రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలు
సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో అనుసరిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలకు స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పలు అవార్డులు సొంతమయ్యాయి. పలు యూఎల్బీలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ప్రజాభిప్రాయమే ప్రాతిపదికగా ఈ ఏడాది మూడు దశల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించి, అవార్డులను ప్రదానం చేశారు.
ఇందులో రాష్ట్రానికి చెందిన పలు పట్టణాలు, నగరాలు ఉత్తమ ఫలితాలను సాధించి అవార్డులను సొంతం చేసుకున్నాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవçహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022 వేడుకలో రాష్ట్రానికి పలు అవార్డులు ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్’ అవార్డు దక్కింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మిలు ఈ అవార్డులను అందుకున్నారు.
జాతీయ టాప్–10లో మూడు యూఎల్బీలు
► స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలవగా, లక్ష కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు టాప్–10 కేటగిరీలో స్థానం సంపాదించాయి. వీటితోపాటు కర్నూలు, నెల్లూరు, కడప, రాజమహేంద్రవరం యూఎల్బీలు (అర్బన్ లోకల్ బాడీస్) కూడా టాప్–100 కేటగిరీలో నిలిచాయి.
► సౌత్ జోన్లో 50 వేల నుంచి లక్ష జనాభా కేటగిరీలో టాప్–100 యూఎల్బీల్లో రాష్ట్రంలోని 21 నగరాలు నిలిచాయి. ఇందులో పుంగనూరు మున్సిపాలిటీ 3వ ర్యాంకు, పులివెందుల 9వ ర్యాంకు సాధించాయి.
► 25 – 50 వేల జనాభా విభాగంలో 8 యూఎల్బీలు టాప్ 100 ర్యాంకింగ్‌లో నిలిచాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛ రాష్ట్ర రాజధాని నగరం’గా నిలవగా, 10–40 లక్షల జనాభా కేటగిరీలో విశాఖపట్నం ‘క్లీన్ బిగ్ సిటీ’గా అవార్డు పొందింది.
► సౌత్ జోన్‌లోని 50 వేలు– లక్ష జనాభా కేటగిరీలో ‘ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో పులివెందుల, 25–50 వేల జనాభా కేటగిరిలో సాలూరు అవార్డు సాధించగా, ప్రజాభిప్రాయం విభాగంలో పుంగనూరును మున్సిపాలిటీ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇదిలావుండగా, ఇండియన్ స్వచ్ఛతా లీగ్ విభాగంలో మిలియన్ ప్లస్ కేటగిరీలో విశాఖపట్నం ‘టాప్ ఇంపాక్ట్ క్రియేటర్’ అవార్డును సొంతం చేసుకోగా, ప్రత్యేక కేటగిరీలో శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్, పొదిలి యూఎల్బీలు అవార్డులను అందుకున్నాయి. చెత్త రహిత నగరాల్లో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లు ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ సాధించాయి.
సీఎం విప్లవాత్మక నిర్ణయాల వల్లే అవార్డులు
గత మూడేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే నిదర్శనమని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో ఈ అవార్డులను అధికారులతో కలిసి అందుకున్న అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలోని 123 స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 పోటీలో పాల్గొన్నాయి.
ఇందులో ఏపీ మునుపెన్నడూ లేని విధంగా అవార్డులను గెలుచుకోవడం ఒక రికార్డు. గతంలో చంద్రబాబు సీఎంగా తన సొంత నియోజకవర్గం కుప్పంను అభివృద్ధి చేసుకోలేకపోవడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అదే సమయంలో పులివెందుల దేశ స్థాయిలో అవార్డును కైవసం చేసుకోవడం గమనార్హం’ అన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
అన్ని నగరాల అభివృద్ధికి పెద్దపీట
► చెత్త సేకరణ కోసం సుమారు 3 వేల వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. 1.25 కోట్ల చెత్తబుట్టలను ఇంటింటికి పంపిణీ చేశాం. పారిశుధ్య కార్మికుల వేతనాలను గణనీయంగా పెంచాం. అధికారులు, కార్మికుల సమిష్టి కృషి.. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల పనితీరు.. వీటన్నింటి వల్ల ఇన్ని అవార్డులు వచ్చాయి.
► పరిపాలనలో వికేంద్రీకరణ, అభివృద్ధి అనే ఒక ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న కారణంగా కేవలం విజయవాడ మాత్రమే కాకుండా ఇన్ని నగరాలు అభివృద్ధి చెందుతూ దేశ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరుకున్నాయి.
► రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ హౌజింగ్, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం. అన్ని మున్సిపాలిటీల్లో దశల వారీగా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గిస్తాం.
ఆధ్యాత్మిక నగరానికి అరుదైన గౌరవం
తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక స్వచ్ఛ సిటీ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలిలు అవార్డు అందుకున్నారు.
ఇంటింటా చెత్త సేకరణ, చెత్త తరలింపు, సెగ్రిగేషన్, ప్రాసెసింగ్ వంటి అంశాల్లో తిరుపతి నగరం మేటిగా నిలిచింది. బహిరంగ మరుగుదొడ్ల నిర్వహణ, సుందరీకరణ వంటి అంశాల్లోనూ సత్తా చాటింది. వ్యర్థపు నీటిని శుద్ధి చేయడం, వాటి ద్వారా ఆదాయం పొందడం, రైతులకు ఉచితంగా సరఫరా చేయడం వంటి అంశాల్లోనూ ఆదర్శంగా నిలవడంతో ఈ ఘనత దక్కింది.
తొలిసారిగా 5 స్టార్ రేటింగ్‌కు పోటీపడిన తిరుపతి అన్ని అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి.. ఆ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. గత కమిషనర్ పీఎస్ గిరీష, ఎమ్మెల్యే భూమనలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు నేడు సత్ఫలితాలను ఇచ్చాయి.