- సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య
- రెబ్బెనలో వార్ఫ్ లోడింగ్ పాయింట్ ప్రారంభం
రెబ్బెన(ఆదిలాబాద్) : సింగరేణి గనుల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గును విద్యుత్ ఉత్పాదక సంస్థలకు సరిప డా అధించాలంటే అది రైల్వే ద్వారానే రావాణా చేయడం సాధ్యపడుతుందని సింగరేణి సీఎండీ సుతీర్థభట్టాచార్య అన్నారు. మండల కేంద్రానికి సమీపంలో సింగరేణి సంస్థ లీజుకు తీసుకున్న వార్ఫ్ లోడింగ్ పాయింట్‌ను బుధవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఇమోషన్ వేబ్రిడ్జితోపాటు రైలు వ్యాగన్ ద్వారా బొగ్గు రవాణాను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ నుంచి రవాణా చేసిన బొగ్గు లక్ష్యానికి మూడు మిలయన్ టన్నులు అధికమని, ఇది కేవలం రైల్వే ద్వారానే సాధ్యపడిందని పేర్కొన్నారు. ఎకో ఫ్రెండ్లీ డిస్‌ప్యాచ్ పద్ధతిలో రైల్వే ద్వారా బొగ్గు రవాణా చేస్తున్నామని, ఇందులో 18 శాతం సింగరేణి సంస్థ నుంచే జరిగిందన్నారు. ఏరియాలో నిర్మిస్తున్న సీహెచ్‌పీ ద్వారా బొగ్గును రవాణా చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం లేదా అంతకు ముందే చర్యలు చేపడుతామని చెప్పారు.
సింగరేణి పరీవాహక ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కంపెనీ కట్టుబడి ఉందని, ఇందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందజేస్తామని తెలిపారు. రామగుండం ఏరియా అడ్రియాల ప్రాజెక్టులో 2.81 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన భూగర్భ గనిలో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని, ఇది సింగరేణి సాధించిన రికార్డు అని వివరించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సమష్టి కృషితో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును అందించేందుకు సంస్థలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వార్ఫ్ లోడింగ్ పాయింట్‌లోనూ కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు.
కార్యక్రమాల్లో సింగరేణి డెరైక్టర్లు విజయ్‌కుమార్, రమేష్‌కుమార్, మనోహర్‌రావు, ఏరియా జనరల్ మేనేజర్ రాంనారాయణ, ఎస్‌ఓటూ జీఎం వెంకటేశ్వరరావు, ఏజీఎం నిర్మల్‌కుమార్, రీజియన్ సేఫ్టీ అధికారి జనార్ధన్‌రావు, ప్రాజెక్టు అధికారులు సంజీవరెడ్డి, కొండయ్య, డీజీఎం పర్సనల్ చిత్తరంజన్‌కుమార్, డీజీఎం సివిల్ రామకృష్ణ, ఏఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఈఈ సివిల్ రాజేంద్రప్రసాద్‌తో పాటు ఇతర డిపార్టుమెంట్ల అధికారులు పాల్గొన్నారు.