కారులో వ్యక్తి సజీవ దహనం
సిఫ్‌కాట్ : నిర్లక్ష్యం ఓ ప్రాణాన్ని బలిగొంది. కారులో మంటలు చెలరేగి సోదరుడి కళ్లెదుటే అన్న సజీవదహనమైన విషాద ఘటన గురువారం హొసూరులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరు తాలూకా, మాస్తికి చెందిన అస్లాం, షమీన్ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు సయ్యద్ జావిద్ (23)కు అదే ప్రాంతంలోని గొల్లపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. దీంతో అతను తన అన్న సయ్యద్ ఇనాయత్ (24)తో కలిసి గురువారం హొసూరులో ఉన్న బంధువులకు శుభలేఖలు పంచిపెట్టేందుకు మాస్తి నుంచి మారుతీ వ్యాన్‌లో బయల్దేరారు.
మార్గం మధ్యలో పెట్రోల్ ట్యాంక్ లీక్ కాగా డ్రైవింగ్ చేస్తున్న సయ్యద్ జావిద్ పసిగట్టాడు. హొసూరులో రిపేరు చేయిద్దామని అన్న పేర్కొనడంతో అలాగే చేరుకొన్నారు. మధ్యాహ్నం 3గంటలకు హొసూరు-రాయకోట రోడ్డు కూడలిలో వ్యాన్‌లో అకస్మికంగా మంటలు చెలరేగడంతో సయ్యద్జావిద్ కిందకు దూకేశాడు. వెనుకసీట్లో నిద్రిస్తున్న సయ్యద్ ఇనాయత్ మంటల్లో చిక్కుకున్నాడు. కళ్లెదుటే అన్న అగ్నికి ఆహుతవుతుండటాన్ని చూసిన జావిద్ స్పృహకోల్పోయాడు.
స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించి విఫలమయ్యారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే సయ్యద్ ఇనాయత్ పూర్తిగా సజీవదహనమయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గుర్తు పట్టలేని విధంగా మారిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన జావీద్‌ను సైతం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో లక్షల విలువైన వ్యాన్ కూడా పూర్తిగా దగ్ధమైంది. కేసు దర్యాప్తులో ఉంది.