swadesi jagaran manch
-
ఆ పరిస్థితులు మారాయి: ఆర్ఎస్ఎస్ చీఫ్
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ అంటే అర్థం పూర్తిగా విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బుధవారం అన్నారు. ‘మేం మాకు కావాల్సినవి పరిస్థితులకు తగినట్టుగా కొంటాం’ అని తెలిపారు. ఒక వర్చవల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో ఉన్న వస్తువులను వాడతాం. స్వదేశీ అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదు. మంచి విషయాలు ప్రపంచలో ఎక్కడ ఉన్నా స్వీకరించాలి. మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో లభించే వస్తువులను ఉపయోగిస్తాం. స్వదేశీ అర్థం దేశీయ ఉత్పత్తులను ప్రోతహించడం. విదేశీ పెట్టుబడులపై పరిమితులను విధించడం. స్వయం ఆధారిత దేశాలు ఒకదానికి ఒకటి సాయం చేసుకోవాలి. ప్రపంచం అంటే ఒకే కుటుంబంలా ఉండాలి కానీ ఒకే మార్కెట్లా కాదు. స్వాతంత్రం వచ్చిన తరువాత మనం విదేశీ ఉత్పత్తులపై చాలా రోజులు ఆధారపడ్డాం. స్వదేశీ వస్తువులను, టెక్నాలజీని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారాయి’ అని ఆయన తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ లభ్యం కానీ టెక్నాలజీలను, వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకోవాలి అని కోరారు. చదవండి: ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు -
ఫ్లిప్‌కార్ట్ డీల్ : నేడు భారత్ బంద్‌కు పిలుపు
పుణే : అమెరికాకు చెందిన రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్, దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడాన్ని మొదట్నుంచి దేశీయ వర్తకులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ప్రభావం వర్తకులపై, చిన్న వ్యాపారాలపై తీవ్ర చూపనుందని ఆరోపిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ డీల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్లు(సియాట్) నేడు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా భారత్ బంద్‌కు మద్దతు తెలిపింది. ఈ డీల్‌తో మల్టి-బ్రాండ్ రిటైల్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బ్యాక్‌డోర్ నుంచి దేశంలోకి ప్రవేశిస్తాయని ట్రేడర్లు చెబుతున్నారు. ‘ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ దేశీయ ఎఫ్‌డీఐ పాలసీకి వ్యతిరేకంగా ఉంది. ఇది ఏడు కోట్ల ట్రేడర్లు, దేశంలోని చిన్న వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని సియాట్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల చెప్పారు. భారత్‌లోకి ఎఫ్‌డీఐల ప్రవేశాన్ని తాము అడ్డగించడం లేదని, కానీ వాల్‌మార్ట్, అమెజాన్‌తో పోటీపడేలా బలవంతం చేసేముందు, భారతీయ ట్రేడర్లకు కూడా ఆ స్థాయిలో మైదానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్టు సియాట్ కోఆర్డినేటర్ అజిత్ సేథియా అన్నారు. స్వదేశీ జాగ్రన్ మంచ్ కూడా మల్టి-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐను వ్యతిరేకిస్తోంది. అంతేకాక ఫ్లిప్‌కార్ట్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరిపించాలని డిమాండ్ కూడా చేస్తోంది. నేషనల్ కంపెనీ లా అప్పీలెంట్ ట్రిబ్యునల్‌లో వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్‌కు చెందిన కేసు విచారిస్తున్న సందర్భంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వాల్‌మార్ట్ ట్రిబ్యునల్ ముందు తన స్పందనలు కూడా తెలిపింది. ఈ విషయంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఈడీని, ఆర్బీఐని, సీసీఐని డిమాండ్ చేస్తున్నామని స్వదేశీ జాగ్రన్ మంచ్ కో-కన్వీనర్ అశ్వాని మహాజన్ అన్నారు. మల్టి బ్రాండులో ఎఫ్‌డీఐలు, ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్‌ను దెబ్బతీస్తాయని, వ్యవసాయదారులకు వ్యతిరేకంగా ఉంటాయని, ఉద్యోగాల సృష్టిని కూడా హరింపజేస్తాయని స్వదేశీ జాగ్రన్ మంచ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
భారీ డీల్‌పై భిన్న స్పందనలు
న్యూఢిల్లీ : దేశంలో మునుపెన్నడూ ఎరుగని భారీ విదేశీ డీల్‌కు బుధవారం తెరలేసిన సంగతి తెలిసిందే. అమెరికా రిటైల్ అగ్రగామి.. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను తన చేజిక్కించేసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటాను 16 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తూ... ఆ కంపెనీని తన సొంతం చేసుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ డీల్‌పై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్ దేశీయ స్టార్టప్‌ల విజయానికి ప్రతీకగా మార్కెట్ విశ్లేషకులంటుంటే.. ఈ డీల్ పూర్తిగా ‘అనైతికం’ అని, దేశ ప్రయోజనాలను ఇది దెబ్బతీస్తుందని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగ్రన్ మంచ్(ఎస్జేఎం) ఆరోపిస్తోంది. ఈ డీల్ భారత ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని చంపేస్తుందని హెచ్చరిస్తూ... ప్రధాని నరేంద్ర మోదీకి ఎస్జేఎం లేఖ రాసింది. ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన లేఖలో, ఈ డీల్ దేశీయ వ్యవస్థాపకతను, ఉద్యోగవకాశాల సృష్టిని హరింపజేస్తాయని, ఇది పూర్తిగా వ్యవసాయదారులకు వ్యతిరేకమని ఆరోపించింది. భారత మార్కెట్‌పై దాడి చేయడానికి వాల్‌మార్ట్ ఈ-కామర్స్ మార్గాన్ని ఎంచుకున్నట్టు పేర్కొంది. చాలా బరువెక్కిన హృదయంతో ఈ లేఖను తమకు రాస్తున్నామని, వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఎస్జేఎం కోరింది. దేశీయ కంపెనీలు తమ సంస్థలను అతిపెద్ద బహుళ జాతీయ సంస్థలకు విక్రయించేస్తున్నాయని, ఇది తమ దేశీయ మార్కెట్‌కు చాలా ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ డీల్స్ మార్కెట్లో పలు రకాల అంతరాయాలకు పురిగొల్పి, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను, చిన్న చిన్న దుకాణాలను అసలకే లేకుండా చేస్తుందని ఎస్జేఎం తన అంచనాలను వెలువరించింది. ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని, కింది స్థాయి వ్యాపారాలను కాపాడతారని ఆశిస్తున్నామని పేర్కొంది. చైనీస్ ఉత్పత్తులను దిగుమతి చేయడంలో వాల్‌మార్ట్ ప్రపంచంలో టాప్-7 దేశంగా ఉందని... ఇది చైనా ఉత్పత్తులను మన దేశంలోకి ప్రవేశపెట్టి, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను దెబ్బతీసి మేకిన్ ఇండియా కలను హరింపజేస్తుందని ఎస్జేఎం ఆరోపిస్తోంది. అటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఫ్లిప్‌కార్ట్-వాల్‌మార్ట్ డీల్‌ను వ్యతిరేకిస్తోంది. -
చైనా వస్తువులను నిషేధిద్దాం
స్వదేశీ జాగరణమంచ్ నెల్లూరు(బృందావనం): దేశప్రజలు చైనా వస్తువుల వాడకాన్ని నిషేధించి, దేశ ఆర్థిక, రక్షణరంగ వ్యవస్థ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని స్వదేశీ జాగరణమంచ్ రాష్ట్ర యూత్ కో–కన్వీనర్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు చైనా లోపాయకారిగా మద్దతు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్ధానిక గాంధీబొమ్మ సెంటర్లో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దొంగచాటుగా దేశంలోకి చొరబడుతూ మన సైనికులపై దాడులు చేస్తుంటే ప్రపంచంలోని దేశాలన్నీ ఈ వైఖరిని ఖండిస్తున్నాయన్నారు. అయితే మన దేశానికి మరో వైపున ఉన్న చైనా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవడం హేయమైన చర్యగా కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ దేశంలో తయారైన పలు మొబైల్ఫోన్లు, బాణసంచా తదితర సామగ్రిని కొనుగోలు చేయకుండా స్వదేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోళ్లను ప్రోత్సహించాలన్నారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆ సంస్థ సభ్యులు సుధాకర్‌శెట్టి, మధు, జాన్, జి.హరికృష్ణ, వై.హరికృష్ణ పాల్గొన్నారు.