Sutirtha Bhattacharya
-
నేడు రిలీవ్ కానున్న ‘భట్టాచార్య’
గోదావరిఖని(కరీంనగర్) : కోల్ఇండియా చైర్మన్‌గా నియమితులైన సుతీర్థ భట్టాచార్య శనివారం సింగరేణి సీఎండీ విధుల నుంచి రిలీవ్ కానున్నారు. అలాగే ఈనెల 30 లేదా 31వ తేదీన కోల్ఇండియా సీఎండీగా బొగ్గు శాఖ అదనపు కార్యద ర్శి ఏకే.దూబే నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. 1985 ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన భట్టాచార్య గడిచిన రెండేళ్లుగా సింగరేణి సీఎండీగా పనిచేస్తున్నారు. కోల్ఇండియా చైర్మన్‌గా వ్యవహరించిన 1986 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగరావు గత ఏడాది మే నెలలో కోల్ఇండియా సీఎండీ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి సీఎండీ లేకపోవడంతో బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. బొగ్గు పరిశ్రమపై కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు 2015 జనవరి 6వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు కోల్ఇండియాలో సమ్మె చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వం భట్టాచార్యను వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన 30 లేదా 31వ తేదీల్లో సీఐఎల్ సీఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే శనివారం రిలీవ్ కానున్న భట్టాచార్యను హైదరాబాద్ సింగరేణి భవన్లో సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘాలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ నాయకులు ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కోల్ ఇండియా చీఫ్‌గా సుతీర్థ భట్టాచార్య ఖరారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియాకు కొత్త చైర్మన్, ఎండీగా సుతీర్థ భట్టాచార్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వ సంస్థల ఎంపికలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీ(ఏసీసీ) ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1985 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన భట్టాచార్య ప్రస్తుతం సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ప్రభుత్వ సంస్థల ఎంపిక బోర్డ్(పీఎస్ఈబీ) గత నెలలోనే కోల్ ఇండియా చైర్మన్ పదవికి భట్టాచార్యను ఎంపిక చేసింది. ఈ పదవిని చేపట్టేందుకు మొత్తం 18 మంది అభ్యర్థులు పోటీపడ్డ సంగతి తెలిసిందే. -
రైల్వే ద్వారానే బొగ్గు రవాణా సాధ్యం
సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య రెబ్బెనలో వార్ఫ్ లోడింగ్ పాయింట్ ప్రారంభం రెబ్బెన(ఆదిలాబాద్) : సింగరేణి గనుల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గును విద్యుత్ ఉత్పాదక సంస్థలకు సరిప డా అధించాలంటే అది రైల్వే ద్వారానే రావాణా చేయడం సాధ్యపడుతుందని సింగరేణి సీఎండీ సుతీర్థభట్టాచార్య అన్నారు. మండల కేంద్రానికి సమీపంలో సింగరేణి సంస్థ లీజుకు తీసుకున్న వార్ఫ్ లోడింగ్ పాయింట్‌ను బుధవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఇమోషన్ వేబ్రిడ్జితోపాటు రైలు వ్యాగన్ ద్వారా బొగ్గు రవాణాను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ నుంచి రవాణా చేసిన బొగ్గు లక్ష్యానికి మూడు మిలయన్ టన్నులు అధికమని, ఇది కేవలం రైల్వే ద్వారానే సాధ్యపడిందని పేర్కొన్నారు. ఎకో ఫ్రెండ్లీ డిస్ప్యాచ్ పద్ధతిలో రైల్వే ద్వారా బొగ్గు రవాణా చేస్తున్నామని, ఇందులో 18 శాతం సింగరేణి సంస్థ నుంచే జరిగిందన్నారు. ఏరియాలో నిర్మిస్తున్న సీహెచ్‌పీ ద్వారా బొగ్గును రవాణా చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం లేదా అంతకు ముందే చర్యలు చేపడుతామని చెప్పారు. సింగరేణి పరీవాహక ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కంపెనీ కట్టుబడి ఉందని, ఇందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందజేస్తామని తెలిపారు. రామగుండం ఏరియా అడ్రియాల ప్రాజెక్టులో 2.81 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన భూగర్భ గనిలో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని, ఇది సింగరేణి సాధించిన రికార్డు అని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సమష్టి కృషితో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును అందించేందుకు సంస్థలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వార్ఫ్ లోడింగ్ పాయింట్లోనూ కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమాల్లో సింగరేణి డెరైక్టర్లు విజయ్‌కుమార్, రమేష్‌కుమార్, మనోహర్‌రావు, ఏరియా జనరల్ మేనేజర్ రాంనారాయణ, ఎస్‌ఓటూ జీఎం వెంకటేశ్వరరావు, ఏజీఎం నిర్మల్‌కుమార్, రీజియన్ సేఫ్టీ అధికారి జనార్ధన్‌రావు, ప్రాజెక్టు అధికారులు సంజీవరెడ్డి, కొండయ్య, డీజీఎం పర్సనల్ చిత్తరంజన్కుమార్, డీజీఎం సివిల్ రామకృష్ణ, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఈఈ సివిల్ రాజేంద్రప్రసాద్‌తో పాటు ఇతర డిపార్టుమెంట్ల అధికారులు పాల్గొన్నారు. -
సింగరేణి మనకే !
