స్విస్‌లో ‘శ్రీ’కారం
ఆటలో అనుభవం తక్కువే అయినా... పోరాటంలో మాత్రం కొదమ సింహం... పోటీ ఎలాంటిదైనా... ప్రత్యర్థి ఎవరైనా.. తెలుగు కుర్రాడి రాకెట్ జోరు మాత్రం తగ్గడం లేదు.. అడ్డనుకున్న డ్రాగన్లను కొడుతున్నాడు... అందని ద్రాక్షలు అనుకున్న టైటిల్స్‌ను వేటాడుతున్నాడు... ఇప్పుడు విదేశీ గడ్డలపై వరుసగా జెండాలూ పాతేస్తున్నాడు... 60 ఏళ్ల చరిత్ర కలిగిన స్విస్ ఓపెన్‌లో ఏ భారతీయుడూ సాధించని ఘనతను తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ అందుకున్నాడు. పురుషుల టైటిల్ నెగ్గి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు.
బాసెల్ (స్విట్జర్లాండ్): నిశ్శబ్ధ సంచలనానికి ప్రతిరూపంగా నిలుస్తూ భారత బ్యాడ్మింటన్ యువతార కిడాంబి శ్రీకాంత్ మరో గొప్ప విజయం సాధించాడు. ఆదివారం ముగిసిన స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. 47 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 21-15, 12-21, 21-14తో రెండో సీడ్, ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై గెలుపొందాడు. తద్వారా ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో పురుషుల విభాగంలో చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. గతంలో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్ విభాగంలో రెండుసార్లు (2011, 2012లో) విజేతగా నిలిచింది. ఈ ఏడాది సైనా ఈ టోర్నీలో పాల్గొనలేదు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 9 వేల డాలర్ల (రూ. 5 లక్షల 67 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
అక్సెల్సన్తో జరిగిన ఫైనల్లో రెండో గేమ్‌లో మినహా శ్రీకాంత్ ఆధిపత్యమే కనిపించింది. కళ్లు చెదిరే స్మాష్‌లు, బ్యాక్‌హ్యాండ్ షాట్లు, అద్భుతమైన డిఫెన్స్, నెట్‌వద్ద అప్రమత్తత... ఇలా పలు అంశాల్లో శ్రీకాంత్ రాణించి తన ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ పోటాపోటీగా తలపడినా స్కోరు 13-11 వద్ద శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు.
రెండో గేమ్‌లో శ్రీకాంత్ తడబడ్డాడు. అనవసర తప్పిదాలకు తోడుగా షటిల్ గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై పొరపాట్లు చేసి అక్సెల్సన్కు తేరుకునే అవకాశమిచ్చాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 4-7తో వెనుకబడ్డా పట్టుదల కోల్పోలేదు. అనవసరంగా ఆందోళన చెందకుండా నిగ్రహంతో ఆడుతూ స్కోరును సమం చేశాడు. స్కోరు 13-13 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ మూడు పాయింట్లు నెగ్గి 16-13తో ముందంజ వేశాడు. ఆ తర్వాత అక్సెల్సన్కు ఒక పాయింట్ కోల్పోయినా ఈ హైదరాబాద్ ప్లేయర్ వెంటనే జోరు పెంచి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి గేమ్‌ను 21-15తో సొంతం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
22 ఏళ్ల శ్రీకాంత్‌కిది అంతర్జాతీయస్థాయిలో మూడో గొప్ప విజయం. 2013 జూన్‌లో థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గి ఒక్కసారి వెలుగులోకి వచ్చిన శ్రీకాంత్... 2014 నవంబరులో చైనా ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లో బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌ను ఓడించి పెను సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్న శ్రీకాంత్... ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోయి నిరాశ కలిగించాడు. అయితే స్విస్ ఓపెన్‌లో నిలకడగా రాణించి చాంపియన్‌గా నిలిచి భారత పురుషుల బ్యాడ్మింటన్‌లో భవిష్యత్‌కు భరోసా ఇచ్చాడు.
స్విస్ ఓపెన్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన శ్రీకాంత్ 12 గేములు గెలిచి తన ప్రత్యర్థులకు 3 గేమ్‌లు సమర్పించుకున్నాడు. 295 పాయింట్లు నెగ్గి, 233 పాయింట్లు కోల్పోయాడు. అన్ని మ్యాచ్‌లు కలిపి కోర్టులో మొత్తం 248 నిమిషాలు గడిపాడు. టైటిల్ గెలిచే క్రమంలో ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, జపాన్, భారత్‌కు చెందిన క్రీడాకారులను ఓడించాడు. ఇందులో ఇద్దరు సీడెడ్ క్రీడాకారులున్నారు.
గోపీ సర్ వల్లే...
ప్రతి టోర్నమెంట్కీ దాని ప్రత్యేకత దానిదే. తొలిసారి స్విస్ ఓపెన్ గెలవడం ఆనందంగా ఉంది. చైనా ఓపెన్‌తో దీనిని పోల్చలేం. కానీ కెరీర్లో ప్రతి విజయం ప్రత్యేకమే. నాతో పాటు ఉన్న కోచ్‌లు, అకాడమీ కోచ్‌లు అందరికీ కృతజ్ఞతలు. నా కెరీర్లో గోపీ సర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన సహకారం లేకపోతే నేను ఈ టైటిల్స్ అన్నీ సాధించేవాడిని కాదు. టోర్నీల్లో బాగా ఆడుతూ ఉంటే... ర్యాంకింగ్ దానంతట అదే మెరుగుపడుతుంది.’
- స్విట్జర్లాండ్ నుంచి ‘సాక్షి’తో శ్రీకాంత్
చంద్రబాబు, జగన్‌ల అభినందన
స్విస్ టైటిల్ గెలిచిన తెలుగుతేజం శ్రీకాంత్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.