ఆనందించే క్షణాలను ప్లాన్ చేసుకున్నారు
కాలగమనం ఎలా ఉంటుంది?
నడకా? పరుగా? ప్రవాహమా?
కాలంతో
ప్రయాణించేవారిని అడగాలి.
2014 ఎలా కదలబోతోంది?
వడివడిగానా? వాయువేగంతోనా? జలపాతంలానా?
కాలాన్ని
దౌడు తీయించేవాళ్లని అడగాలి.
దౌడు తీయించేవాళ్లా!
వాళ్లెక్కడుంటారు?
చైనాలో!
చైనా వాళ్లకిది ‘హార్స్’ ఇయర్!!
మరి మన దగ్గర?
సురేందర్‌రెడ్డి! ‘రేసుగుర్రం’ డెరైక్టర్.
ఆ సినిమా రిలీజ్ అయ్యాక...
ఆయనకు కళ్లెం వేయడం
కష్టం కావచ్చు.
అందుకే ‘సాక్షి’ ముందుగా వెళ్లి...
‘మనసే జతగా..’
ఇంటర్వ్యూ తీసుకుంది.
మూడుముళ్ల తర్వాతి
మూడేళ్ల కాలం
ఎలా గడిచిందని అడిగింది.
ఈ దంపతుల
సమాధానం ఏంటో తెలుసా?
పక్కా ప్లాన్ ప్రకారం నడిచిందని!
మీరూ అంతే ప్లాన్డ్గా
ఉండాలని కోరుకుంటూ...
విష్యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్!
సురేందర్‌రెడ్డి: పుట్టింది కరీంనగర్‌లోనైనా పెరిగింది వరంగల్‌లో! మాది పెద్ద కుటుంబం. డిగ్రీవరకు చదువుకున్నాను. చదువుకునే రోజుల్నుంచే సినిమాలంటే విపరీతమైన ఇష్టం. 2005లో ‘అతనొక్కడే’ సినిమాతో డెరైక్టర్‌గా ఈ రంగంలోకి వచ్చాను. మా ఇద్దరి కుటుంబాలకు దూరపు చుట్టరికం ఉంది. మొదటిచూపులోనే మా సంబంధం ‘ఓకే’ అయ్యింది. అలా మే 28, 2010న పెద్దల ఆశీర్వాదంతో ఒక్కటయ్యాం. దీప అప్పటికే ఎయిర్ హోస్టెస్. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. పెళ్లి తర్వాత ఎడిటింగ్ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత ఇంటి గురించి ఆలోచించి తను బయటి వర్క్ మాను కుంది. పుస్తకాలు విపరీతంగా చదువుతుంది. అందులో ఉండే మంచి మంచి కథనాలు చెబుతుంది. ఏ పని చేసినా నాకు ఎలా హెల్ప్ అవుతానా! అని ఆలోచిస్తుంది. ఆ ఆప్యాయత నన్ను కట్టిపడేస్తుంది.
మాది పెద్ద కుటుంబం కావడంతో ఎవరి ఇష్టాలు ఎలాంటివో తెలుసుకోవడానికి దీపకు కొంత సమయం పట్టింది. ఇప్పుడు మాత్రం వారికేం కావాలన్నా చేయడంలో నాకన్నా తనే ముందుంటుంది.
దీపలాగ ముఖ్యమైన రోజులు నాకు గుర్తుండవు. పెళ్లికి ముందు పుట్టినరోజులు చేసుకున్నదే లేదు. కాని పెళ్లయ్యాక నా మొదటి పుట్టిన రోజుకి దీప గతంలో నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు, సినిమాలకు వచ్చిన విమర్శలు, ప్రశంసలు.. అన్నీ కలిపి ఒక ఆల్బమ్‌గా చేసి ఊహించ ని కానుకగా ఇచ్చింది. చాలా సర్ప్రైజ్గా అనిపించింది. ఆల్బమ్ తయారీ కోసం మూడు నెలలు వర్క్ చేసిందని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. ఇప్పటికీ నాకు ఊహించని కానుకలు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటుంది.
నేను ఇంట్లోకి రావడంతోనే జాన్ (దీప) నా మూడ్ ఎలా ఉందో గమనిస్తుంది. ఏ మాత్రం డిస్టర్బ్డ్గా ఉన్నట్టుగా అనిపించినా కామ్‌గా ఉండిపోతుంది. ‘నా వర్క్ పరిస్థితి, ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందో’ ఆ తర్వాత అయినా తప్పక చెబుతాను. తనూ అలాగే అర్థం చేసుకుంటుంది. అందుకే సెట్స్‌లో నా వర్క్‌ని నేను ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాను.
