ప్రధాని మోదీ కలల ప్రాజెక్ట్‌లో చంద్రకళ
న్యూఢిల్లీ: అవినీతి పరులపై కొరడా ఝుళిపిస్తూ, సమర్థవంతమైన అధికారిణిగా పేరు తెచ్చుకున్న ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ బి. చంద్రకళకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం మీరట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న చంద్రకళ ప్రతిభను, నిజాయితీని, అంకితభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారు. మోదీ కలల ప్రాజెక్ట్ అయిన 'స్వచ్ఛ భారత్ మిషన్' డైరెక్టర్‌గా ఆమెను నియమించారు. అలాగే తాగునీరు, పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు.
2008 బ్యాచ్‌కు చెందిన బి. చంద్రకళ ఇంతకుముందు బిజ్నూర్, బులంద్షార్ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ఆమె అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల భరతం పడుతూ కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమె బాగా పాపులర్ అయ్యారు. ఆమె సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అంతేగాక కలెక్టర్ హోదాలో క్లీన్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. ఆమె సమర్థవంతమైన పాలన వల్లే ప్రధాని మోదీ దగ్గర గుర్తింపు పొందారు.