బాంబు ఉందని బెదిరించింది భారతీయుడే
న్యూఢిల్లీ: ముంబయి నుంచి దుబాయ్ వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానం అనూహ్యంగా మస్కట్‌లో దించివేయడానికి ఓ భారతీయ యువకుడే కారణమని పోలీసులు నిర్ధారించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకునేందుకు పంజాబ్‌లోని లూధియానా పోలీసులు సిద్ధమయ్యారు. గురువారం దుబాయ్ వెళ్లాల్సిన భారత జెట్ ఎయిర్ వేస్ 9డబ్ల్యూ 536 విమానంలో బాంబు ఉన్నట్లు ట్వీట్ రావడంతో మస్కట్‌లో దించివేసిన విషయం తెలిసిందే.
దీంతో అసలు ఆ సమాచారం ఎలా వచ్చింది.. బాంబు ఉన్నట్లు చెప్పిందెవరు అని శోధించగా రాజస్ధాన్‌లోని జైపూర్‌కు చెందిన సురేందర్ ప్రతాప్ అనే పాతికేళ్ల యువకుడు సమాచారం ఈ పనిచేశాడని గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నాలుగు లేదా ఐదు రోజుల కిందటే ప్రతాప్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియని ఆ యువకుడు సాధారణంగా సరదాగా ఈ పోస్ట్ చేసినట్లు అతడిని ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. అయితే, రాజస్థాన్ పోలీసులకు తాము సమాచారం ఇచ్చామని, ప్రతాప్ చెప్పిన విషయాలే కాకుండా పూర్తి సమాచారం తమకు అందించాలని కోరినట్లు వివరించారు.