ఈ దుర్మార్గం ఎవరి మెప్పు కోసం: స్వరూపానందేంద్ర
విశాఖపట్టణం: హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా విజయవాడలో దేవాలయాలను కూల్చివేస్తున్నారని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే దేవాలయాలను కూల్చి.. విగ్రహాలను ఈడ్చుకుంటూ తరలించడం మంచి పరిణామం కాదన్నారు. ఎవరి మెప్పు కోసం ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని ప్రశ్నించారు. ధనుర్మాస దీక్ష కోసం రుషికేశ్‌లో ఉన్న స్వామీజీ విజయవాడలో జరుగుతున్న పరిణామాలపై శనివారం స్పందించారు.
దేవాలయాల కూల్చివేతపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంఘాలు హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యయప్రయాసలకోర్చి ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి దేశంలో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో కారణజన్ములైన శంకరాచార్య, రామానుజాచార్య, మద్వాచార్యుల చేతుల మీదుగా ఎన్నో దేవాలయాలకు ప్రతిష్ఠాపన జరిగిందని గుర్తు చేశారు. అందులో స్వయంభూ, రుషిప్రతిష్టలు, ఆగమాలతో కూడిన ప్రతిష్టలు ఎన్నో ఉన్నాయన్నారు. అలాంటి దేవాలయాలను కృష్ణా పుష్కరాలు, రోడ్డు విస్తరణల పేరుతో శాస్త్ర విరుద్ధంగా కూల్చివేయడం, విగ్రహాలను తాళ్లతో కట్టి తీసుకువెళ్లడం ఎంతో అపచారమన్నారు.
ఒకవేళ నిజంగా ఆలయాలను కూల్చాల్సిన పరిస్థితి వస్తే ఏ ఆగమ పద్ధతుల్లో వాటిని ప్రతిష్టించారో..అవే ఆగమ పద్ధతుల్లో శాస్త్రోక్తంగా తొలగించాలన్నారు. కానీ ఇష్టానుసారంగా దేవాలయాలను కూల్చివేసి హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించారు. ఎవరి మెప్పు కోసం ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడ్డారో.. ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారో చెప్పాలన్నారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని స్వామీజీ డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని ప్రశ్నించిన వారి గురించి కొంతమంది నాయకులు నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, అధినాయకుల మెప్పు కోసం అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.