► కేంద్ర ప్రభుత్వ వాటాను కొనేద్దామని సీఎం కేసీఆర్ ప్రతిపాదన ► సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంస్థ యాజమాన్యానికి సూచన ► విదేశాల్లోనూ బొగ్గు తవ్వకాలకు చర్యలు చేపట్టాలని ఆదేశం ► సింగరేణి ఉద్యోగులకు టీ-ఇంక్రిమెంట్ ► డిపెండెంట్లు, డిస్మిస్డ్ కార్మికులకు ఉద్యోగ అవకాశాల కల్పన ► కోల్‌బెల్ట్ ప్రాంతంలో మెడికల్ కళాశాల ► ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: జాతికి నల్ల బంగారాన్ని అందిస్తున్న సింగరేణి నవశకానికి తెలంగాణ సర్కారు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఆ సంస్థను పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా రాష్ర్ట ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ వాటాల కొనుగోలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సింగరేణి యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కింద సింగరేణిని పూర్తిగా రాష్ట్రమే సొంతం చేసుకోవడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. సింగరేణి పనితీరుపై ఆ సంస్థ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. ప్రస్తుతం సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతంగా ఉంది. దీనివల్ల కీలక నిర్ణయాల్లో కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటోంది. కేంద్రం జోక్యం లేకుండా సంస్థ పూర్తిగా తెలంగాణ పర మైతే అన్నివిధాలా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే ఆస్ట్రేలియా, ఇండోనేసియా, చిలీ, మొజాంబిక్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో బొగ్గు బ్లాకులను తీసుకుని అక్కడ బొగ్గును ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. అందుకోసం పది మంది అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆయా దేశాల్లో పర్యటించాలని సూచించారు. కార్మికుల సంఖ్యను కొన్ని ప్రాంతాల్లో తగ్గించడంపై కేసీఆర్ ఆరా తీశారు. భూగర్భ గనుల్లో పనిచేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నప్పుడు, కొత్తగా భూగర్భ గనులను గుర్తించి ఉత్పత్తిని ఎందుకు చేపట్టడం లేదని అధికారులను ప్రశ్నించారు. దసరాలోపు ఒకట్రెండు భూగర్భ గనులను ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. మరో ఆరు భూగర్భ గనుల ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి రాయల్టీ కింద సింగరేణి సంస్థ ప్రతీ సంవత్సరం 1,200 కోట్ల రూపాయలు చెల్లిస్తోందని, అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1,500 కోట్ల నుంచి రూ. 1,600 కోట్లు చెల్లిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం పరిశ్రమ టర్నోవర్ రూ. 12,300 కోట్లుగా ఉందని వివరించారు. రాష్ట్రం వెలుపలి ఆస్తులు జాగ్రత్త! కృష్ణా జిల్లాలోని కొండపల్లి, విశాఖపట్టణం, విజయవాడలో సింగరేణికి ఉన్న భూములను పరిశీలించి, వాటి చుట్టూ కంచె వేయాలని అధికారులకు సీఎం సూచించారు. కొండపల్లిలోని సింగరేణి స్థలాలను డీమార్కెట్ చేసేలా కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కోరాలన్నారు. బొగ్గు గనుల వల్ల కలిగే వాయు, నీటి కాలుష్యంపై వివరాలను కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. గనులు ఉన్న ప్రాంతాల్లో కోటి మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. సింగరేణి చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల గురించి కూడా ముఖ్యమంత్రి వాకబు చేశారు. 