సింగరేణి మనకే ! | KCR proposals to get share of union government for singareni | Sakshi
Sakshi News home page

సింగరేణి మనకే !

Published Tue, Jul 22 2014 2:30 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

సింగరేణి మనకే ! - Sakshi

సింగరేణి మనకే !

కేంద్ర ప్రభుత్వ వాటాను కొనేద్దామని సీఎం కేసీఆర్ ప్రతిపాదన
సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంస్థ యాజమాన్యానికి సూచన
విదేశాల్లోనూ బొగ్గు తవ్వకాలకు చర్యలు చేపట్టాలని ఆదేశం
సింగరేణి ఉద్యోగులకు టీ-ఇంక్రిమెంట్
డిపెండెంట్లు, డిస్మిస్డ్ కార్మికులకు ఉద్యోగ అవకాశాల కల్పన
కోల్‌బెల్ట్ ప్రాంతంలో మెడికల్ కళాశాల
ఉన్నతాధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు

 
సాక్షి, హైదరాబాద్: జాతికి నల్ల బంగారాన్ని అందిస్తున్న సింగరేణి  నవశకానికి తెలంగాణ సర్కారు రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఆ సంస్థను పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా రాష్ర్ట ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ వాటాల కొనుగోలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సింగరేణి యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కింద సింగరేణిని పూర్తిగా రాష్ట్రమే సొంతం  చేసుకోవడానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
 
 ఈ దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. సింగరేణి పనితీరుపై ఆ సంస్థ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. ప్రస్తుతం సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం, కేంద్రం వాటా 49 శాతంగా ఉంది. దీనివల్ల కీలక నిర్ణయాల్లో కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటోంది. కేంద్రం జోక్యం లేకుండా సంస్థ పూర్తిగా తెలంగాణ పర మైతే అన్నివిధాలా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే ఆస్ట్రేలియా, ఇండోనేసియా, చిలీ, మొజాంబిక్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో బొగ్గు బ్లాకులను తీసుకుని అక్కడ బొగ్గును ఉత్పత్తి చేసే దిశగా సింగరేణి చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. అందుకోసం పది మంది అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆయా దేశాల్లో పర్యటించాలని సూచించారు. కార్మికుల సంఖ్యను కొన్ని ప్రాంతాల్లో తగ్గించడంపై కేసీఆర్ ఆరా తీశారు.
 
 భూగర్భ గనుల్లో పనిచేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నప్పుడు, కొత్తగా భూగర్భ గనులను గుర్తించి ఉత్పత్తిని ఎందుకు చేపట్టడం లేదని అధికారులను ప్రశ్నించారు. దసరాలోపు ఒకట్రెండు భూగర్భ గనులను ప్రారంభించేలా చూడాలని ఆదేశించారు. మరో ఆరు భూగర్భ గనుల ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి రాయల్టీ కింద సింగరేణి సంస్థ ప్రతీ సంవత్సరం 1,200 కోట్ల రూపాయలు చెల్లిస్తోందని, అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1,500 కోట్ల నుంచి రూ. 1,600 కోట్లు చెల్లిస్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రస్తుతం పరిశ్రమ టర్నోవర్ రూ. 12,300 కోట్లుగా ఉందని వివరించారు.
 
 రాష్ట్రం వెలుపలి ఆస్తులు జాగ్రత్త!
 కృష్ణా జిల్లాలోని కొండపల్లి, విశాఖపట్టణం, విజయవాడలో సింగరేణికి ఉన్న భూములను పరిశీలించి, వాటి చుట్టూ కంచె వేయాలని అధికారులకు సీఎం సూచించారు. కొండపల్లిలోని సింగరేణి స్థలాలను డీమార్కెట్ చేసేలా కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కోరాలన్నారు. బొగ్గు గనుల వల్ల కలిగే వాయు, నీటి కాలుష్యంపై వివరాలను కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. గనులు ఉన్న ప్రాంతాల్లో కోటి మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. సింగరేణి చేపట్టిన  విద్యుత్ ప్రాజెక్టుల గురించి కూడా ముఖ్యమంత్రి వాకబు చేశారు.
 
 2015 నవంబర్‌లో 600 మెగావాట్ల మొదటి ప్లాంటును ప్రారంభిస్తామని, 2016 ఫిబ్రవరిలో మరో 600 మెగావాట్ల ప్లాంటు అందుబాటులోకి వస్తుందని సంస్థ సీఎండీ సుతీర్థ భట్టాచార్య ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఈ రెండు ప్లాంట్లు వచ్చే సంవత్సరం నవంబర్‌లోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గును 65 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచాలని కూడా ఆదేశించారు. సింగరేణికి కార్పొరేట్ కళ తెప్పించాలని, భవిష్యత్తులో అతిపెద్ద బొగ్గు సరఫరా సంస్థగా ఎదిగేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్దేశించారు. సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకుని రావడం వల్ల రాష్ట్ర గౌరవం ఇనుమడిస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
 
 విద్యుత్ ప్లాంట్లకు స్థలం ఇవ్వండి
 రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించనున్న 4,000 మెగావాట్ల ప్లాంటుకు 1,500 ఎకరాలు, తెలంగాణ జెన్‌కో రామగుండంలో, మణుగూరులో నిర్మించనున్న విద్యుత్ ప్లాంట్లకు మరో 2,000 ఎకరాల స్థలం కావాల్సి ఉంటుందని, ఆ స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణిని ముఖ్యమంత్రి ఆదేశించారు. డిస్మిస్ చేసిన, డిపెండెంట్ ఉద్యోగుల పిల్లలకు ఉపాధి అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే మాదిరిగా.. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వాలని, సమ్మె కాలానికి వేతనం ఇచ్చే విషయాన్ని చూడాలని కోరారు. సింగరేణిలో కార్మికుల పట్ల ఎలాంటి వివక్ష చూపెట్టరాదన్నారు.
 
సింగరేణి విస్తరించిన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ ఆసుప్రతులతో పాటు, ఓ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్యతో పాటు జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, కార్మిక సంఘం నాయకులు కనకరాజు, రాజిరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ నేతలు తమ యూనియన్ గౌరవాధ్యక్షురాలైన ఎంపీ కవితను, సింగరేణి యాజమాన్యాన్ని కలిసి ప్రత్యేకంగా చర్చలు జరిపారు. ఇప్పటికే రెండు రోజులుగా సింగరేణి సమస్యలపై యూనియన్ నేతలు ప్రాథమిక చర్చలు జరిపారు.
 
ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు
 - సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా కొనుగోలును పరిశీలించాలని అధికారులకు ఆదేశం
 - సింగరేణి సిబ్బందికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్
 - 2011 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 17 వరకు 35 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్న కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణించాలని అధికారులకు ఆదేశం
 - మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు, విధులకు గైర్హాజరై డిస్మిస్ అయిన కార్మికులకు ఉద్యోగాలిచ్చే విషయాన్ని పరిశీలించాలని సూచన. దీంతో 3,200 మంది డిపెండెంట్లకు, సుమారు 5 వేల మంది డిస్మిస్ కార్మికులకు ప్రయోజనం కలిగే అవకాశం.
 - కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఒక ప్రాంతంలో ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు.
 - సింగరేణి సంస్థ పరిధిలో ప్రస్తుతం 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఏటా 55 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఉత్పత్తిని 65 మిలియన్ టన్నులకు పెంచాలని నిర్దేశం.
 - భూగర్భ గనులను, విద్యుత్ కేంద్రాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశం.
  విదేశాల్లో బొగ్గు ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని సూచన.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement