చైనా వస్తువులను నిషేధిద్దాం
-
స్వదేశీ జాగరణమంచ్
నెల్లూరు(బృందావనం):
దేశప్రజలు చైనా వస్తువుల వాడకాన్ని నిషేధించి, దేశ ఆర్థిక, రక్షణరంగ వ్యవస్థ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని స్వదేశీ జాగరణమంచ్ రాష్ట్ర యూత్ కో–కన్వీనర్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు చైనా లోపాయకారిగా మద్దతు ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో స్ధానిక గాంధీబొమ్మ సెంటర్‌లో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దొంగచాటుగా దేశంలోకి చొరబడుతూ మన సైనికులపై దాడులు చేస్తుంటే ప్రపంచంలోని దేశాలన్నీ ఈ వైఖరిని ఖండిస్తున్నాయన్నారు. అయితే మన దేశానికి మరో వైపున ఉన్న చైనా పాకిస్తాన్‌కు మద్దతుగా నిలవడం హేయమైన చర్యగా కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ దేశంలో తయారైన పలు మొబైల్‌ఫోన్లు, బాణసంచా తదితర సామగ్రిని కొనుగోలు చేయకుండా స్వదేశంలో తయారైన ఉత్పత్తుల కొనుగోళ్లను ప్రోత్సహించాలన్నారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆ సంస్థ సభ్యులు సుధాకర్‌శెట్టి, మధు, జాన్, జి.హరికృష్ణ, వై.హరికృష్ణ పాల్గొన్నారు.