2015 నవంబర్‌లో 600 మెగావాట్ల మొదటి ప్లాంటును ప్రారంభిస్తామని, 2016 ఫిబ్రవరిలో మరో 600 మెగావాట్ల ప్లాంటు అందుబాటులోకి వస్తుందని సంస్థ సీఎండీ సుతీర్థ భట్టాచార్య ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఈ రెండు ప్లాంట్లు వచ్చే సంవత్సరం నవంబర్లోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గును 65 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలని కూడా ఆదేశించారు. సింగరేణికి కార్పొరేట్ కళ తెప్పించాలని, భవిష్యత్తులో అతిపెద్ద బొగ్గు సరఫరా సంస్థగా ఎదిగేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు. సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకుని రావడం వల్ల రాష్ట్ర గౌరవం ఇనుమడిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విద్యుత్ ప్లాంట్లకు స్థలం ఇవ్వండి రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించనున్న 4,000 మెగావాట్ల ప్లాంటుకు 1,500 ఎకరాలు, తెలంగాణ జెన్కో రామగుండంలో, మణుగూరులో నిర్మించనున్న విద్యుత్ ప్లాంట్లకు మరో 2,000 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందని, ఆ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణిని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిస్మిస్ చేసిన, డిపెండెంట్ ఉద్యోగుల పిల్లలకు ఉపాధి అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే మాదిరిగా.. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వాలని, సమ్మె కాలానికి వేతనం ఇచ్చే విషయాన్ని చూడాలని కోరారు. సింగరేణిలో కార్మికుల పట్ల ఎలాంటి వివక్ష చూపెట్టరాదన్నారు. సింగరేణి విస్తరించిన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆసుప్రతులతో పాటు, ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్యతో పాటు జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, కార్మిక సంఘం నాయకులు కనకరాజు, రాజిరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు తమ యూనియన్ గౌరవాధ్యక్షురాలైన ఎంపీ కవితను, సింగరేణి యాజమాన్యాన్ని కలిసి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇప్పటికే రెండు రోజులుగా సింగరేణి సమస్యలపై యూనియన్ నేతలు ప్రాథమిక చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు - సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా కొనుగోలును పరిశీలించాలని అధికారులకు ఆదేశం - సింగరేణి సిబ్బందికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ - 2011 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 17 వరకు 35 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలని అధికారులకు ఆదేశం - మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు, విధులకు గైర్హాజరై డిస్మిస్ అయిన కార్మికులకు ఉద్యోగాలిచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచన. దీంతో 3,200 మంది డిపెండెంట్లకు, సుమారు 5 వేల మంది డిస్మిస్ కార్మికులకు ప్రయోజనం కలిగే అవకాశం. - కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఒక ప్రాంతంలో ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు. - సింగరేణి సంస్థ పరిధిలో ప్రస్తుతం 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఏటా 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉత్పత్తిని 65 మిలియన్ టన్నులకు పెంచాలని నిర్దేశం. - భూగర్భ గనులను, విద్యుత్ కేంద్రాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశం. విదేశాల్లో బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని సూచన. -
నేడు సింగరేణి బోర్డు ఆఫ్ డెరైక్టర్ల సమావేశం
