swamy agnivesh
-
స్వామి అగ్నివేష్ నిజాలను వక్రీకరిస్తున్నారు
► మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వేషన్లలో మాలలు మూడో వంతు ప్రయోజనాలను పొందుతున్నారని స్వామి అగ్నివేష్ నిజాలను వక్రీకరిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య విమర్శించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు చేపట్టిన ఆందోళన మంగళవారం 20వ రోజుకు చేరుకుంది. చెన్నయ్య మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ సూచనల మేరకు బిహార్‌లో నితీశ్ ప్రభుత్వం.. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించకుండా ఎస్సీలలో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందన్నారు. ఉషామెహ్రా కమిషన్ నివేదిక ప్రకారం మాలల కంటే మాదిగలు రెండు రెట్లు ఎక్కువగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు పొందుతున్నారని చెన్నయ్య తెలిపారు. -
వర్గీకరణకు వెంకయ్య చొరవ తీసుకోవాలి
- ఎమ్మార్పీఎస్ ఆందోళనలో స్వామి అగ్నివేష్ డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళనలో సోమవారం స్వామి అగ్నివేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ వెంకయ్య ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అత్యవసరమని.. మూడొంతుల రిజర్వేషన్ ఫలాలను మాలలు మాత్రమే పొందుతున్నారని వివరించారు. ఈ నెల 10న మహాధర్నాకు మాదిగలు ఢిల్లీకి తరలిరావాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ ఆందోళనలు సోమవారానికి 21వ రోజుకు చేరుకున్నాయి. ‘ఏబీసీడీ’తోనే ఐక్యత: మాలల కమిటీ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఆందోళనకు ‘మాలల సంఘీభావ కమిటీ’ మద్దతు ప్రకటించింది. ఎమ్మార్పీఎస్ దీక్షకు సంఘీభావంగా కమిటీ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన దీక్ష సోమవారానికి మూడో రోజుకు చేరుకుంది. వర్గీకరణను బలపరిస్తేనే మాల, మాదిగల మధ్య ఐక్యతకు పునాది ఏర్పడుతుందని కమిటీ కో కన్వీనర్ లోక్‌నాథ్ పేర్కొన్నారు. వర్గీకర ణ హామీని బీజేపీ విస్మరించింది అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బీజేపీ.. అధికారంలోకి వచ్చాక విస్మరించిందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు చేపట్టనున్న ఆందోళనలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పిడమర్తి మాట్లాడుతూ.. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలని కోరారు. -
ఫిలింసిటీ నిర్మిస్తే ఆత్మహత్యలు ఆగవు: స్వామి అగ్నివేశ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై స్వామి అగ్నివేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిలింసిటీ నిర్మిస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగవని అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వామి అగ్నివేశ్‌తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య, టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, సాక్షి ఈడీ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
'పీకే' చూడకుండా ఎవరూ విమర్శించొద్దు
బాలీవుడ్ చిత్రం 'పీకే'పై కొన్ని మతవర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో... ఊహించని మద్దతు లభించింది. ఈ చిత్రాన్ని చూడకుండా ఎవరూ వ్యతిరేకించవద్దని ఆర్య సమాజ్ నాయకుడు స్వామి అగ్నివేశ్ అన్నారు. ' పీకే' లాంటి సినిమాను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని పేర్కొన్నారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా వినోదపన్ను మినహాయింపు ఇవ్వాలని స్వామి అగ్నివేశ్ సూచించారు. ఈ చిత్రం ఎవరి మనోభావాలకు వ్యతిరేకంగా కాదని అభిప్రాయపడ్డారు. 'పీకే' చిత్రానికి యూపీ, బీహార్‌లో పన్ను మినహాయింపు ఇచ్చారు. -
ఆజాద్ ఎన్కౌంటర్ బూటకం
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ ఉరఫ్ ఆజాద్, జర్నలిస్టు హేమచంద్రపాండే ఎన్కౌంటర్ బూటకమని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ఆజాద్ ఎన్కౌంటర్ కేసులో సాక్షిగా సోమవారం జిల్లా క్రిమినల్ కోర్టుకు ఆయన హాజరయ్యారు. మెజిస్ట్రేట్ మేరి సారదనమ్మ ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆజాద్, హేమచంద్ర పాండేలను పోలీసులు దారుణంగా కాల్చిచంపారని పేర్కొన్నారు. తనను కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలు జరిపించేందుకు మధ్యవర్తిగా ఉండాలని కోరినట్లు తెలిపారు. అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం తనతో స్వయంగా మాట్లాడడంతో శాంతి చర్చలకు ఒప్పుకున్నాని పేర్కొన్నారు. ఆ తర్వాత 72 గంటలు కాల్పుల విరమించుకున్నామని, మావోయిస్టులు అడవి నుంచి బయటకు రావాలని ప్రభుత్వం చెప్పడంతో చాలా మంది మావోయిస్టులు బయటకు వచ్చారన్నారు. వాంకిడి అడవుల్లో కాల్చివేత మావోయిస్టు నేత ఆజాద్ కూడా బయటకు రాగానే పోలీసులు ఆయనను నాగ్‌పూర్‌లో బంధించి ఆదిలాబాద్‌లోని వాంకిడి అడవులకు తీసుకొచ్చి ఆజాద్‌తోపాటు జర్నలిస్టు హేమచంద్ర పాండేను కాల్చి చంపారని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించాలని చెప్పడంతో ఇక్కడ న్యాయపోరాటం చేసేందుకు దీనికి బాధ్యులైన వారిపై పిటిషన్ వేయడం జరిగిందన్నారు. బూటకపు ఎన్కౌంటర్ జరిగిందని కోర్టులో వివరించినట్లు తెలిపారు. ఆజాద్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తుందన్నారు. తొమ్మిది నెలలుగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. బూటకపు ఎన్కౌంటర్ నిజమైన ఎన్‌కౌంటర్‌గా చూపించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆజాద్ ఎన్కౌంటర్ కేసును ప్రత్యేక న్యాయ విచారణ బృందంతో దర్యాప్తు చేపట్టాలని కోరారు. అనంతరం ఆజాద్ భార్య పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న మావోయిస్టు ఎన్కౌంటర్లు రాజకీయ హత్యలేనని పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మళ్లీ ఈనెల 20న కోర్టుకు హాజరుకావాలని వాయిదా వేసినట్లు ఆమె పేర్కొన్నారు. వీరితోపాటు పద్మ తరఫు న్యాయవాది సురేష్‌కుమార్ ఉన్నారు. ‘తెలంగాణ’ తప్పక వస్తుంది.. తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పాటవుతుందని సామాజిక కార్యకర్త అగ్నివేశ్ అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో బాబు తనను కూడా కలిసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాఫియా పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం గురించి చర్చించారు.