వర్గీకరణకు వెంకయ్య చొరవ తీసుకోవాలి
- ఎమ్మార్పీఎస్ ఆందోళనలో స్వామి అగ్నివేష్ డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవాలని ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేపట్టిన ఆందోళనలో సోమవారం స్వామి అగ్నివేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ వెంకయ్య ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ అత్యవసరమని.. మూడొంతుల రిజర్వేషన్ ఫలాలను మాలలు మాత్రమే పొందుతున్నారని వివరించారు. ఈ నెల 10న మహాధర్నాకు మాదిగలు ఢిల్లీకి తరలిరావాలని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ ఆందోళనలు సోమవారానికి 21వ రోజుకు చేరుకున్నాయి.
‘ఏబీసీడీ’తోనే ఐక్యత: మాలల కమిటీ
ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఆందోళనకు ‘మాలల సంఘీభావ కమిటీ’ మద్దతు ప్రకటించింది. ఎమ్మార్పీఎస్ దీక్షకు సంఘీభావంగా కమిటీ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన దీక్ష సోమవారానికి మూడో రోజుకు చేరుకుంది. వర్గీకరణను బలపరిస్తేనే మాల, మాదిగల మధ్య ఐక్యతకు పునాది ఏర్పడుతుందని కమిటీ కో కన్వీనర్ లోక్‌నాథ్ పేర్కొన్నారు.
వర్గీకర ణ హామీని బీజేపీ విస్మరించింది
అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బీజేపీ.. అధికారంలోకి వచ్చాక విస్మరించిందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు చేపట్టనున్న ఆందోళనలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పిడమర్తి మాట్లాడుతూ.. కేంద్రం ఇప్పటికైనా స్పందించాలని కోరారు.