గోదావరిఖని, న్యూస్‌లైన్: సింగరేణి సంస్థ బోర్డు ఆఫ్ డెరైక్టర్ల సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బొగ్గు ఉత్పత్తిపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. ఇదే అంశంపై సింగరేణివ్యాప్తంగా ఉన్న ఏరియాల జీఎంలతో డెరైక్టర్లు టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు పకడ్బందీ వ్యూహంతో సాగాలని డెరైక్టర్లు జీఎంలకు సూచించే అవకాశముంది. ఏపీ సర్వీస్‌లోకి సుతీర్థ భట్టాచార్య! సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య పదవీకాలం ఈనెల 11వ తేదీతో ముగియగా ప్రభుత్వం ఆయనకు పొడిగింపు ఇవ్వలేదు. గతంలో పనిచేసిన చాలామంది సీఎండీలకు పదవీకాలాన్ని పొడిగించగా సుతీర్థ భట్టాచార్య విషయంలో మాత్రం ప్రభుత్వం మిన్నకుండిపోయింది. భట్టాచార్య సైతం తన పదవీకాలం పొడిగింపు కోసం ఉత్సాహం చూపడం లేదని సమాచారం. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆయన ఆంధ్రప్రదేశ్ సర్వీస్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణికి కొత్త సీఎండీని నియమించే అవకాశముంది. -
భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి మిషన్ మైనింగ్ ఏర్పాటు
=అడ్రియాల లాంగ్వాల్ కోసం దేశం ఎదురు చూస్తోంది =సింగరేణి సీఅండ్ఎండీ సుతీర్థ భట్టాచార్య గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : భూగర్భ గనుల్లో పూర్తి స్థాయి మిషన్ మైనింగ్ ఏర్పా టు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య పేర్కొన్నారు. గురువారం ఉదయం గోదావరిఖనికి చేరుకు న్న ఆయన రామగుండం రీజియన్‌లో పర్యటించారు. ఏపీఏ పరిధిలోని జీడీకే-10ఏ ఆవరణలో ఏర్పాటు చేసిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ మినీబిల్డ్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థలలో సింగరేణికి మంచి పేరు ఉందని, అదే స్ఫూర్తితో దేశంలో నే మొదటి సారిగా ఏర్పాటు చేస్తున్న అడ్రియాల లాంగ్వా ల్ ప్రాజెక్ట్ పనులను చాలెంజ్‌గా తీసుకుని చేపడుతు న్నా మని తెలిపారు. బొగ్గు గనుల చరిత్రలోనే ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని, దీని కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తోందని చెప్పారు. అందుకు తగినట్టుగా అధికారులు, కార్మికులు కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రాజెక్ట్టు పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం పెరిగిందని, అయినా లాంగ్వాల్ మెషినరీని ఒకేసారి కొనుగోలు చేయడం వలన సంస్థకు ఆర్థికంగా లబ్ధి చేకూరినట్లు వివరించారు. ఓసీపీ-2 విస్తరణ పరంగా అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిందని, త్వరలో పనలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి ఆశించిన మేర రాలేదని, లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రం గా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఓసీపీ-1లో క్వారీ పరిశీలన ఆర్జీ-3 ఏరియా పరిధిలోని ఓసీపీ-1 ప్రాజెక్టును సీఎండీ సందర్శించారు. ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి క్వారీని పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడారు. డం పర్లు, డోజర్ల పనితీరుపై ఆరాతీశారు. ముఖ్యంగా బీఈఎంఎల్ సంస్థకు చెందిన కొత్తడోజర్లు, డంపర్లలో సాంకేతిక సమస్య లు తలెత్తుతున్నాయని, వీటి స్థానంలో కోమస్తు సంస్థకు చెందిన యంత్రాలను కొనుగోలు చేస్తే బాగుం టుందని అధికారులు సూచించారు. రాబోయే రోజుల్లో రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎండీ కోరారు. ఆయన వెంట ఏరియా జీఎం నర్సిం హారావు, ఏజెంట్ రవిప్రసాద్, మేనేజర్ నాగేశ్వర్రావు తదితరులున్నారు. ఆర్జీ-1 సీఎస్సీ ఫ్రీవే బంకర్ తనిఖీ ఆర్జీ-1 సీఎస్పీ ఇంజిన్ ఆన్ లోడింగ్ సిస్టమ్(ఈఓఎల్)లో ఫ్రీవే బంకర్ ద్వారా రైల్వే వ్యాగన్లో బొగ్గు నింపే ప్రక్రియ ను సీఎండీ తనిఖీ చేశారు. ఇటీవల శ్రీరాంపూర్ సీఎస్పీ నుంచి వ్యాగన్లలో ఎక్కువ బొగ్గు నింపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. కంప్యూటర్ సిస్టమ్‌లో బొగ్గు బరువును తూచే విధానాన్ని సింగరేణి సర్వర్‌కు అనుసంధానం చేయాలని సూచించా రు. సీఎండీ వెంట డెరైక్టర్లతోపాటు ఏరియా సీజీఎం కె.సుగుణాకర్‌రెడ్డి, రవిశంకర్, కె.చంద్రశేఖర్, పి.రమేశ్‌బాబు, బి.నాగ్య, రవిసుధాకర్‌రావు తదితరులు ఉన్నారు.