breaking news
Swargam -Narakam
-
స్వర్గం, నరకం అంతా మన లోపలే!
ఒకానొకసారి, ఓ బలవంతుడైన వస్తాదు జ్ఞానం, ప్రశాంతతకు పేరుగాంచిన బౌద్ధ గురువు వద్దకు వచ్చాడు. ఆ వస్తాదు అంటే అందరికీ భయమే. అతని హృదయం కోపంతో గందరగోళంగా ఉండేది. చేస్తున్న పనుల పట్ల చిరాకూ పరాకూ పడుతుంటేవాడు. అతను సన్యాసి వద్దకు వచ్చీ రావడంతోనే తలవంచి నప్పటికీ అహంకారంతో అడిగాడు: ‘గురువుగారూ! నాకు స్వర్గం, నరకం గురించి బోధించాలి’. సన్యాసి అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ‘నీకు వాటి గురించి చెప్పాలా? నీ మాటలో గర్వం కనిపిస్తోంది. నేను విడమరిచి చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు’ అన్నారు. ఆ మాటతో వస్తాదు కోపంతో ఊగిపోతూ, తన దగ్గరున్న కత్తిని తీసి ‘మీరన్న మాట నన్ను అవమానపరిచింది. నేను ఇప్పుడే మిమ్మల్ని చంపగలను’ అని అరిచాడు. సన్యాసి ఏమాత్రం కంగారు పడలేదు. అతని కళ్ళలోకి చూసి ప్రశాంతంగా చూస్తూ, ‘ఇదిగో ఈ నీ చర్యే నరకం’ అని చెప్పారు. వస్తాదు స్తంభించిపోయాడు. అతని కోపం కరిగిపోయింది. సిగ్గుపడ్డాడు. తన కత్తిని పక్కనపెట్టి సన్యాసి ముందు మోకరిల్లి, ‘క్షమించండి... నాకు వాస్తవాన్ని చిన్న మాటతో నేర్పించినందుకు ధన్యవాదాలు’ అని మృదువుగా అన్నాడు. సన్యాసి సున్నితంగా నవ్వి, ‘ఇదిగో ఇదే నువ్వడిగిన స్వర్గం’ అన్నారు. ఈ చిరుఘటన ధ్యానం సారాంశాన్ని చెబుతోంది. ధ్యానం జీవితం నుండి తప్పించుకోవడం గురించినది కాదు, అది మన అంతర్గత ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవడం గురించి చెప్పేది. ధ్యానం చేసినప్పుడు ఆలోచనలు, భావోద్వేగాలు సముద్రంలో అలల వలె పైకి ఎగరడం, కింద పడటం అనుభవంలోకి రావడం గమనిస్తాం. అప్పుడు ఆందోళనపడటం మానేసి, దాని కింద ఉన్న ప్రశాంతతను చూస్తాం. అందుకే బుద్ధుడంటాడు: ‘శాంతి లోపలినుండి వస్తుంది. బయట దానిని వెతక్కండి’ అని! -యామిజాల జగదీశ్ -
భారతీయ సినిమా చరిత్రలో ఆ గ్రాఫ్ మోహన్‌బాబుదే!
- దాసరి ‘‘ఏ దర్శకుడైనా ఒక నటుణ్ణి పరిచయం చేసి వదిలేస్తాడు. కానీ, మోహన్‌బాబుని నేనలా వదల్లేదు. సంపూర్ణమైన నటుడిగా తీర్చిదిద్ది, పరిశ్రమకు అందించాను. మోహన్‌బాబు కూడా 40 ఏళ్లుగా నాతోనే ఉన్నాడు. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, సావిత్రిలా వంద శాతం నటన కనబర్చగల నటుడు నా తరంలో మోహన్‌బాబు మాత్రమే. పరిపూర్ణమైన నటుడు అనిపించుకోవడంతో పాటు కష్టపడి తన పిల్లలను పైకి తీసుకొచ్చాడు. ఈ కుటుంబాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది’’ అని డా. దాసరి నారాయణరావు అన్నారు. మోహన్‌బాబుని నటుడిగా పరిచయం చేస్తూ, దాసరి దర్శకత్వం వహించిన ‘స్వర్గం-నరకం’ విడుదలై ఆదివారంతో 40ఏళ్లయ్యింది. నటుడిగా మోహన్‌బాబు నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వేడుకలో దాసరి, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి, హీరో వెంకటేశ్ పాల్గొన్నారు. మళ్లీ మోహన్‌బాబుతో చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తా దాసరి మాట్లాడుతూ - ‘‘భారతీయ సినిమా చరిత్రలో అమితాబ్, దిలీప్‌కుమార్, ఎన్టీఆర్.. ఇలా ఎవరికీ లేని కెరీర్ గ్రాఫ్ మోహన్‌బాబుకే ఉంది. ఏ నటుడైనా విలన్‌గా చేయడం మొదలుపెట్టాక దాదాపు అలానే కొనసాగుతాడు. ఒకవేళ హీరోగా చేయడం మొదలుపెడితే అదే చేస్తాడు. కానీ, మోహన్‌బాబు విలన్, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా చేస్తూ వచ్చాడు. హీరోగా కొనసాగుతున్న సమయంలో ఓసారి గ్యాప్ వస్తే, ‘గురువుగారూ.. మళ్లీ విలన్‌గా చేస్తా’ అంటే, ‘నువ్వు నటుడివి. చెయ్’ అన్నాను. అలా కొన్నాళ్లు విలన్‌గా చేసి మళ్లీ హీరోగా రాణించాడు. భారతీయ సినీ చరిత్రలో ఈ కెరీర్ గ్రాఫ్ మోహన్‌బాబుకే దక్కుతుంది. ఒక దర్శకుడికి శక్తి ఉండాలే కానీ, మోహన్‌బాబు నుంచి ఎంత నటనను అయినా రాబట్టుకోవచ్చు. మోహన్‌బాబు పడ్డవి సామాన్యమైన బాధలు కావు. అన్ని బాధలూ పడి, పిల్లల్ని పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు మంచి సినిమాలు రావడంలేదు. వెక్కిరింతలూ, వెటకారాలు, ఉంటున్నాయి. మళ్లీ మోహన్‌బాబుతో చరిత్రలో నిలిచిపోయే సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘భారతీయ సినిమా చరిత్రలో ఒక నటుడు 60 సినిమాలకు పైగా నిర్మించిన దాఖలాలు లేవు. ఆ ఘనత మోహన్‌బాబుకే దక్కుతుంది’’ అని టీఎస్సార్ అన్నారు. వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘నలభై ఏళ్లల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఆ పాత్రలు చేయగల నటులు లేరు. ‘ఎంతో సాధించినా మోహన్‌బాబు మనస్తత్వం మారలేదనీ, పిల్లల మనస్తత్వాల్లా చాలా ప్యూర్‌గా ఉంటుంది’ అని నాన్నగారు అనేవారు. అలా ఉండటం గ్రేట్’’ అని చెప్పారు. రెండు జతల బట్టలతో ప్రయాణం మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘చెన్నయ్‌లో సినిమా అవకాశాల కోసం తిరుగు తున్నప్పుడు రెండు జతల బట్టలతో ఒక షెడ్లో ఉండేవాణ్ణి. నెలకు అద్దె 25 రూపా యలు. ఓసారి మూడు నెలలు చెల్లించలేదు. నేను బయటికి వెళ్లి గదికి తిరిగి వచ్చే లోపు వంట చేసుకునే గిన్నెలో ఓనర్ చేయకూడని పని చేశాడు. వండుకుందామని గిన్నె తీసిన నేను వాసన భరించలేకపోయాను. గిన్నె కడిగి, ఆ రోజు పస్తు ఉన్నాను. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. నా గురువుగారు (దాసరి) నాకు సినీజీవితాన్ని ప్రసాదించారు. ఇంకా ఎంతోమంది దర్శక, నిర్మాతలు నన్ను ప్రోత్సహించారు. కష్టాలకోర్చి నిలబడ్డాను కాబట్టే, డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ తర్వాత మోహన్‌బాబు అనిపించుకోగలిగాను. నా తల్లిదండ్రుల ఆశీస్సులే నన్ను ఇంతటివాణ్ణి చేశాయి. మా నాన్నగారు టీచర్ కాబట్టి, విద్యాలయాలు ఆరంభించాను. 25 శాతం మందికి ఉచిత విద్య అందిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నా పట్ల కనబరుస్తున్న ప్రేమాభిమానాలు మర్చిపోలేనివి’’ అన్నారు. ఏడాది పాటు 40 వసంతాల వేడుకలు మోహన్‌బాబు వంటి తండ్రికి బిడ్డలు కావడం తమ అదృష్టం అని మంచు విష్ఱు, మంచు మనోజ్, లక్ష్మీప్రసన్న తెలిపారు. ఏడాదిపాటు 40 వసంతాల వేడుకలు జరపనున్నామని చెప్పారు. బెస్ట్ టీచర్ అవార్డ్‌కి సంబంధించిన వేడుక, ‘పెదరాయుడు’, ‘రాయలసీమ రామన్న చౌదరి’ స్క్రిప్ట్, తెరవెనక విశేషాలతో పుస్తకావిష్కరణ, పాపులర్ డెలాగ్స్‌తో పుస్తకం, విష్ణు ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మోహన్‌బాబు సినిమా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోల ప్రదర్శన, ఎవర్గ్రీన్ సాంగ్స్‌తో సీడీ, డీవీడీ, ‘పెదరాయుడు’ చిత్రాన్ని డిజిటలైట్ చేసి మళ్లీ విడుదల చేయడం... ఇలా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. మోహన్‌బాబుతో సినిమాలు తీసిన దర్శక-నిర్మాతలు, నటించిన నటీనటులతో విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న ఓ టాక్ షో చేయనున్నారు.


