సమగ్ర భూ సర్వేకు సంసిద్ధం
భూసేకరణ రికార్డుల మోడలైజేషన్
1950 నుంచి 2014 వరకు వివరాల సేకరణ
వచ్చే మార్చి 30 నాటికి శాటిలైట్ సర్వే పూర్తి
ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన
సర్వే పూర్తయితే భవిష్యత్తులో వివాదాలకు చోటుండదు
సర్వేయర్ అండ్ ల్యాండ్ ఆర్డీడీ కందుల వెల్లడి
నూజివీడు రూరల్ : భవిష్యత్తో భూవివాదాలు నెలకొనకుండా ఉండేలా సమగ్ర భూసర్వేకు సంసిద్ధమవుతున్నామని సర్వేయర్ అండ్ ల్యాండ్ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కందుల వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేషనల్ ల్యాండ్ రికార్డు మోడలైజేషన్ ప్రాజెక్టు కింద సమగ్ర భూసర్వేకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1950 నుంచి 2014 వరకు ఇచ్చిన అసైన్డ్ భూముల వివరాలను సేకరించి సమగ్ర మార్పులు చేస్తున్నామన్నారు. భూసేకరణ రికార్డులను తీసివేసి మోడలైజేషన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్లో ఎన్ని సబ్డివిజన్లు ఉన్నాయనే సమాచారం సేకరించి.. గతంలో ఉన్న సబ్డివిజన్లకు ప్రస్తుతం ఉన్న సబ్డివిజన్లను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2015 మార్చి 30 నాటికి శాటిలైట్ సర్వే వివరాలను పూర్తిచేసి ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన ప్రారంభించాల్సి ఉందన్నారు. ప్రత్యక్ష భూపరిశీలనకు ఒక్కొక్క మండలానికి ఐదుగురు సర్వేయర్లు, ఇద్దరు వీఆర్వోలు, ముగ్గురు లెసైన్స్ సర్వేయర్లు అవసరమవుతారని చెప్పారు.
భూ సర్వేకు ఇబ్బందిగా మారనున్న సర్వేయర్ల కొరత
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యక్ష భూసర్వేలు నిర్వహించడానికి సర్వేయర్ల కొరత ఇబ్బందికరంగా మారుతుందని ఆర్డీడీ చెప్పారు. రీజనల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలోని 277 మండలాలకు గాను 92 మండలాల్లో సర్వేయర్లను ప్రభుత్వం నియమించలేదన్నారు. భవిష్యత్లో భూవివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రత్యక్ష భూసర్వేకు సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందని, కాని అందుకు తగినట్లుగా సర్వేయర్ల నియామకం లేకపోవడం ఇబ్బందికరంగా మారుతుందని చెప్పారు. అందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్ష భూసర్వే నిర్వహించారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసర్వేకు సిద్ధమవుతోందని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్వహించే సమగ్ర భూసర్వే పూర్తయితే భవిష్యత్లో భూవివాదాలకు చోటుండదని ఆయన తెలిపారు.