Swaminathan Committee
-
21వ శతాబ్దపు ఆవశ్యకాలు!
న్యూఢిల్లీ: తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. తాజా సంస్కరణలతో రైతులు తాము కోరుకున్న ధరకు, కోరుకున్న చోట తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు లభిస్తుందన్నారు. వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులని, అవి రైతులను నాశనం చేస్తాయని విపక్ష పార్టీలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులపై విమర్శలను ప్రధాని తిప్పికొడుతూ.. ‘చాన్నాళ్లు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన నిబంధనల సంకెళ్లలో రైతులను ఉంచి, వారికి అన్యాయం చేసి, వారిని దోపిడీ చేసిన కొందరు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నార’న్నారు. ‘వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల కొందరు ఆ రంగంపై పట్టు కోల్పోతున్నారు. వాళ్లే ఇప్పుడు కనీస మద్దతు ధరపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఏళ్లకేళ్లు గడిపిన వారే ఇప్పుడు మా నిర్ణయాలను విమర్శిస్తున్నారు’ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు తాజా బిల్లులు వ్యతిరేకం కాదని, ఆ మండీల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో 9 హైవే ప్రాజెక్టులకు సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసెస్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రికార్డు స్థాయిలో గోధుమలను ప్రభుత్వం సేకరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూనె ధాన్యాల సేకరణ 24 రెట్లు పెరిగిందని వివరించారు. -
ఈసారి ‘రైతన్న’ బడ్జెటే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతాంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాబోయే సాధారణ బడ్జెట్లో రైతులకు భారీగా తాయిలాలు ప్రకటించాలని యోచిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెటే అయినా చిన్న, సన్నకారు రైతుల్ని ఆకర్షించే నిర్ణయాలు తీసుకునే చాన్సుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం యోచిస్తున్న చర్యల్లో..పంట సాగుకు ముందే నగదు రూపంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు మంజూరు చేయడం లాంటివి ఉన్నట్లు తెలుస్తోంది. పంటల దిగుబడులు పెరిగినా ధరలు తగ్గకుండా ఉండేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే వీలుంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభ నివారణకు ఇటీవల బీజేపీ జాతీయ మండలి తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతులకు చేసిన దాని పట్ల బీజేపీ వర్గాలే సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలంటే వ్యవసాయ రంగానికి ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీపై ఒత్తిళ్లు అధికమైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ఏడాది ప్రకటించే బడ్జెట్ సంప్రదాయాల్ని తోసిరాజని, వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిపెట్టామని జైట్లీ ఇటీవల∙అన్నారు. రైతులకు భారీ పథకం ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బీజేపీ రైతు విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వ ప్రణాళికల్లో కొన్ని 1. రైతులకు నేరుగా నగదు రూపంలో ఇన్పుట్ సబ్సిడీ 2. రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు 3. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు -
రైతులు బంద్ ప్రకటిస్తే?
‘‘రైతే రాజు అంటారు. ఆ రాజే లేకపోతే ప్రజలు ఏమవుతారు? ౖరైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలన్నా.. వ్యవసాయం దండగ కాదు, పండగ కావాలన్నా డా.స్వామినాథన్ కమిటీ సిఫార్స్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి’’ అని ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘అన్నదాత సుఖీభవ’ రేపు రిలీజ్ అవుతోంది. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘పంటలకు మద్దతు ధర లేకుంటే రైతులు సహనం కోల్పోతారు. అలుగుటయే ఎరుగని ధర్మరాజు అలిగితే ఎలా ఉంటుందో.. గంగిగోవులాంటి రైతు కోపోద్రిక్తుడై రైతు బంద్ ప్రకటిస్తే ప్రజల పరిస్థితి ఏంటì ? అన్నదే మా సినిమా. సుద్దాల అశోక్‌తేజ, గోరటి వెంకన్న, గద్దర్, వంగపండు మంచి పాటలిచ్చారు’’ అన్నారు. -
భారీగా పెరగనున్న కూరగాయల ధరలు
న్యూఢిల్లీ : తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని కడుపు మండిన రైతులు రోడ్డెక్కారు. పంటకు కనీస మద్దతు ధరతో పాటు రైతులకు రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలంటూ ఏడు రాష్ట్రాల్లో రైతులు నిరసన ఉద్యమాలు చేపట్టారు. 10 రోజుల వరకు నిర్వహించనున్న ఈ నిరసనలు నేడు రెండో రోజుకు చేరుకున్నాయి. పాలు, కూరగాయల సరఫరాను రైతులు పూర్తిగా నిలిపేశారు. నిరసనలో భాగంగా పాలను రోడ్లపై పారబోశారు. కూరగాయలను రోడ్డుపై పడేశారు. రైతుల నిరసనతో మార్కెట్లలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పాలు, కూరగాయలు, పళ్లు తీసుకుని పట్టణాలకు వెళ్లే ప్రసక్తే లేదంటూ రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో పట్టణాల్లో కూరగాయల ధరలు, పాల ధరలు మండిపోతున్నాయి. 10రోజులపాటు సమ్మెకు దిగడంతో కూరగాయలు, పాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు తీవ్ర కొరత తప్పదని, ఈ ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే అంచనాలు వెలువడ్డాయి. 10 రోజుల వరకు పాల నుంచి పచ్చిమిర్చి దాకా అన్నింటిన్నీ బంద్ చేస్తామని రైతులు కూడా తేల్చి చెప్పేశారు. రైతుల నిరసనలతో మొదటి రోజే కూరగాయలు, పాల సరఫరా 50 శాతం వరకు పడిపోయింది. పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల రైతులు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 10న భారత్ బంద్‌ను కూడా రైతులు చేపట్టనున్నారు. -
రోడ్డెక్కిన రైతన్న
భోపాల్ / మందసౌర్ / చండీగఢ్ / లక్నో: రైతులకు రుణమాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుతో పాటు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ రైతు సంఘాలు శుక్రవారం దేశవ్యాప్తంగా 10 రోజుల ఆందోళనకు పిలుపునిచ్చాయి. ‘గావ్ బంద్’(గ్రామ బంద్) పేరిట చేపట్టిన ఈ ఆందోళనలో భాగంగా పట్టణాలు, నగరాలకు పాలు, కూరగాయాలు, పండ్లు, ఇతర నిత్యావసరాలను సరఫరా చేయరాదని నిర్ణయించాయి. పంజాబ్, హరియాణా, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కశ్మీర్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకల్లోని రైతు సంఘాలు హోల్‌సేల్, కూరగాయల మార్కెట్లను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. దీంతో పలు రాష్ట్రాల్లో రైతులు కూరగాయలు, పండ్లను రోడ్లపై పడేసి నిరసన తెలియజేశారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ‘గావ్ బంద్’ పేరిట శాంతియుత ఆందోళన చేపట్టినట్లు రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్(ఆర్‌కేఎంఎం) కన్వీనర్ శివకుమార్ శర్మ తెలిపారు. -
రైతుల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి
‘‘రైతులకు గిట్టుబాటు ధర ప్రకటిస్తే ఏ రైతూ ఆత్మహత్య చేసుకోడు. వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహ చిత్ర పతాకంపై ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వలో రూపొందించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘అన్నం పెట్టే రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పరిస్థితి మారాలి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇటువంటి పథకాలను దేశంలో అన్ని రాష్ట్రాల వారు రూపొందించాలి. స్వామినాధన్ కమిటీ రైతులకు ఏర్పాటు చేసిన గిట్టుబాటు ధర లభిస్తే దేశానికి వెన్నుముక్క లాంటి రైతు సంతోషంగా ఉంటాడు. అందరికీ అన్నం పెట్టే రైతు నోట్లోకి కూడా నాలుగు మెతుకులు వెళ్తాయి’’ అన్నారు. -
9 గంటల విద్యుత్ ఇవ్వాలి
నరసన్నపేట: టీడీపీ సర్కారు రైతులకు ఇచ్చిన పగలే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ హామీని అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం నరసన్నపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. టీడీపీ పాలనలో టీడీపీ విఫలమైందని ఆరోపించారు. అనంతరం రెవెన్యూ అధికారులకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణదాసు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన వాగ్దానాలాను అమలు చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు, మద్దతు ధర రానప్పుడు రైతుల కోసం రూ. 5 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని సూచించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు పంట ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం కలపి కనీస మద్దతు ధర ప్రకటించాలన్నారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి వచ్చారు. పార్టీ నాయకులు అధ్యక్షుడు సురంగి నర్శింగరావు, యాళ్ల కృష్ణంనాయుడు, చింతు రామారావు, ఆరంగి మురళి, కె.చంద్రభూషణగుప్తా, బగ్గు రమణయ్య, మోయ్యి లక్ష్మనాయుడు, కింతలి చలపతిరావు, రాజాపు అప్పన్న, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ రాష్ట్రానికి అప్రతిష్ట పాలు వైఎస్సార్ సీపీ నేత తమ్మినేని బూర్జ: అన్నపూర్ణగా పేరున్న రాష్ట్రానికి టీడీపీ పాలన వచ్చి అప్రతిష్ట తెచ్చిందని వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆయన ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్ కిరణ్‌కుమార్‌కి అందజేశారు. రాజధాని పేరు చెప్పి ప్రభుత్వం రైతులు భూములను కబ్జా చేసి వారిని కూలీలుగా మార్చే స్థితికి తెచ్చిందన్నారు. టీడీపీ మ్యానిఫెస్టో ప్రకారం డ్వాక్రా, చేనేత కార్మికలు రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయాలన్నారు. ఆందోళనలో జెడ్పీటీసీ సభ్యులు ఆనెపు రామకృష్ణ, ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, ఎంపీటీసీ సభ్యులు బూరి శ్రీరామ్మూర్తి, జడ్డు సురేష్, గండెం శ్రావణి, కొబగాన వేణుగోపాల్, సర్పంచులు వేపారి లక్ష్మీనారాయణ, జల్లు అప్పలస్వామినాయుడు, మామిడి రామచంద్రి నాయుడు, సత్యం, బాడె నర్సింహులు, నాయకులు గుమ్మిడి రాంబాబు, వియ్యపు కృష్ణ, కాగితాపల్లి జగన్, ఆనంద్, శ్రీను పాల్గొన్నారు. రైతు సమస్యలపై పోరాటం సీతంపేట: రైతు సమస్యలపై పోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ నేత, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కూలీల వలసలు నిరోధించాలన్నారు. అనంతరం డిప్యూ టీ తహశీల్దార్ నానిబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సవర లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు పాలక రాజబాబు, మండల కోఆప్షన్ సభ్యుడు మూర మోహన్‌రావు, సర్పంచులు సవర గోపాలు, సాయికుమార్, చెంచయ్య, రాము, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బి.ఆదినారాయణ, ఎంపీటీసీ సభ్యులు బాపయ్య, మండల కన్వీనర్ జి.సుమిత్రారావు, పార్టీ నేతలు బి.పకీరు, మంగయ్య, సురేష్, భామిని కార్యదర్శి ధర్మారావు పాల్గొన్నారు.