8 నెలలుగా వేతనాల్లేవ్..!
దౌల్తాబాద్: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్వీపర్లు, అటెండర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఎనిమిది నెలల వేతనాల్లేక పండుగ పూట పస్తులు ఉండాల్సిన దుస్థితి దాపురించిందని స్వీపర్లు ఆవేదన చెందుతున్నారు. పార్ట్‌టైం పేరుతో వీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం పాఠశాలల్లో 8గంటల పాటు పనిచేస్తున్నారు. గతంలో కనీస వేతనంగా రూ.6,700లుగా గుర్తించిన ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా వీరికి మాత్రం నామమాత్రంగా రూ.1,623 మాత్రమే వేతనంగా చెల్లిస్తుంది.
పెరిగిన నిత్యవసర ధరలతో వేగలేక పోతున్న సిబ్బందికి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా తొమ్మిది నెలల వేతనాలు చెల్లించలేదు. అసలే నామమాత్రపు జీతాలతో సతమతమవుతుంటే దాన్నీ సక్రమంగా చెల్లించకపోవడంతో వారి కష్టాలు చెప్పనలవి కావు. ప్రభుత్వ ఉదాసీనత, అధికారులు నిర్లక్ష్యం కారణంగా వారికి తిప్పలు తప్పడంలేదు. గతంలో వీరికి వేతనాలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు కాగితాలకే పరిమితమైంది.