దీప: మా అమ్మన్నాలది వరంగల్! నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో! మా కుటుంబంలో నేను పెద్దదాన్ని. డిగ్రీ చదివాను. మా ఇద్దరిని చూసినవాళ్లు ‘మీది లవ్మ్యారేజా?’ అని అడుగుతుంటారు. ‘అవును’ అని నవ్వుతూ చెబుతుంటాను. ఏడాది వయసున్న మా బాబు ఆరిక్తో ఆనందంగా ఉండటమే ప్రధానంగా మా దాంపత్యం కొనసాగుతుంది.
పెళ్లప్పుడు కండిషన్స్ పెట్టుకున్నదేమీ లేదు. కాని ‘నేనూ మీ సినిమాలకు సంబంధించిన వర్క్ చేస్తాను’అని చెప్పాను. ఈయనా ‘సరే’ అన్నారు. కాని ఆ తర్వాత ‘ఇద్దరం వర్క్ అని వెళ్లిపోతే ఎలా’ అనిపించింది, ఒకరు ఇంట్లో ఉండి రెండవవారి బాగోగులు చూసుకోవాలి. ఈయనకు ఎలాగూ సినిమాయే ప్రపంచం కాబట్టి ఆ ప్రపంచానికి దగ్గరగా ఉంచడమే మంచిది’ అనుకున్నాను.
అత్తారింట్లో చిన్నకోడలిని. నేనేదంటే అది అన్నట్టుగా ఉంటారు అంతా! నాకు నచ్చినట్టుగానే కాకుండా అందరూ మెచ్చినట్టుగా ఉండటానికి, నాకు నేను సర్దుబాట్లు చేసుకోవడానికి ఆరునెలలకు పైగానే సమయం పట్టింది. మా పెళ్లయిన కొన్నాళ్లకు మా నాన్నగారు సడెన్‌గా చనిపోయారు. అప్పటినుంచి ఈయన మా అమ్మకు కొడుకులా ఉన్నారు. ‘కెరియర్ ఏది ఎంచుకోవాలి’ అనే మీమాంసలో మా చెల్లెలు (దివ్య) ఉంటే ఈయన ప్రోత్సాహంతోనే తను ఇప్పుడు టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది. మంచి పేరు తెచ్చుకుంటోంది. అత్తింటి వారినీ అర్థం చేసుకునే వ్యక్తి నా భర్త కావడం నా అదృష్టం.
ఖర్చులు, పెట్టుబడులు, రాబడులు.. ఏదైనా ముందుగా చెప్పడం మొదటి నుంచీ ఈయనకు అలవాటు. ‘నాకెందుకు?’ అన్నా వినిపించుకోరు. అన్ని విషయాలూ భాగస్వామికి తెలియాలంటారు. ఈయనకు స్టైల్ డెరైక్టర్ అని కూడా పేరు. నా కోసం ఈయన ఏం తెచ్చినా చాలా బాగా నప్పుతుంది. అయితే నేను మాత్రం ఆ సాహసం చేయను.
ఎంత వర్క్ అయినా సరే! ఆ ఒత్తిడిని ఇంటికి తీసుకురారు. ఏదైనా టెన్షన్ ఉన్నా బయటపడరు. అందుకే నేనూ సినిమా విషయాలు ఇంట్లో అస్సలు ప్రస్తావించను. ఎంతమందిలో ఉన్నా ఈయన ధ్యాస అంతా చేయబోయే సీన్స్, లోకేషన్ మీదే ఉంటుంది. మొదట్లో అర్థమయ్యేది కాదు. కోపం వచ్చేది. కాని వెంటనే నేనే రియలైజ్ అయ్యేదాన్ని. ఈ మూడేళ్లలో చాలా సహనం అలవడింది (నవ్వుతూ).
- నిర్మలారెడ్డి
మా రూల్స్
వీలు దొరికితే ఇద్దరం దూరప్రయాణాలకు వెళుతుంటాం. ఇక ముందూ అలాగే వెళ్లాలి. దూరప్రయాణాలు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత దగ్గరచేస్తాయి.
మాకెప్పుడూ చుట్టూ మనుషులు ఉండాలి. అందుకు ఇద్దరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలుసుకునే సందర్భాలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల అందరితో బంధాలు బాగుంటాయి.
మా అబ్బాయి ఆరిక్తో ఎక్కువ సమయం గడపాలి.
జాన్ (దీప) బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇద్దరం దానికి తగిన ప్రిపరేషన్ చేయాలి.
వర్క్‌తోపాటు ఇద్దరమూ ఆనందించే క్షణాలను పెంచుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి.