలతోనే సమాజం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరికింది. అదే మా స్టార్టప్ అయింది. మా ఎర్త్‌ఫుల్ బోర్డ్ సభ్యులుగా డాక్టర్, న్యూట్రిషనిస్ట్, ఫుడ్ ఎక్స్‌పర్ట్‌లున్నారు.
ఆకు నుంచి గింజ వరకు...
ప్రకృతి మనకు అవసరమైన అన్నింటినీ సమగ్రంగా, సమతూకంగా ఇచ్చింది. కానీ మనమే లైఫ్‌స్టయిల్‌ని పక్కదారి పట్టించుకున్నాం. జామపండుని కొరికి తినాలంటే దంతాలు సహకరించవు. దాంతో గింజలను వదిలేయడమో లేదా రెడీమేడ్ జ్యూస్‌లు తాగడమో చేస్తున్నాం. దాంతో గింజల ద్వారా అందాల్సిన పోషకాలను కోల్పోతున్నాం.
జామ ఆకులో జింక్ ఉంటుందని తెలిసినప్పుడు మేము కూడా ఆశ్చర్యపోయాం. ఇలాంటి వాటిని సులువైన రూపంలో అందించడమే మా ప్రయత్నం. అలాగే ఆరోగ్యం పట్ల చైతన్యవంతం చేయడం కూడా. వ్యాపారం అంటే డబ్బు సంపాదన కోసం మాత్రమే కాకూడదు. సామాజిక బాధ్యత ఉండాలి. అలాగే నైతిక విలువలతో కూడినదై ఉండాలి. సమాజాన్ని ఆరోగ్యవంతం చేయడంలో మా కృషి ఉంటోందంటే కలిగే సంతృప్తిని మాటల్లో వివరించలేం.
బాక్స్ మార్కెట్ మా వెంట వస్తోంది!
భూమ్మీద జీవించాల్సిన మనిషి కోసం భూమి అన్నింటినీ మొక్కల రూపంలో ఇచ్చింది. వాటిని తెలుసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. ‘భూమి నుంచి ఉద్భవించిన మొక్కల ఆధారంగా ఫుడ్ సప్లిమెంట్స్ తయారు చేస్తున్నాం, మొక్కల్లో మనకు అవసరమైనవన్నీ ఉన్నాయ’ని చెప్పాలనే ఉద్దేశంతో మా స్టార్టప్‌కి ఎర్త్‌ఫుల్ అని పెట్టాం. ఈ స్టార్టప్ కోసం చేసిన హోమ్ వర్క్ చిన్నది కాదు.
ఈ జర్నీలో మేము ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్తేజితులమవుతున్నాం. తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు బ్లాగ్‌లో, ఎఫ్‌బీలో షేర్ చేసుకుంటూ ఉండడంతో స్టార్టప్ ప్రారంభించేటప్పటికే మాకు ఫాలోయింగ్ బాగా వచ్చేసింది. దాంతో మార్కెటింగ్ కోసం ప్రయాస పడాల్సిన అవసరం లేకపోయింది. అవుట్‌లెట్‌లే స్వయంగా మా ఉత్పత్తులను అడుగుతున్నాయి. కానీ మా ఉత్పత్తులు కమర్షియల్ కావడం మాకిష్టం లేదు’’
– సుధ, వేద, ఫౌండర్స్, ఎర్త్‌ఫుల్ , హైదరాబాద్
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
(చదవండి: ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!)
Comments
Please login to add a commentAdd a comment